మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

పాలకూర సాగులో అధిక దిగుబడి సాధించాలంటే..

0
 ఆకుకూరల్లో మనం పాలకూరను ఎక్కువగా వాడుతాం. దీనిలో మంచి పోషక విలువలు ఉంటాయి. పాలకూర సాగుకు సారవంతమైన, మురుగునీరు పోయే సౌకర్యం గల నేలలు అనుకూలం. చౌడు భూమిలో కూడా పండించుకోవచ్చు. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే పూత వచ్చి, ఆకులు కూరగా పనికిరావు. అందువల్ల ఉష్ణమండలాల్లో దీనిని చలికాలంలో పండిస్తారు. పాలకూరను దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు, చల్లని కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు విత్తుకోవచ్చు. పాలకూర విత్తాక మొదటి కోత 3-4 వారాలకు వస్తుంది. తర్వాత వారం, పది రోజులకోసారి చొప్పున 4-6 కోతలు తీసుకోవచ్చు. పాలకూరలో అనువైన రకాలను ఎంపికచేసుకొని, సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందే వీలుంటుంది.
    అనువైన రకాల ఎంపిక:
  • పాలకూరలో ఆల్ గ్రీన్, ఆర్కా అనుపమ, పూసా జ్యోతి, పూసా పాలక్, జాబ్ నర్ గ్రీన్, ఊటీ – 1 వగైరా…రకాలున్నాయి.
  • ఆల్ గ్రీన్ రకంలో ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలద్వారా 5 టన్నుల దిగుబడి వస్తుంది. రెండున్నర నెలలకు  పూత వస్తుంది. ఈ రకంలో ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
  • అర్క అనుపమ రకంలో ఆకులు పెద్దగా, మృధువుగా, ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి. ఎక్కువ కోతలు తీసుకోవడానికి అనుకూలమైన రకం. పంట కాలం 75-80 రోజులు.
  • పూసా పాలక్ రకాన్ని న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి విడుదల చేశారు. ఈ రకం ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది.
  • జాబ్ నర్ గ్రీన్ రకంలో ఆకులు పెద్దవిగా, మందంగా , మృదువుగా ఉంటాయి. ఎకరాకు 11-12 టన్నుల దిగుబడి వస్తుంది.
  • పూసా జ్యోతి రకంలో ఆకులు మందంగా, పెద్దగా, మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్ గా వాడుతారు. ఆరు నుంచి ఎనిమిది కోతల్లో ఎకరాకు 16-19 టన్నుల దిగుబడి వస్తుంది.  
  •  ఊటీ-I రకంలో ఆకులు 40-50 సెం.మీ. పొడవు, 8-10 సెం.మీ. వెడల్పుంటాయి. 45 రోజుల్లో మొదటి కోత వస్తుంది. తర్వాత15 రోజులకొక కోత చొప్పున 4 కోతలు తీసుకోవచ్చు. సాగుచేసిన రకం, పాటించిన సేద్యపద్ధతులను బట్టి దిగుబడి ఉంటుంది.
సాగులో …
  • ఎకరాకు10-12 కిలోల విత్తనాలను 20సెం.మీ.ఎడం సాళ్లలో 3-4 సెం.మీ. లోతులో మళ్ళలో విత్తుకోవాలి. వరం, పది రోజుల్లో గింజలు మొలకెత్తుతాయి. ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువుతో పాటు ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. ప్రతి కోత తర్వాత ఎకరాకు 10 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి.
  • పేనుబంక, ఆకుతినే గొంగళి పురుగులు ఆశిస్తే 2 మి.లీ. మలాథియాన్ లేదా వేప సంబంధిత పురుగు మందులను; ఆకుమచ్చ తెగులుసోకితే 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు మందు పిచికారి చేశాక కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి. ఆకుకూర పంటలపై తక్కువ మందు అవశేషాలు గల పురుగు మందులను వాడాలి.
Leave Your Comments

మీ మిరప తోటల్లో మొక్కలు వడలి, ఎండిపోతున్నాయా ?

Previous article

భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు

Next article

You may also like