కర్ణాటకలోని ఒక రైతు పసుపు పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు పసుపు రంగు పుచ్చకాయలను ప్రజలకు తినేందుకు అలవాటు చేసి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు. బసవరాజ్ పాటిల్ అనే యువ రైతు కాల్బుర్గిలోని కొరల్లి గ్రామానికి చెందిన గ్రాడ్యుయెట్. తొలిసారిగా పసుపు రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పండిస్తున్నాడు. తాను పండించే పుచ్చకాయలు ఎరుపుగా లేకపోవడంతో తినేందుకు ప్రజలు విముఖత చూపారు. దాంతో తన ఉత్పత్తులను విక్రయించడానికి నగరంలోని స్థానిక మార్ట్, బిగ్ బజార్ లతో కలిసి పనిచేశాడు. ప్రజలకు వీటిని తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ పాంప్లెట్స్ పంచిపెట్టారు. ప్రజలు పసుపు పుచ్చకాయలను తినడం మొదలుపెట్టడంతో ఇప్పుడు పాటిల్ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. పుచ్చకాయల ఉత్పత్తికి తొలుత రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు అమ్మకాల నుంచి రూ. లక్ష వరకు లాభం పొందారు. ఎర్ర పుచ్చకాయల కన్నా పసుపు పుచ్చకాయలు తియ్యగా ఉంటాయని పాటిల్ పేర్కొంటున్నారు. భారతదేశంలో పంట ఉత్పత్తిని రైతులు వైవిధ్యపరచాలని యువ గ్రాడ్యుయేట్ అభిప్రాయపడుతున్నారు.
ఇంతకు ముందు గోవాకు చెందిన ఇంజినీర్ గా మారిన రైతు నితేష్ బోర్కర్ కూడా పసుపు పుచ్చకాయలను సేంద్రియంగా పండించారు. రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించకుండా 250 పసుపు పుచ్చకాయలను సాగు చేశాడు. సిట్రల్లస్ లానాటాస్ అని శాస్త్రీయంగా పిలుచుకునే ఈ రంగు పుచ్చకాయలు మొదట ఆఫ్రికాలో పెంచారు. ప్రస్తుతం ఈ పండు ప్రపంచవ్యాప్తంగా 1000 రకాలకు పైగా పండిస్తున్నారు. పసుపు పుచ్చకాయ రంగు లేత పసుపు నుంచి కొద్దిగా బంగారు వర్ణం వరకు ఉంటుంది. అవి తరచుగా తినదగిన గోధుమ – నలుపు విత్తనాలను కలిగి ఉంటాయి. పసుపు పుచ్చకాయలో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు పుచ్చకాయ కంటే ఎక్కువగా పసుపు పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సీ డెంట్ గా పనిచేసి క్యాన్సర్లు రాకుండా, కంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగించేలా సహాయపడుతుంది.
కర్ణాటకలోని ఒక రైతు పసుపు రంగులో పుచ్చకాయలను పండిస్తూ..మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.
Leave Your Comments