Bengal gram Cultivation: యాసంగిలో శనగ, వేరుశనగ మరియు వరిని పండిస్తారు.ఈ పంటల ద్వారా వచ్చిన విత్తనాన్ని వచ్చే యాసంగి వరకు తగు జాగ్రత్తలతో నిల్వ చేసుకోవాలి లేనిఎడల కోత తర్వాత నిల్వ సమయంలో విత్తన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. విత్తనం కోసినప్పటి నుండి మరల అది భూమిలో విత్తే సమయం వరకు విత్తన నిల్వ సమయంగానే పరిగణించాలి. రైతులు పంట పక్వ దశను గుర్తించి సకాలంలో పంట కోత కోసి కోత అనంతరం మరియు తదుపరి నిల్వ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక నాణ్యమైన పంట దిగుబడి తద్వారా అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.
పంట కోత సమయం :
పంటను సరైన సమయంలో కోయడం చాలా ముఖ్యం సాధారణంగా శనగ పంట పూత దశ నుండి 50`55 రోజులలో పరిపక్వతకు చేరుతుంది.
పంట కోత లక్షణాలు :
కాయలు ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగుకు మారినప్పుడు, ఆకులు పసుపు బారి, పూర్తిగా రాలిపోయి మొక్క అంత ఎండినప్పుడు పంట కోతకు చేపట్టవచ్చు
ఈ సమయంలో సకాలంలో కోత కోస్తే గింజ అధిక నాణ్యతను కలిగి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. పంటను కూలీలు లేదా కంబైన్డ్ హార్వెస్టర్‌తో కూడా కోయించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యం కొరకు యంత్రాలని వాడాలి. వాడే ముందు యంత్రాలని శుభ్రపరచుకుంటే కల్తీలను నిరోధించవచ్చు. కోత సమయంలో అధిక వర్షపాతం, తేమ ఉన్నట్లయితే కీటకాలు మరియు శిలీంద్రాలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిల్వలో పాటించాల్సిన జాగ్రత్తలు :
జన్యురీత్యా అధిక నాణ్యత గల ఆరోగ్యకర విత్తనం ఎక్కువ కాలం పాటు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, కానీ విత్తన నిల్వలో తగు జాగ్రత్తలు పాటించకపోవడం వలన ఆ విత్తనం నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంటుంది, విత్తన నిల్వను ప్రభావితం చేసే అంశాలలో విత్తన తేమశాతం ముఖ్యమైనది. పంట రకాన్ని బట్టి విత్తనం తేమశాతం మారుతుంది. శనగలను 9% విత్తన తేమ వచ్చే వరకు ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలి. విత్తనాన్ని కోసిన వెంటనే కళ్లెంలో ఎండలో బాగా ఆరబెట్టాలి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు ఆరబెట్టి దగ్గరకు చేర్చి టార్ఫాలిన్ పట్టాలతో కప్పి నిర్దిష్ట తేమశాతం వచ్చేవరకు రోజు కూడా ఇలానే చేయాలి. ఎక్కువ ఎండ సమయంలో ఆరబెట్టడం అంత మంచిది కాదు.
నిర్దిష్ట తేమశాతం వరకు విత్తనాన్ని ఆరబెట్టడం వలన నిల్వ సమయంలో చీడపీడల బారిన పడకుండా విత్తన నాణ్యత క్షీణించకుండా ఉండి పంట నిల్వ సమస్యలు కొంత తక్కువగానే ఉంటాయి. విత్తనాన్ని పండిరచే ప్రదేశం యొక్క వాతావరణం కూడా విత్తన నిల్వను ప్రభావితం చేస్తాయి.
పంట కోత సమయంలో విత్తన తేమశాతం మరియు విత్తన నిల్వకు ఉండవలసిన నిర్దిష్ట తేమశాతం, విత్తనం నిర్దిష్ట తేమశాతంకు వచ్చిన తర్వాత దాన్ని చెత్త చెదారం లేకుండా ప్రాసెసింగ్ ద్వారా శుద్ధి చేసుకోవాలి. విత్తన నిల్వను ప్రభావితం చేసే అంశంలో మరొకటి విత్తనాన్ని నిల్వ చేసే సంచులు. పంట రకాన్ని బట్టి కూడా విత్తన సంచులు మారుతాయి. విత్తన సంచులలో తేమను అనుమతించేవి తేమను అనుమతించనివి మరియు వాయువుని అనుమతించేవి. ప్రాసెసింగ్‌కి ముందు విత్తనం నిల్వ చేయడానికి కొత్త సంచులనే వాడాలి, ఒకవేళ బల్క్ స్టోరేజ్ కోసం పాత సంచులను వాడవలసి వస్తే వాటిలో ముందు నిల్వచేసిన విత్తనం ఏమీ లేకుండా చూసుకోవాలి. సంచులను ఎండలో బాగా ఆరబెట్టడం లేదా మలాథియాన్ ద్రావణం లీటరు నీటికి పది మి.లీ. కలిపి సంచులను వాటిలో నానబెట్టి బాగా ఆరిన తర్వాత విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులలో ఉన్న చీడపీడలు నశిస్తాయి.
Also Read: Antirrhinum Cultivation: అంటిరైనమ్ పూల సాగు విధానం.!
విత్తనం నిల్వను ప్రభావితం చేసే వాటిల్లో విత్తనాన్ని నిల్వ చేసే గోదాములు. గోదాములలోని పక్షులు చొరబడకుండా, ఎలుకలు నష్టం చేయకుండా ఉండేలా నిర్మించుకోవాలి గోదాములను నిర్మించేటప్పుడు నేల ఉపరితలం నుండి తొమ్మిది సెంటీమీటర్లు ఎత్తులో కాంక్రీట్ ప్లాట్‌ఫామ్ నిర్మించి దాని చుట్టూ 15 సెంటీమీటర్ల అంచులను నిర్మించాలి. విత్తనం గోదాములలో పెట్టడానికి మరియు గోదాముల నుండి తరలించడానికి ఐరన్‌తో చేసినటువంటి తీసిపెట్టే మెట్లను ఏర్పరుచుకోవాలి. గోదాము లోపల భాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. విత్తనాన్ని నిల్వ చేసే ముందుగానే గోదాము గోడలను, పైకప్పులను, కిటికీలను బాగా శుభ్రం చేసుకోవాలి ఒకవేళ ఏదైనా చీడపీడలు ఉన్నట్లయితే మలాథియాన్ ద్రావణం ఐదు మి.లీ. లీటరు నీటికి కలిపి గోదాము గోడలు కిటికీలు బాగా తడిచేలాగా పిచికారి చేసుకోవాలి. రసాయనాలు వద్దు అనుకుంటే ఐదు శాతం వేప గింజల కషాయం లేదా లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను గోదాములలో పిచికారి చేసిన తర్వాత విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి.
విత్తనం నిల్వ చేసే గోదాములకు ఎక్కువ కిటికీలను అమర్చకూడదు. కిటికీలు ఉంటే వాటిని మూసివేసి వెంటిలేటర్ ద్వారానే గాలి ప్రసరణ జరిగేలాగా చూడాలి. వెంటిలేటర్ ద్వారా కూడా ఎలుకలు చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంటుంది కావున వెంటిలేటర్స్‌కు మెష్‌ను విధిగా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో కిటికీల నుండి వర్షపు నీరు చేరకుండా చూడాలి. దానికై సన్ షేడ్ రేకులను గాని సిమెంట్‌గాని దిమ్మలను అమర్చుకోవాలి. గోదాములలో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటే అక్కడక్కడ గమ్ ట్రాప్స్‌ని అమర్చాలి. ఈ గమ్‌కి ఎలుకలు వెంట్రుకలు అత్తుకొని కదలి లేక పోతాయి అలా పడ్డ ఎలుకలను నశింపచేయాలి.
నాణ్యమైన విత్తనాన్ని పండిరచటంలో పంట యాజమాన్య పద్ధతులు ఎంత ముఖ్యమో పంట కోసిన తర్వాత వాటిని సరైన పద్ధతితో శుభ్రపరిచి నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం. విత్తన నిల్వలో విత్తనం యొక్క నాణ్యత దెబ్బతినే ఆస్కారం చాలా ఉన్నందున నిల్వలో సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా విత్తన నాణ్యతను కాపాడి, నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించగలం.
ప్రస్తుత తరుణంలో రైతులు శనగ పంట కోతకు సన్నద్ధమవుతున్నారు మరి కొంతమంది శనగ పంట కోతను ముగించారు. వచ్చే పంటకు విత్తనాన్ని నిల్వ ఉంచుకోడానికైనా లేదా మంచి మార్కెట్ ధరకి పంటను అమ్మడానికైనా పైన చెప్పిన విధంగా మెళకువలు పాటిస్తే అధిక లాభాన్ని పొందవచ్చు.
డా.వి. స్వర్ణలత, డా.కె. ప్రభావతి, డా.ఎం. పల్లవి,
ఎ.స్నిగ్ధ, శ్రీ లాస్య, డా.వై. భారతి, డా.పి. సుజాత, డా.పి. జగన్ మోహన్ రావు
విత్తన పరిశోధన మరియు సాంకేతిక కేంద్రం,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశోధనాస్థానం, హైదరాబాద్.
Also Read: Amchur Powder (Dry Mango Powder): ‘‘ఆంచూర్’’తో పోషకాలు ఉపయోగాలు.!