Okra Ladies Finger Farming: రోజు వారి ఆదాయంతో నిత్యం కాసులను కళ్ళ చుపేవి కూరగాయలు. కూరగాయల్లో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. నిత్యం డిమాండ్ ఉండే కూరగాయల్లో బెండ ఒకటి . ధరలు దాదాపు స్థిరంగా ఉండే బెండ సాగులో రసం పీల్చే పురుగులు, పల్లాకు తెగులు, కాయ పుచ్చు తప్ప ఇతరిత్ర సమస్యలు తక్కువే. వీటిని అధికమించి సాగు చేస్తే బెండ నుంచి సుమారు ఎకరాకు 8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం కలదు.
బెండను ఖరీఫ్, వేసవి పంటగా సాగు చేస్తారు. శీతాకాలం లో ఈ పంట పెరగదు. ఖరీఫ్ పంటగా జూన్, జూలై మాసాలలో విత్తుకొని సాగు చేస్తారు. ముఖ్యంగా ఖరీఫ్ లో పంటకు రసం పీల్చే పురుగులు , కాయ తొలిచే పురుగులతో పాటు తెగుళ్ళ లో పల్లాకు తెగులు, ఎండు తెగులు ఆశించి దిగుబడులు తగ్గిస్తాయి. రకాల ఎంపిక నుంచే సాగులో అప్రమత్తతో వ్యవహరిస్తే బెండలో అధిక దిగుబడులు పొందవచ్చు.
ఖరీఫ్ బెండ సాగు వివరాలు:
నేలలు:
సారవంతమైన, తేలిక పాటి నేలలు అలాగే మురుగునీటి వసతి కలిగిన నల్లరేగడి నేలలు అనుకూలం.
రకాల ఎంపిక:
1) పర్బని క్రాంతి:
పర్బని క్రాంతి అనే రకం 4-4.5 టన్నుల దిగుబడి ఒక ఎకరాకు ఇస్తుంది. పంట కాలం 85-90 రోజులు వుంటుంది.
2) అర్క అనామిక :
అర్క అనామిక అనే రకం 4-5 టన్నుల దిగుబడి ఒక ఎకరాకు ఇస్తుంది. పంట కాలం 85-90 రోజులు ఉంటుంది. విత్తిన 55 రోజులలో కాపు కి వస్తుంది. కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మధ్యస్థం గా ఉంటాయి.
3) అర్క అభయ:
అర్క అభయ అనే రకం పల్లాకు తెగులును బాగా తట్టుకుంటుంది. అర్క అనామిక రకం లక్షణాలను పోలి ఉంటుంది.పంట కాలం 85-90 రోజులు ఉంటుంది.
Also Read: Cotton Crop Nutrition: రైతులు మురిపెంగా తెల్ల బంగారం అంటూ పిలిచే ప్రత్తిలో సమగ్ర పోషక యాజమాన్యం

Okra Ladies Finger Farming
అధిక దిగబడినిచ్చే సంకర రకాలు :
విజయ్, విశాల్,మోనా, అవంతిక , సుప్రియ, ఐశ్వర్య, యు.యస్ 7109
ఎగుమతికి అనువైన రకాలు :
పంజాబ్ పద్మని,వర్ష, విశాల్, నాథ్ శోభ
విత్తన మోతాదు :
సూటి రకాలు అయితే ఒక ఎకరాకు 4-6 కిలోలు అదే సంకర రకాలు అయితే ఒక ఎకరాకు 2-2.5 కిలోలు విత్తనం అవసరం అవుతుంది.
విత్తన శుద్ధి:
కిలో విత్తనానికి 5 ml ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్. యస్ (గౌచ్ అనే పేరుతో మార్కెట్ లో దొరుకుతుంది) తో విత్తన శుద్ధి చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయటం వలన బెండ పంటను ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, పల్లాకు తెగులు నుండి కాపాడుకోవచ్చు. తరువాత కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి తో విత్తన శుద్ధి చేయాలి.
నేల తయారీ:
నేలను 3-4 సార్లు బాగా దున్నుకోవాలి.60cm వెడల్పు బొదెలు అనగా 2 అడుగుల వెడల్పు బొదెలు తయారు చేసుకోవాలి. బోదెల లో పై నుంచి 3 వ వంతులో 30 cm దూరంలో 2 విత్తనాలు చొప్పున విత్తుకున్నట్లైతే 10-12 రోజులలో మొలక వచ్చిన తర్వాత బలంగా ఉన్న మొక్కను ఉంచి మిగతా మొక్కలను తీసివేయవచ్చు. వరుసల మధ్య 45 cm మరియు మొక్కల మధ్య 15-20 cm దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకు రెండవ నీటి తడి ఇవ్వాలి.
ఎరువుల యాజమాన్యం :
ఆఖరీ దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియ దున్నుకోవాలి. ఆలాగే ఆఖరీ దుక్కిలో ఎకరాకు 150 కేజీలు (3 బ్యాగ్స్) SSP ఒకవేళ DAP వేస్తే 50 కేజీలు (1బ్యాగ్) వేయాలి.ఆఖరీ దుక్కిలో ఎకరాకు 40 కేజీలు పొటాష్ వేసుకోవాలి. యూరియా విత్తినప్పుడు,30 రోజులకు,45 రోజులకు ఒక ఎకరాకు 34 కేజీల చొప్పున వేసుకోవాలి.
నీటి యాజమాన్యం:
వర్షా కాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7-8 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి.
కలుపు నివారణ:
సిఫార్సు చేసిన కలుపు మందులు, సిఫార్సు చేసిన సమాయం లో పిచికారి చేసి కలుపును నివారించుకోవాలి. పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.2 లీ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకొని పిచికారి చేయాలి. విత్తిన 25,30 రోజులప్పుడు గొర్రు లేక గుంటక తో అంతర కృషి చేయాలి. వానా కాలంలో మట్టిని ఎగదోసి బోదెలు చేయాలి.
పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం :
ఆలాగే పురుగులను, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి సిఫార్సు చేసిన మందులు పిచికారి చేసుకోవాలి. రైతులు ఈ యాజమాన్య పద్దతులు పాటించి బెండలో అధిక దిగుబడులు పొందవచ్చు.