365 Dishes :సంక్రాంతి పండుగ వస్తే కొత్త అల్లుళ్లకు అత్తారింటి వాళ్ళు సకల మర్యాదలు చేస్తుంటారు. రకరకాల పిండి వంటకాలతో ఆతిధ్యాన్నిస్తారు. ఇక గోదావరి జిల్లాలో ఆ మర్యాదే వేరు. గోదావరి మర్యాదలకు మారుపేరుగా పిలుస్తుంటారు. అయితే నరసాపురంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కాబోయే ఇంటి అల్లుడికి అత్తింటి వారు తమ చేతివాటం చూపించింది. వివరాలు చూస్తే..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన విజయలక్ష్మి జ్యూయలర్స్ అధినేత అత్యం వెంకటేశ్వరావు మాధవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందే సంక్రాంతి పండుగ రావడంతో పెళ్లి కుమార్తె తాత ఆచంట గోవింద్ – నాగమణి దంపతులు కాబోయే నూతన వధూవరులకు నరసాపురంలో సంక్రాంతి పండుగ రోజున ఆతిథ్యం ఇచ్చారు.
హోటల్ మెనూనే చిన్నబోయేలా ఏకంగా 365 రకాల 365 Dishes వంటకాలతో అతిథ్యమిచ్చారు. అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనంతో పాటు… 30 రకాల కూరలు సిద్ధం చేశారు. వివిధ రకాల పిండి వంటలు, వంద రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలున్నాయి. అంతేగాకుండా…15 రకాల ఐస్‌క్రీమ్స్, 35 రకాల డ్రింక్స్, 15 రకాల కేకులు, 35 రకాల బిస్కెట్లతో ఓ రేంజ్లో మర్యాద చేశారు. కేవలం ఆహార పదార్థాలను టేబుల్‌పై సిద్ధం చేయడమే కాదు. అన్ని రకాల పదార్థాలను కుటుంబం అంతా దగ్గరుండి మరీ కాబోయే అల్లుడికి రుచి చూపించారు.
కాగా అల్లుడికి చేసిన మర్యాదను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెళ్లి కాకుండేనే మర్యాదలతో ముంచేసిన అత్తింటివారు పెళ్లైన తర్వాత ఇంకెన్ని మర్యాదలు చేస్తారన్న చర్చ కూడా మొదలైంది. Eruvaaka Live Updates