Cotton Cultivation Techniques: ప్రపంచంలో పత్తి పండించే దేశాలలో భారతదేశం పత్తి విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నపటికీ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి గల కారణాలు- సాగు చేసే రకాలు, పాటించే యాజమాన్య పద్ధతులు, విత్తే దూరం, ఎకరాకు తక్కువ మొక్కల సాంద్రత, ఎక్కువ పంట కాలము, చీడపీడలు, కూలీలతో ప్రత్తి ఏరడం.
ప్రత్తి సాగు ప్రధానమైన చేసే దేశాలలో ప్రత్తి సాగు కేవలం సూటి రకాలతో అధిక సాంద్రతలో జరుగుతుంది. అంటే 90I15 సెం.మీ. (లేదా) 90I10 సెం.మీ. దూరంలో ఎకరాకు సుమారుగా 29,630 (లేదా) 44,444 మొక్కల సాంద్రత పాటిస్తూ మేపిక్వాట్ క్లోరైడ్ పిచికారీతో పంట శాఖీయ దశ పెరుగుదల నియంత్రణ చేస్తూ, మొక్కకు కేవలం 10-15 కాయలు ఉండేలా చూస్తూ ఎకరాకు 1500 కిలోల దూది దిగుబడి సాదించగలుగుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం గుబురుగా పెరిగే, హైబ్రీడ్ వంగడాలు మాత్రమే సాగులో ఉన్నాయి. వీటిని 90I60 సెం.మీ. (లేదా) 120I60 సెం.మీ. విత్తే దూరంలో సాగు చేయబడి ఎకరాకు కేవలం 5,555 నుండి 7,407 మొక్కల సంఖ్య ఉండటం వలన, మొక్కలు బాగా గుబురుగా ఉండుట, పంట కాలం పెరగడం, అదేవిధంగా గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా కావడం, తద్వారా యాజమాన్యానికి అవసరమయ్యే ఖర్చులు ఎక్కువవుతున్నాయి.
కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు స్థాయిలో పత్తి ఉత్పాదకతను పెంచడానికి ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. అధిక సాంద్రత పత్తి సాగు అనగా సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా నాటుకోవడం. ఈ పద్ధతిలో విత్తన మోతాదు 2 కిలోలు అవసరం అవుతుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగు వర్షాధార తేలిక నేలలకు మరియు భూసారం తక్కువగా ఉండే చల్కా నేలలకు అనుకూలము.

Cotton Cultivation Techniques
ఎరువుల యాజమాన్యం : ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అవసరం. ఈ పోషకాలను ఎరువుల మోతాదులో లెక్కించినప్పుడు 110 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని వేసుకోవాలి. అయితే పోషకాలని డి.ఎ.పి. రూపంలో వేస్తే 50 కిలోల డి.ఎ.పి., 84 కిలోల యూరియా, ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు చివరి దుక్కిలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని అంటే 150 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డి.ఎ.పి.ని దుక్కిలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన నత్రజని మరియు పోటాష్‌ను రెండు భాగాలుగా చేసుకొని 30-35 రోజులకు, 70-75 రోజులకు పై పాటుగా వేసుకోవాలి.
సమగ్ర కలుపు యాజమాన్యం : విత్తనం వేసిన 24 నుండి 48 గంటల లోపు భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు ఎకరానికి పెండిమిథాలిన్ 1.2 లీటర్ అనే కలుపు మందును చేతి పంపుతో చేనంతా తడిచేటట్టు పిచికారీ చేయాలి. పత్తి మొలకెత్తిన నెలరోజులకు చేనులో వచ్చే లేత గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోఫాప్ ఇథైల్ 400 మి.లీ. (లేదా) ప్రోపాక్విజఫాప్ 250 మి.లీ. మరియు పైరిథయోబ్యాక్ సోడియం ఏ 250 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా సమయానుకూలంగా అంతర కృషి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం : పత్తిలో పూత, పిందె, కాయ తయారయ్యే దశలు నీటికి క్లిష్టమైన దశలు. ఈ దశలో బెట్ట వస్తే పూత, పిందె, కాయ రాలుతుంది. కావున నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

Spraying Pesticides in Cotton Crop
పంట శాఖీయ దశ పెరుగుదల నియంత్రణ : పత్తి పంట శాఖీయ దశ పెరుగుదల నియంత్రణకు మేపిక్వాట్ క్లోరైడ్ (1 మి.లీ./లీటరు నీటికి) అనే హార్మోన్ రసాయనిక మందుని విత్తిన 45 రోజుల దశలో ఒకసారి మరియు 60-70 రోజుల దశలో మరొకసారి పిచికారీ చేసుకోవడం వలన మొక్క శాఖీయ దశ నియంత్రణలో ఉండి, గుబురుగా పెరగకుండా, కాయ బరువు పెరిగే అవకాశం ఉంటుంది.పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుండి ఏర్పడిన పూత అంత కాయలుగా మారి ప్రత్తి త్వరగా ఒకేసారి తీతకు వచ్చే అవకాశం ఉంటుంది.
గమనిక :
అధిక సాంద్రత పత్తి సాగులో పంట శాఖీయ దశ పెరుగుదల నియంత్రణకు వాడే మేపిక్వాట్ క్లోరైడ్ అనే మందుని ప్రత్తి పంటలో సాధారణ పెరుగుదల ఉన్నప్పుడే వాడాలి. గత మాసాలలో కురిసిన అధిక వర్షాల వలన చాలా చోట్ల పత్తి పంట ఎదుగుదల సరిగా లేదు, ఇలాంటి పరిస్థితులలో మేపిక్వాట్ క్లోరైడ్ అనే మందుని మొదటి దఫాగా పిచికారీ చేయడం ఆపివేయాలి.
చీడ-పీడల యాజమాన్యం : సాధారణ పత్తిలో మాదిరిగానే చీడ-పీడల నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలి. ప్రస్తుత పరిస్థితులలో పత్తి పంటలో రసం పేనుబంక, పచ్చ దోమ, తామర పురుగులు మొదలగు రసం పీల్చు పురుగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు కాండానికి మందు పూత పద్ధతిని (మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోరోప్రిడ్, నీరు లేదా ఫ్లోనికామిడ్, నీరు 1:20 నిష్పత్తిలో 30, 45, 60 రోజులలో) ఉపయోగించి రసంపీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రా. థయోమిథాక్సమ్ లేదా 0.3 గ్రా. ఫ్లోనికామిడ్ మొదలగు వాటిని పిచికారీ చేసుకోవాలి. పత్తిని ఆశించే గులాబీరంగు పురుగు నివారణకు పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టల ద్వారా సరైన నిఘా పెట్టి, తొలి పూత దశ నుండి చేనులో కనిపించే గుడ్డి పూలను ఎప్పటికపుడు ఏరి నిర్ములిస్తూ ఆ పైన పురుగు తాకిడిని బట్టి మొదటి దశలో ప్రోఫినోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ అవసరం మేరకు పిచికారీ చేయాలి. మధ్య మధ్య మందులతో పాటు వేప కాషాయం 5% లేదా వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పంట కోత, పత్తి తీతలో మెళకువలు : సాధారణమైన పద్ధ్దతిలో పత్తి సాగు చేసినప్పుడు పూత, కాత దఫ దఫాలుగా రావడం వలన ప్రత్తిని 3 -4 సార్లు తీయటం జరుగుతుంది. దీనివలన ఎకరాకు సరాసరి దిగుబడి 8 క్వింటాళ్ళ ప్రత్తిని ఏరడానికి కూలీల ఖర్చు సుమారుగా రూ. 8000/- అవుతుంది. అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగు చేసినపుడు ఎకరానికి సరాసరి దిగుబడి 10 క్వింటాళ్ళ ప్రత్తి కూలీలతో రెండుసార్లు ఏరడానికి రూ.10000/- వరకు ఖర్చు అవుతుంది. దీనికి ప్రత్యమ్నాయంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుచేసినప్పుడు యంత్రంతో ఒకేసారి పత్తి ఏరడం వలన ఎకరానికి సుమారుగా రూ. 5,000 మాత్రమే ఖర్చు అవుతుంది.
-డా. కె. మదన్ మోహన్ రెడ్డి, డా. జి. మంజులత, డా. ఎం. రాజేంద్ర ప్రసాద్,
-డా. జి. ఉషారాణి, డా.పి. మధుకర్ రావు, డా.డి. శ్రావణి మరియు
-డా.ఏ. విజయభాస్కర్.
ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్
Also Read: Black Rot in Cotton: ప్రత్తిని ఆశిస్తున్న బాక్టీరియా నల్ల మచ్చ తెగులుయాజమాన్యం.!
Must Watch:
Also Watch: