Nutritional Deficiencies in Maize: ఆహార పంటలలో మొక్కజొన్న చాలా ముఖ్యమైన పంట ఈ పంటను మన రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో వర్షాధారంగా వానాకాలంలో నీటిపారుదల కింద ఆరుతడి పంటగా యాసంగిలో సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్న పంట చాలా సున్నితమైన పంట. ఈ పంటకు సరైన సమయంలో ఎరువులను. వేయకపోయినచో పోషక లోపాలు ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్ మరియు ఐరన్ వంటివి పంటపైన కనిపిస్తాయి. ఈ లోపాలను సరైన సమయంలో నివారించినట్లయితే దిగుబడి తగ్గే ఆస్కారం ఉంది. కావున కింద తెలిపిన నివారణ చర్యలు చేపట్టాలి.
నత్రజని పోషక ధాతు లోపం : ఈ పోషక ధాతు లోపం వచ్చినట్లయితే మొదట కింది ఆకులు పసుపుపచ్చగా మారి తరువాత క్రమక్రమంగా మొక్క మొత్తం పాలిపోయి పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. ఈ లోపం చాలా రోజులు కొనసాగితే ఆకు అంచున మొదలువైపు మధ్య ఈనెల గింజ ‘‘వి’’ ఆకారంలో మొత్తం పసుపు రంగుకు మారి ఎండి పోతుంది. ఈ నత్రజని లోపం నేలలో సరైన తేమ లేనప్పుడు గాని లేదా ఎక్కువ తేమ ఎక్కువ అయినప్పుడు లేదా నేల సారవంతంలేనప్పుడు వస్తుంది. దీని నివారణకు రెండు శాతం ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసుకోవాలి.
భాస్వర లోపం : ఈ ధాతులోపం నేలలో భాస్వరం లోపించినప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా పొలంలో నీరు నిలిచినప్పుడు కనబడుతుంది. మొక్క పెరుగుదల ఆగిపోయి ఆకులు ఎరుపుతో కూడిన నీలి రంగులోకి మారుతాయి. దీని నివారణకు సిఫారసు చేసిన భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో వేయాలి. పంట పై రెండు శాతం నాలుగు నుండి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
Also Read: Maize Cultivation: మొక్కజొన్న సాగులో మెళుకువలు.!
పొటాష్ ధాతు లోపం : ఈ ధాతు లోపం సారవంతంగాని నెలలో మరియు ఆమ్ల మరియు చౌడు నేలల్లో ఎక్కువగా ఉన్న నేలల్లో కనిపిస్తుంది. ఈ ధాతువులు లోపం వచ్చినప్పుడు మొక్క ముదురు ఆకుల చివర్లలో మొదలై అంచుల వెంబడి పసుపు మరియు గోధుమ రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువును తప్పకుండా వేయాలి. అలాగే పంటపై పోషక నివారణకు 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపి రెండు నుండి మూడు సార్లు నాలుగు నుండి ఐదు రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
జింకు లోపం : ఈ ధాతు లోపం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదు మించి భాస్వరం ఎరువులను వేసినప్పుడు మరియు అధిక నీటి ముంపుకు గురైనప్పుడు కనపడుతుంది. ఈ ధాతు లోపం వచ్చినప్పుడు ఆకుల ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు మరియు తెలుపు రంగుగా మారుతాయి. జీవ నివారణకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను రెండు నుండి మూడు గంటలకు ఒకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పంట పై జింకు లోపం వచ్చినప్పుడు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి నాలుగు నుండి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
బోరాన్ ధాతు లోపం : ఈ ధాతు లోపం భూమిలో సేంద్రియ కర్భనం లోపించినప్పుడు మరియు సున్నపుశాతం ఎక్కువైనప్పుడు మరియు చౌడు నెలల్లో కనిపిస్తుంది. ఈ ధాతు లోపం వచ్చిన పంటపై కొత్తగా వస్తున్న ఆకులు చిన్న చిన్నవిగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుదించుకుపోయి గుబురుగా కురచగా కనిపిస్తాయి. దీని నివారణకు నాలుగు కిలోల బోరాక్స్ ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఒక గ్రాము బోరాక్స్ లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేయాలి. కావున పైన తెలిపిన నివారణ చర్యలు సరైన సమయంలో చేపట్టినట్లయితే పంట దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
– ఈ. రజనీకాంత్, డా. ఎస్.ఓం ప్రకాష్, డా. కృష్ణ చైతన్య,
డా. పి. రవి, డా. ఉమా దేవి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,
పొలాస జగిత్యాల, ఫోన్ :
Also Read: Maize(Corn) Products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!
Also Watch: