Finger Millet Cultivation: మన రాష్ట్రంలో రాగి 1.13 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ 49 వేల టన్నుల ఉత్పత్తి నిస్తుంది. సరాసరి దిగుబడి ఎకరాకు 4.35 క్వింటాళ్ళు వస్తుంది. రాగిని ఖరీఫ్లో జూలై-ఆగస్టు మాసాల్లో, రబీలో నవంబరు- డిసెంబరు మాసాల్లో, వేసవిలో జనవరి-ఫిబ్రవరి మాసాల్లో విత్తుకోవచ్చు.
రాగిని తేలిక రకం ఇసుక నేలలో, బరువు నేలల్లో పండించవచ్చు. నీరు నిల్వఉండే భూములు అనువైనవికావు. 2.5 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం కావాలి. కిలో విత్తనాన్ని 2 గ్రా. కార్బండైజిమ్ లేదా 3 గ్రా. కలిపి విత్తనశుద్ధి చేయాలి.
తేలిక పాటి దుక్కిచేసి విత్తనం చల్లి, పట్టె తోలాలి. నారుపోసి నాటుకోవాలి. మురుగు నీటిపారుదల సౌకర్యంగల నేలల్లో నారుపోసుకోవాలి. 85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయసుకల్గిన మొక్కలను, 105-125 రోజుల దీర్ఘ కాలిక రకాలకు 30 రోజుల వయసు కల్గిన మొక్కలను నాటుకోవాలి. ఎకరాకు దీర్ఘకాలిక మూడు వేల మొక్కలు, స్వల్పకాలిక రకాలకు రెండు లక్షల అరవై ఆరువేల మొక్కలు ఉంచాలి.
Also Read: Green Gram:పెసర పంటను ఏ ప్రాంతంలో, ఏ కాలంలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది..
స్వల్పకాలిక రకాలకు వరుసల మధ్య 15 సెం.మీ., వరుసలో 10 సెం.మీ., దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెం.మీ. వరుసలో 15 సెం.మీ. దూరం పాటించి విత్తుకోవాలి. నారుమడిలో 5సెంట్ల నారుమడి ఎకరాకు సరిపోయే నారును ఇస్తుంది. 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరం మరియు 480 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది.
ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ నాటేటప్పుడు వేయాలి. నాటిన 30 రోజులకు మరో 12 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి.
విత్తనం వెదజల్లే పద్ధతిలో బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతోగాని, చెట్టుకొమ్మతోగాని, నేలను చదును చేయాలి. లేనిచో విత్తనానికి తగినంత తేమ లబించక మొలక శాతం తగ్గుతుంది. విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. వేసేదానికి, నారు నాటటానికి ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 600 మి.లీ. వేసేదానికి చొప్పున 200 లీ. నీటిలో కలిపి చేసి కలుపును నివారించవచ్చు. నాటిన 25, 30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్ 80% పొడిమందు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన పైరు బాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజులు నీరు పెట్టరాదు. పూత, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి.
రాగితో కందిని 8:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగుచేయవచ్చు. దీనిలో రాగి వరసల మధ్య దూరం 30 సెం.మీ., మొక్కల మధ్యదూరం 10 సెం.మీ. కంది వరసల మధ్యదూరం 60 సెం.మీ., మొక్కల మధ్యదూరం 20 సెం.మీ. పాటించాలి. రాగితో చిక్కుడును 8:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. వరుసల మధ్యదూరం 30 సెం.మీ. వరసల్లో రాగి మొక్కల మధ్యదూరం 10 సెం.మీ., చిక్కుడు మొక్కల మధ్యదూరం 20 సెం.మీ. పాటించాలి.
రాగి పంటను సరైన సమయంలో కోతను ప్రారంభించాలి. గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు, వెన్నుకు దగ్గరి ఆకులు పండినట్లుగా ఉన్నప్పుడు పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులను కోయాలి. పొలంలోనే చొప్పను కోసి 2-3 రోజులు ఆరిన తరువాత వెన్నులను విడదీయవచ్చు లేదా. నేరుగా చొప్పను కోయకుండ వెన్నులనే కోసి 2-3 రోజులు పొలంలో ఆరబెట్టవచ్చు. బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగాని, ట్రాక్టరు నడపడం ద్వారా కానీ గింజలను సేకరించాలి. అలా సేకరించిన గింజలను గాలికి తూర్పారబెట్టి నాణ్యమైన గింజలను పొందవచ్చు. ఇలా సాగు చేసిన రాగి పంట మంచి దిగుబడి వస్తుంది.
Also Read: Green Gram Cultivation: పెసర పంటను రెండు సార్లు పండించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.!