PJTSAU: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నోడల్ అధికారుల 7వ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని ICAR నోడల్ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో ICAR ADG (ఎడ్యుకేషన్ ప్లానింగ్, హోమ్ సైన్స్) డాక్టర్ P.S పాండే స్వాగతోపన్యాసం ఇచ్చారు. వ్యవసాయ విద్యలో జాతీయ విద్యా విధానం అమలుకు సంబంధించిన డ్రాఫ్ట్ ని ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి పంపించినట్లు వివరించారు. నూతన బోధన పద్ధతులపై ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలన్నారు. PJTSAU ప్రయోగాత్మక శిక్షణలో మంచి పనితీరు కనబరుస్తుందన్నారు.

7th Conference of ICAR Agricultural Research Nodal Officers at PJTSU
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ICAR సంస్థలు అన్ని సమన్వయంతో పని చేసినపుడే మంచి ఫలితాలు సాధించగలమని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) డైరెక్టర్ డాక్టర్ CH. శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ పట్టభద్రులు స్టార్టప్ లు ప్రారంభించడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు. తమ సంస్థ ద్వారా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్లు, ఫ్యాకల్టీ అందరికీ శిక్షణ ఇవ్వడానికి అన్నివేళలా సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు అన్నారు.
Also Read: D.D Kisan Studio Inagurated: రైతు కళ్యాణార్థం డి .డి కిసాన్ స్టూడియో ప్రారంభం.!
అనంతరం సదస్సును ఉద్దేశించి PJTSAU ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు ప్రసంగించారు. 9 ఏళ్లుగా వర్సిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న తనకి ICAR పూర్తి తోడ్పాటు అందించిందన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధిలో భారతదేశం ప్రపంచానికంతటికీ ఆదర్శనీయంగా వుందని ప్రవీణ్ రావు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రోజురోజుకీ అధికం అవుతున్నాయన్నారు.

7th Conference of ICAR Agricultural Research Nodal Officers
అయితే మారుతున్న కాలానికి తగ్గట్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల పనితీరులో సమూల మార్పులు రావాలన్నారు. ఇన్నోవేషన్ కి పెద్ద పీట వేయాలన్నారు. గూగుల్ లో దొరకని అంశాల్ని బోధించే స్థాయికి ఫ్యాకల్టీ ఎదగాలని అభిప్రాయపడ్డారు. డేటా, నాలెడ్జ్, మార్కెట్, ఇన్నోవేషన్ ఆధారిత వ్యవసాయ విద్యా పద్ధతులు అమల్లోకి రావాలని ప్రవీణ్ రావు అన్నారు. ICAR DDG (అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్) డైరెక్టర్ RC అగర్వాల్ ముఖ్య అతిథిగా సదస్సుని ప్రారంభించారు. రెండు పర్యాయాలుగా VC గా పనిచేస్తున్న ప్రవీణ్ రావు PJTSAU ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని అభినందించారు.
ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సవాళ్లు, పరిమితుల్ని ఎదుర్కొంటుదన్నారు. పరిమిత వనరుల్లోనే అధిక ఉత్పత్తి, ఉత్పాదకతలు సాధించవలసి ఉందన్నారు. అదేవిధంగా యువతని వ్యవసాయం వైపు ఆకర్షితుల్ని చేయాలన్నారు. వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం, గ్రీన్ హౌస్ ఉద్గారాల వంటి సవాళ్లు ఎన్నో వున్నాయన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, కొత్త విద్యావిధానం, నైపుణ్య శిక్షణ, ప్లేస్ మెంట్ సెల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇతర సంస్థలతో సమన్వయం చేసుకొని పని చేయాలని అగర్వాల్ సూచించారు.

7th Conference of ICAR Agricultural Research Nodal Officers at PJTSU Audiotorium
ఈ కార్యక్రమంలో ICAR ADG డాక్టర్ సీమ జగ్గి, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్. ది డీన్ అఫ్ స్టూడెంట్ అఫైర్స్ జెల్లా సత్యనారాయణ, డీన్ అఫ్ అగ్రి కల్చర్ డాక్టర్ సీమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉదయం RC అగర్వాల్, CH శ్రీనివాసరావు, ప్రవీణ్ రావు లు PJTSAU పరిపాలనా భవనం లో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్రి హబ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ని ప్రారంభించి మొత్తం పరిశీలించారు. తర్వాత నుతనంగా నిర్మించిన యాంఫీ ధియేటర్ ని ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు.
Also Read: Agricultural Research Station-Mudhole: తెలంగాణలో పత్తిపై పరిశోధించి ఏకైక పరిశోధనా కేంద్రం