ANGRAU Extension Services: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా ఫలితాలను రైతులకు చేరవేయుటకు విశ్వవిద్యాలయ విస్తరణ విభాగాలైన కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు మరియు వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా 04.04.2022 నుండి పునర్వవ్యవస్థీకరించారు (ఏర్పాటు చేసారు). రైతులకు మరియు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల విస్తరణ ఎజెన్సీలకు సాంకేతిక మద్ధతు కొరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయ విస్తరణ కేంద్రం (ఏరువాక/ కృషి విజ్ఞాన కేంద్రం) ఉండేట్లు ఏడు ఏరువాక కేంద్రాలను విస్తరణ కేంద్రం లేని ఏడు జిల్లాలకు 01.04.2023 నుండి ఏర్పాటు చేయటం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో విస్తరణ సేవలను రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి వారు అందిస్తారు.
కృషి విజ్ఞాన కేంద్రాలు :
మన రాష్ట్రంలో ఉన్న 24 కృషి విజ్ఞాన కేంద్రాలలో 13 కృషి విజ్ఞాన కేంద్రాలు : ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా), రస్తకుంటుబాయి (పార్వతీపురం జిల్లా), కొండెంపూడి (అనకాపల్లి జిల్లా), ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా), గరికపాడు (ఎన్.టి.ఆర్. జిల్లా), ఘంటశాల (కృష్ణా జిల్లా), దర్శి (ప్రకాశం జిల్లా), నెల్లూరు (యస్.పి.యస్.ఆర్. నెల్లూరు జిల్లా), కలికిరి (అన్నమయ్య జిల్లా), ఊటుకూరు (వై.ఎస్.ఆర్. కడప జిల్లా), బనవాసి (కర్నూలు జిల్లా), రెడ్డిపల్లి (అనంతపురం జిల్లా), కళ్యాణ దుర్గం (అనంతపురం జిల్లా)వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి.
ముఖ్య ఉద్దేశ్యాలు :
1. రైతు పొలాల్లో ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించటం.
2. వివిధ వృత్తుల్లో నైపుణ్య ఆధారిత శిక్షణనివ్వటం క్షేత్ర స్థాయిలో క్షేత్ర పరిశీలనలు నిర్వహించడం.
3. రైతులు, మహిళలు మరియు యువకులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో తర్ఫీదునివ్వటం.
4. గ్రామాలలోని యువకులు మరియు చదువుకున్న నిరుద్యోగులకు ఆదాయాన్నిచ్చే వివిధ వృత్తులలో శిక్షణనివ్వటం
5. అధునాతన సాంకేతిక పద్ధతులను పంట పొలాల్లో ప్రదర్శించటం.
6. వివిధ పంటల సాగు విధానంపై వి.సి.డి. లను రైతుల ప్రయోజనార్థం ప్రదర్శించడం.
7. పై వాటితో పాటు విత్తనోత్పత్తి మరియు వివిధ పంటల నారు మొక్కల ఉత్పత్తిని కూడా చేపట్టి రైతులకు నాణ్యమైన విత్తనాన్ని / నారు మొక్కలను అందజేస్తున్నారు.
ఏరువాక కేంద్రాలు :
1998వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఏరువాక కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. వీటిని రైతులకు అందుబాటులో ఉంచే ఆశయంతో జిల్లాలలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ/ వ్యవసాయ పరిశోధనా స్థానాల ప్రాంగణాలలో ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలలో కూడా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ కేంద్రం (ఏరువాక కేంద్రం / కృషి విజ్ఞాన కేంద్రం) ఒకటైన ఉండేట్లు 01.04.2023 నుండి ఏరువాక కేంద్రం – ఆమదాలవలస నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుకుబీ `ఉయ్యూరు నుండి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంకు`అనకాపల్లి నుండి డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంకు`ఒంగోలు నుండి పల్నాడు జిల్లాలోని నరసరావుపేటకు`నెల్లూరు నుండి బాపట్లకు`అనంతపురము నుండి శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి`కర్నూలు నుండి నంద్యాలకు మార్చబడ్డాయి.
ముఖ్య ఉద్దేశ్యాలు :
1. వనరుల ఆధారిత కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయుట
2. సాంకేతిక పరిజ్ఞానమును క్షేత్రస్థాయిలో పరీక్షించుట ఇతర శాఖల సమన్వయంతో రోగనిర్ధారిత క్షేత్ర సందర్శనలు
3. భాగస్వామ్యులందరి విజ్ఞాన మరియు నైపుణ్య శక్తిని పెంపొందించుట
4. వివిధ అభివృద్ధి సంస్థలు మరియు సమాచార వ్యవస్థలను సమన్వయ పరచుకోవడం ఈ కేంద్రాలు వ్యవసాయం మరియు అనుబంధ సంస్థ అధికారులు మరియు రైతులతో కలిసికట్టుగా పని చేస్తున్నాయి. అలా చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు, రైతులు మరియు విస్తరణ అధికారుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుస్తున్నాయి.
వివిధ పంటలపై తయారు చేసిన వి.సి.డి.లను రైతుల కోసం ఏరువాక కేంద్రాలలో ప్రదర్శిస్తుంటారు. కిసాన్ మేళాలు నిర్వహించటం, వ్యవసాయాభివృద్ధిలో భాగస్వాములందరికీ ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారు సంఘాలకు తర్ఫీదు (శిక్షణ) నివ్వటం, రేడియో, టీ.వి. మరియు పత్రికల ద్వారా దూర విద్యనందించటం కూడా ఈ ఏరువాక కేంద్రాల బాధ్యతే.
Also Read: శనగ పంటలో – సమగ్ర సస్యరక్షణ
వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం :
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమాచార మరియు ప్రసార కేంద్రం ద్వారా ఆకర్షణీయమైన పటాలతో, తేలికగా అర్ధమయ్యే భాషలో పురుగు, రోగ నిర్ధారిత బులెటిన్ లను ముద్రించి రైతులకు తక్కువ ధరకే అందించటం జరుగుతున్నది. ఇలాంటి బులెటిన్లు మన రాష్ట్రంలో పండిరచే అన్ని పంటలపైన ముద్రించటమైనది. ఇవి విస్తరణాధికారులకు, రైతులకు మరియు విద్యార్థులకు బాగా ఉపయోగకరంగా ఉంటున్నాయి.
రైతుల ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు అందించే ఉద్దేశ్యంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫార్మర్స్ కాల్ సెంటర్ ను గుంటూరులో ఏర్పాటు చేశారు. నిపుణులైన శాస్త్రవేత్తల టీమ్ కాల్ సెంటర్ లో కూర్చుని ఉంటారు. రైతులు ఎక్కడినుంచైనా ఉచితంగా ‘18004250430’ అనే నంబరుకు ఫోన్ చేసి తమ సందేహాలను శాస్త్రవేత్తలతో మాట్లాడి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.
వ్యవసాయ పంచాంగం :
వార్షిక ‘‘వ్యవసాయ పంచాంగం’’ను ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా విడుదల చేయటం జరుగుతున్నది. దీనిలో రాష్ట్రంలో పండిరచే వివిధ పంటల సాగు, పశువుల యాజమాన్యం మరియు గృహ విజ్ఞాన శాస్త్రంలో ఉత్తమ యాజమాన్య పద్ధతుల వివరాలను తెలియపరచటం జరుగుతున్నది.
ఏరువాక :
రైతు సాధికారత మాస పత్రిక ‘‘ఏరువాక’’ ద్వారా వివిధ దశల్లో రైతు పంటల్లో తీసుకోవలసిన తగు జాగ్రత్తలను గూర్చి, పరిణితి చెందుతున్న వ్యవసాయానికి కావలసిన నూతన సాంకేతికతను గూర్చిన విషయాలు ఎన్నో తెలియచేస్తుంది.
వ్యవసాయం :
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ మాస పత్రిక ‘‘వ్యవసాయం’’ ద్వారా రైతులకు ఆ నెలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతులకు తెలియ పరచటం జరుగుతున్నది.
ది జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఆంగ్రూ :
త్రైమాసికం, ఈ జర్నల్ ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన పరిశోధనా ఫలితాలను ప్రచురించటం జరుగుతుంది.
ఆల్ ఇండియా రేడియో :
ఆల్ ఇండియా రేడియోలో వ్యవసాయ సూచనలు మరియు వ్యవసాయ పాఠశాల కార్యక్రమాలకు సాంకేతిక సమాచారాన్ని అందచేయడం జరుగుతున్నది.
గ్రామ దత్తత కార్యక్రమం :
వ్యవసాయం పెట్టుబడితో ముడిపడి, సాంకేతిక పరంగా ఎక్కువ స్థాయిలో ఉన్నది. పోటీ ప్రపంచంలో రైతులు తాము పండిరచిన ఉత్పత్తులకు లాభసాటి ధరను పొందాలంటే మన వ్యవసాయంలో సాగు ఖర్చును తగ్గించి, ఉత్పత్తి మరియు నాణ్యత పెంచడంగా నిర్ధారించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో అందరి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామ దత్తత కార్యక్రమంను ప్రవేశ పెట్టడం జరిగింది. విశ్వవిద్యాలయం పరిధిలోని పరిశోధనా స్థానాలు, కళాశాలలు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాయి.
ముగ్గురు, నలుగురు శాస్త్రవేత్తలు ప్రతి వారం ఒక రోజున తప్పనిసరిగా గ్రామాన్ని సందర్శించి, పొలాన్ని చూసి రైతులతో ముచ్చటించి తగు సలహాలు ఇస్తారు. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవటం, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి, మట్టి మరియు నీరు పరీక్ష, అంతర పంటలు వేసుకోవటం, సేంద్రీయపు ఎరువులు వాడటం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించటం ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశాలు.
కిసాన్ మేళాలు :
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు కళాశాలలు వ్యవసాయ ప్రదర్శనశాల మరియు రైతు సదస్సుల ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులను చైతన్యవంతులుగా చేసే ఉద్దేశ్యంతో కిసాన్ మేళాలు నిర్వహిస్తారు.
వినూత్న విస్తరణ పద్ధతులు :
వీలైనంత ఎక్కువ మంది రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందిస్తూ, విజ్ఞాన సాధికారత మరియు విస్తరణ సేవలను పెంచే దిశగా ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ విస్తరణ సంచాలనాలయం వారు ఇటీవల కాలంలో క్రింద వినూత్న విస్తరణ పద్ధతులను ప్రవేశపెట్టి సత్ఫలితాలను సాధిస్తున్నారు. వాటి వివరాల గురించి ఈ క్రింద తెలియపరచడమైనది.
1. జెండా పద్ధతి :
ఏరువాక/ కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు గ్రామాల్లోని రైతు పొలాన్ని పరిశీలించి లోపాల నివారణకు సూచనలను ఒక పట్టిక రూపంలో వివరించి పొలంలోనే జెండాలాగా ఏర్పాటు చేస్తారు. వాటిని చూసి రైతులు సత్వర చర్యలను వెంటనే చేపట్టి పంటను కాపాడుకోవచ్చు. ఈ జెండాలో విస్తరణ కేంద్రం పేరు, సంప్రదించాల్సిన ఫోన్ నంబరు, సందర్శించిన తేదీ, పంట సమస్యలకు తగ్గ పరిష్కార మార్గాలను సూచిస్తారు.
2. నిష్ణాతులైన రైతు శిక్షణాకారులను అభివృద్ధి పరచుట :
ఈ ప్రక్రియలో భాగంగా 2,3 మండలాల నుంచి ఎంపిక చేసిన 15 నుండి 20 మంది రైతులకు, ఎంపిక చేసుకున్న పంటలో, ఒక పంట కాలంలో వివిధ ముఖ్యమైన పంట దశలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి వచ్చిన 15-20 మంది రైతులు మాత్రమే ప్రతి పంట దశలో ఇచ్చేటువంటి శిక్షణకు హాజరు కావలసి ఉంటుంది. ఈ శిక్షణ పంట సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
3. సృజనాత్మక రైతుల అనుసంధానం : గుర్తించిన ప్రతి జిల్లా స్థాయి సృజనాత్మక రైతు అనుసంధాన సమన్వయకర్త తన అనుభవాలను మరో 30 మంది ఇతర రైతులతో పంచుకోవడం జరుగుతుంది. (తన గ్రామంలోని 10 మందికి, తన మండలంలోని 10 మందికి, తన జిల్లాలోని 10 మందికి). సమన్వయకర్తలకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏరువాక మరియు కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు అందిస్తుంటారు.
4. ఫార్మ్ సైన్స్ క్లబ్స్ :
గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంను త్వరితగతిలో తీసుకుపోవడం
5. గిరిజన యువత అనుసంధాన కార్యక్రమం :
గిరిజన యువ రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేయటం.15 రోజులకొకసారి శిక్షణ, అవగాహనా సదస్సులు, విజ్ఞాన యాత్రలు.
ఇతర కార్యక్రమాలు :
నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి : గ్రామీణ యువతకు మరియు మహిళలకు చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలకు విలువలు జోడిరచడం, నర్సరీ మొక్కల ప్పెకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేయడం, కొబ్బరి చెట్టు ఎక్కే పరికరంలో నైపుణ్యం మొదలగు వాటిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నాము.
వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి గ్రామానికి :
వ్యవసాయ విశ్వవిద్యాలయ సేవలు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని రైతులకు తెలియజేసే ఉద్ధేశ్యంలో ఏరువాక కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు ప్రతి జిల్లాలో గ్రామ సర్పంచ్లు మరియు అభ్యుదయ రైతులతో సమావేశమై వ్యవసాయ విశ్వవిద్యాలయ కార్యక్రమాలు, ఆయా ప్రాంతాలలో పండిస్తున్న పంటలలో రైతులు పాటించవలసిన కీలకమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన పరచడంతో పాటు గ్రామ గ్రంధాలయానికి వ్యవసాయ పంచాంగం మరియు ప్రతి నెల వ్యవసాయం మాసపత్రికను అందించడం జరుగుచున్నది.
అనుబంధ శాఖలతో విస్తరణ కార్యక్రమాలు :
మార్కెట్ కమిటీ స్థాయి చర్చలు ఆత్మా వారి సహకారంతో ప్రదర్శనా క్షేత్రాలు టి.వి మీటింగ్స్ మండల పరిశోధనా మరియు విస్తరణ సలహా మండలి సమావేశాలు
1. ప్రాధమిక రంగ మిషన్
2. సేంద్రీయ వ్యవసాయం
3. నాబార్డ్-రైతు క్లబ్బులు
4. ఆర్.కె.వి.వై. (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన)
5. మీడియా ల్యాబ్ ఆసియా – కిసాన్ సారథి
రాష్ట్ర ప్రభుత్వపు విస్తరణ కార్యక్రమాలలో భాగస్వామ్యం :
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి ‘‘వై.ఎస్.ఆర్. పొలం బడి’’ లో పాల్గొంటూ, రైతులకవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు.
వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు :
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులతో కలిసి ‘‘వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు’’లోని విస్తరణ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక బి.యస్సీ (వ్యవసాయం) విద్యార్ధిని అనుసంధానం చేసి 30 రోజుల పాటు (3 విద్యార్థులు 90 రోజుల పాటు) ఆర్.బి.కె. ల పనితనంను మరియు రైతులకు అందించే సేవలను విశ్లేషిస్తున్నారు.
విపత్తు యాజమాన్యం :
కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు విపత్తు సమయాల్లో వరదలు, తుఫాను మరియు విపరీత, కరువు, గాలుల వల్ల నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి పంట నష్టాన్ని తగ్గించే పద్ధతులను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి విస్తరణ సేవలను రైతులందరూ ఉపయోగించుకొని, పెట్టుబడులను తగ్గించుకొని, నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందుతూ లాభసాటి వ్యవసాయం దిశగా పయనించాలని ఆశిస్తున్నాం.
Also Read: వివిధ పంటలలో కలుపు యాజమాన్య పద్ధతులు.!