రైతులువార్తలువ్యవసాయ పంటలువ్యవసాయ వాణిజ్యం

Baby corn: సరైన దశలో కొస్తేనే బేబీ కార్న్ కు మంచి ధర !

0
HARVESTING STAGE OF BABY CORN

Baby corn: మొక్కజొన్నబహుళ ఉపయోగాలున్న పంట. ఆహారపంటగా, పశుగ్రాసంగా, కోళ్ల మేతగా, పశువుల దాణాగా, ఇథనాల్ తయారీలో, బేకరీ ఉత్పత్తుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు పచ్చి కండెలను కోసి అమ్ముతుంటారు. బేబీ కార్న్, స్వీట్ కార్న్, పాప్ కార్న్ గా కూడా మొక్కజొన్న సాగుచేస్తారు. మొక్కజొన్న సాగుచేసే రైతులు బేబీ కార్న్, స్వీట్ కార్న్, సాధారణ మొక్కజొన్నపచ్చి కండెలుగా కూడా అమ్ముకొని మంచి ఆదాయం పొందవచ్చు. గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నలో కండెలు ఏర్పడే తొలి దశలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి తడులు ఇవ్వలేని పరిస్థితులుంటే పైరు 50 రోజుల దశలో బేబీకార్న్ గా తీసుకోవచ్చు. అలాగే గింజలు పాలు పోసుకునే దశలో (పైరు 80 -85 రోజుల దశలో) నీటిఎద్దడి పరిస్థితుల వల్ల నీటితడులు ఇవ్వలేని పరిస్థితులుంటే పచ్చి కండెలుగా కోసి మార్కెట్ చేసుకోవచ్చు.

BABY CORN

బేబీ కార్న్ కు పెరుగుతున్న ప్రాధాన్యం !

      • బేబీకార్న్ అనేది మొక్కజొన్న జాతికి చెందిన కూరగాయ పంట. హోటళ్లలో, విందు భోజనాల్లో బేబీ కార్న్ తో పలు రకాల వంటకాలు చేస్తున్నారు. లేత మొక్కజొన్నపొత్తులను కూరగాయగా వాడతారు. సన్న ముక్కలుగా చేసి
        సలాడ్ గా, కూరగా తింటారు. దీనికి పెద్ద పెద్ద హెూటళ్ళలో మంచి డిమండ్ ఉంది. సూపర్ మార్కెట్లలో కూడా కూరగాయగా అమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రైతులు, మార్కెట్ సౌలభ్యం చూసుకొని పండించుకోవాలి. తగినంత నీటి వసతి ఉంటే ఏడాదిపొడవునా సాగుచేసుకోవచ్చు. బేబీకార్న్ పొత్తులు విత్తిన యాభై రోజుల నుంచి మొదటి కోత తీసుకోవచ్చు. 75-80 రోజుల్లో పంట పూర్తవుతుంది. పంట కాలం తక్కువ కావడం వల్ల రైతులు ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటలు తీసుకోవచ్చు. మాధురి, సి.ఓ.బి.సి. 1 రకాలను బేబీ కార్న్ కోసం సాగుచేసుకోవచ్చు. సాగుచేసే రకం, నీటివసతిని బట్టి ఎకరాకు 1200 నుంచి 2600 కిలోల దాకా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.
      • బేబీ కార్న్ మొక్కజొన్నలో సరైన కోత దశను గుర్తించి పంట కోతను చేపడితే రైతుకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. తద్వారా అధిక నికరాదాయం పొందే వీలుంటుంది.

        బేబీ కార్న్ కోసం ఎప్పుడు కోయాలి ?
        బేబీ కార్న్ గా పంట తీసుకునేందుకు గింజ కట్టక ముందే పీచు తొలి దశలోనే కోయాలి. పీచు 2-3 సెం.మీ. దశలో ( పీచు వచ్చిన 1-3 రోజులకు) అంటే పైరు 45-50 రోజులప్పుడు బేబీకార్న్ గా కండెలను కోసుకోవాలి. ఆలస్యం చేస్తే ఒక్క రోజులోనే కండెల్లో గింజల అంకురార్పణ జరిగి బేబీకార్న్ గా ఉపయోగించేందుకు పనికిరాకుండా పోతాయి. వేడి తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలో బేబీ కార్న్ కోసం ప్రతి రోజు కోయాలి. రబీలో సాగుచేసే పంటలో అయితే రోజు విడిచి రోజు కోసుకోవచ్చు. ముందుగా మొక్కల్లో పైన ఉన్న బేబికార్న్ కండెలను కోసి, తర్వాత రోజు కిందవి కోయాలి. సాగుచేసిన రకాన్ని బట్టి ఏడెనిమిది కోతల వరకు తీసుకోవచ్చు. కోసిన కండెలపైన ఉన్న పీచు,పై పొర తీసివేసి శుభ్రం చేసి, కండెలు విరిగిపోకుండా మార్కెట్ చేసుకోవాలి. కండెలు 6 -11 సెం.మీ. పొడవు, ఒకటి నుంచి ఒకటిన్నర సెం.మీ. మందంతో ఉన్న బేబీ కార్న్ కండెలకు మంచి ధర లభిస్తుంది. 9- 10 సెం.మీ. పొడవున్న కండెలు ఎగుమతికి అనుకూలం. కోసిన కండెలను సైజుల వారిగా వేరుచేసి ప్యాకింగ్ చేసుకోవాలి. వీటిని 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

        ALSO READ:Maize Farmers: వర్షాభావంతో ఇబ్బంది పాలవుతున్న మొక్కజొన్న రైతులు.!

        Leave Your Comments

Groundnut variety released from Tirupati: తిరుపతి నుంచి విడుదలైన కొత్త వేరుశనగ రకం

Previous article

You may also like