వ్యవసాయ పంటలు

పుదీనాలో ఏ రకాలు సాగుచేయాలి ?

0

తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కర్నూల్, కడప, అనంతపురం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు పుదీనా జాతుల సాగుకు బాగా అనుకూలం. జలుబు, శ్వాస సంబంధిత ఔషధాలు, టూత్ పేస్ట్, మౌత్ ఫ్రెషనర్లు, సౌందర్య ఉత్పత్తులు, సువాసన కోసం, శీతల పానీయాల రుచి కోసం, జెల్లీలు, జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లు, మాంసం, పాన్ ల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పుదీనా వాడకం, గిరాకీ నానాటికి పెరుగుతున్నందున ఈ పంట సాగుతో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది.

మేలైన పుదీనా రకాలు:

పుదీనాలో ప్రధానంగా మూడు రకాలు ..జపనీస్ మింట్ (మెంథా ఆర్వెన్సీస్ రకం పైపెరసెన్స్ ) , పెప్పర్ మింట్  (మెంథా పైపేరిటా), స్పియర్ మింట్ (మెంథా స్పైకాటా), బెర్గమాట్ మింట్ (మెంథా సిట్రేటా) ఉన్నాయి.

జపనీస్ మింట్:

ఇది మంచి వాసన గల బహువార్షిక పంట రకం. దీని ఆకులు, లేత కాండాలలోని సుగంధ నూనెలో అత్యధికంగా 75-80 శాతం మెంథాల్ ఉంటుంది. అందువల్లనే దీనిని మెంథాల్ ప్రధాన వనరుగా పరిగణిస్తారు. దీనిలో మంచి దిగుబడినిచ్చే హిమాలయ, శివాలిక్, కోసి, సక్షం, సంభవ్, కల్కి గోమతి, సిమ్ – సరయు, సిమ్ వశిష్ట్, సిమ్-క్రాంతి వంటి మేలైన రకాలున్నాయి.

పెప్పర్ మింట్:

ఇది వేసవిలో పెరిగే బహువార్షిక పంట రకం. రెండు, మూడేళ్ళ పాటు కోతలు తీసుకోవచ్చు. సుగంధ తైలంలో 35-50 శాతం మెంథాల్, 9-25 శాతం మెంతేన్,14-15 శాతం మెంతేల్ అసిటేట్ ఉంటాయి. దీనిలో మంచి దిగుబడినిచ్చే కొక్రాయిల్, తుషార్, సిమ్-ఇండస్ వంటి మేలైన రకాలున్నాయి.

స్పియర్ మింట్:

ఇది చిన్నపాటి కుండీలలో కూడా  బాగా పెరిగే బహువార్షిక పంట రకం.  దీనిలో మంచి దిగుబడినిచ్చే ఆర్కా నీరా, పంజాబ్ స్పియర్ మింట్ వంటి మేలైన రకాలున్నాయి.

బెర్గమాట్ మింట్:

దీని సుగంధ తైలంలో లినాలోల్, లినాలిల్ అసిటేట్ లు అధికంగా ఉండటం వల్ల దీనికి మంచి వాణిజ్య ప్రాముఖ్యత ఉంది. దీనిలో మంచి దిగుబడినిచ్చే మేలైన కిరణ్ రకం ఉంది.

కోత- దిగుబడి:
సాధారణంగా జపనీస్ మింట్ నాటిన 100- 120 రోజుల తరువాత కోతకు వస్తుంది. కోత ఆలస్యమైతే ఆకులు రాలిపోయి, పంట దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. కొమ్మలను నేల నుంచి రెండు, మూడు సెం.మీ. ఎత్తులో, పొడి వాతావరణం ఉన్నప్పుడు కోయాలి. మొదటి కోత తర్వాత సుమారు 80 రోజుల వ్యవధితో రెండవ, మూడవ కోతలను తీసుకోవచ్చు. జపనీస్ మింట్ పంటలో ఎకరాకు 19. 2 టన్నుల (హెక్టారుకు 48 టన్నులు) వరకు దిగుబడిని పొందవచ్చు. అయితే సాధారణ మింట్ పంటలో మాత్రం మూడు కోతల నుంచి ఎకరాకు సగటున 8- 10 టన్నుల దిగుబడి వస్తుంది.

Leave Your Comments

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముదంజ

Previous article

You may also like