Foxtail Millet Cultivation: మానవాళిలో పెరిగిపోతున్న అనారోగ్య కారణాల వల్ల వైద్యులు కొర్రలు మంచి ఆహారమ అని సిఫారసు చేస్తున్నారు. బీదవారి ఆహారంగా చెప్పుకునే చిరుధాన్యపు పంట కొర్రను ఒకప్పుడు విరివిగా సాగుచేసేవారు. ఆరోగ్యపరంగా కొర్రఅన్నం అన్నింటి కంటే శ్రేష్ఠం. గిరాకీ పెరగడంతో కొర్రసాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. పౌష్టికాహారంలో చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతుంది. వీటిలో పోషకాలస్థాయి ఎక్కువ ఉండటంతో పాటు, విటమిన్లు మెండుగా ఉన్నా ప్రజల్లో మారుతున్నఆహారపుఅలవాట్లను బట్టి పంట ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది.
అనుకూలపరిస్థితులు :
ప్రపంచంలో అధికంగా పండిరచే తృణధాన్యాల్లో కొర్రపంట రెండో స్థానంలో ఉంది. కొర్రకాండం నిలువుగా ఉండి, 70-75 సెం.మీ. ఎత్తు ఉంటుంది. కంకి అధికబరువు వల్ల కొంచెం కాండం వంగుతుంది. కొర్రల్లో 10-12 శాతం మాంసకృత్తులు, 4.7 శాతంకొవ్వుపదార్థం, 60.6 శాతంపిండిపదార్థం, 2.29 నుంచి 2.7 శాతంలైసిన్, 0.59 మి.గ్రా.థయమిన్ ఉంటుంది. సంప్రదాయ పంటలు కనుమరుగవుతున్న తరుణంలో కొర్రపంటపై రైతులు మొగ్గు చూపడం మంచి పరిణామం.
కొర్ర కొవ్వు లేని మంచి ఆహారం. వరి తో పోలిస్తే పీచుపదార్థం, పిండిపదార్ధాలు అధికం. సాధారణంగా వరిఅన్నం తిన్నప్పుడు దానిలో పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారి త్వరగా రక్తంలో కలిసిపోతాయి. అందుకే తిన్న వెంటనే త్వరగా ఆకలివేస్తుంది. కానీ, కొర్రలు నిదానంగా జీర్ణమై ఆకలి వేయదు. కొర్రల్లోని విటమిన్లు, సూక్ష్మపోషకాలు ఆరోగ్యానికి ఎనలేని మేలుచేస్తాయి.
కొర్రలను తక్కువ వర్షపాతం, మితమైన వాతావరణంలో పండిరచవచ్చు. పంటకు 400-500 మి.మీ. వర్షపాతం ఉంటే అనుకూలంగా ఉంటుంది. మంచి మురుగు నీటిపారుదల సదుపాయం గల ఒండ్రు నేలలు సాగుకు అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు కొర్రసాగుకు అనుకూలంకాదు. కొర్రకంకి నక్కతోకనిపోలి ఉంటుంది. గనుక దీనిని పాక్స్టెయిల్మిల్లెట్ అనికూడా పిలుస్తారు.
విత్తేసమయం : కొర్రలను ఖరీఫ్‌లో జూన్-జులై మాసాల్లోవిత్తుకోవాలి. సాధారణంగావరుసలమధ్య 25-30 సెం.మీ. దూరంపాటించాలి. వరుసలోమొక్కలమధ్య 8-10 సెం.మీ. దూరంలోఉండాలి. వరుసల్లోవిత్తుకోవడానికిఎకరాకు 8-9 కిలోలు, వెదజల్లేపద్ధతిలో 10 కిలోల విత్తనం సరిపోతుంది.
రకాలు : పరిశోధనా స్థానంలో రూపొందించిన రకం ఎస్ఐఎ 3222 ఎకరాకు 6-7 క్వింటాళ్ళ గింజ దిగుబడితో పాటు 8-16 క్వింటాళ్ళ పశుగ్రాసాన్నిస్తుంది. పంటకాలం 60-62 రోజులు. అగ్గితెగులును మరియు వెర్రి కంకు తెగులను తట్టుకుంటుంది.
ఎస్.ఐ.ఎ-3085: రకం 76-80 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి నిస్తుంది. అగ్గితెగులు, గింజబూజు తెగుళ్లను తట్టుకుంటుంది.
సూర్యనంది (ఎస్.ఐ.ఎ-3088): రకం 70-75 రోజులోనే పంటకొచ్చిఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి నిస్తుంది. అగ్గితెగులును మరియు వెర్రి కంకు తెగులను తట్టుకుంటుంది.
ఎస్.ఐ.ఎ-3156 : రకం 85-90 రోజుల్లో పంట కొచ్చి ఎకరాకు 11-13 క్వింటాళ్ల దిగుబడి నిస్తుంది. నత్రజని ఎరువులకు బాగా ప్రతిస్పందిస్తుంది. వెర్రి కంకి తెగులను తట్టుకుంటుంది.
ఎస్ఐఎ 3223 : ఎకరాకు 11-13 క్వింటాళ్ళ గింజ దిగుబడి నిస్తుంది. పంటకాలం 85-90 రోజులు. వెర్రి కంకు తెగులను తట్టుకుంటుంది మరియు చొప్ప దిగుబడిని ఇస్తుంది
విత్తడం : కిలోవిత్తనానికి కార్బెండాజిమ్ 2 గ్రా. లేదామాంకోజెబ్ 3 గ్రా.చొప్పున విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.
ఎరువులు : నాటడానికి 2-3 వారాలముందు ఎకరాకు 4 టన్నులపశువులు ఎరువు వేయాలి. అలాగే 16 కి. నత్రజని, 19 కి. భాస్వరం, 8 కి. పొటాష్ అందించే ఎరువులు వేయాలి. నత్రజనిఎరువు 2 దఫాలుగాదుక్కిలో, 30 రోజుల తర్వాత వేయాలి. కొర్రపంటలోఅధిక దిగుబడి రావాలంటే మొక్క పలుచన చేయడం చాలాఅవసరం. విత్తిన 25-30 రోజుల్లో కుదురుకు ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రమే ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి. పంట ఒత్తుగా ఉంటే పిలకలు ఎక్కువగా రాక, కంకులు ఏర్పడక గింజ దిగుబడి తగ్గిపోతుంది.
నీటియాజమాన్యం : ఖరీఫ్‌లో వేసిన కొర్రపంటకు ప్రత్యేకంగా నీరుపెట్టాల్సిన అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఎక్కువకాలం ఉంటే పూత, గింజ సమయం, గింజ నిండుకునే సమయాల్లో నీడితడులు ఇచ్చుకోవాలి.
పూతసమయంలో బెట్ట ఏర్పడితే పూత సరిగా నిలవదు. కొర్రలు సాధారణంగా విత్తిన 45-50 రోజుల్లో పూత వస్తుంది.55-65 రోజుల మధ్య గింజ కట్టుకునే సమయం ఉంటుంది. అలాగే 65-75 రోజుల మధ్య గింజ నిండుకునే దశ ఉంటుంది. గింజ కట్టుకునే సమయంలో బెట్ట ఏర్పడితే గింజల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. గింజ నిండుకునే దశలో బెట్ట ఉంటే తాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది.
కలుపుయాజమాన్యం : కలుపుమందులు మాత్రమే కాకుండా 2-3 సార్లు దంతెతో అంతర కృషి చేస్తే కలుపు సమర్థంగా నివారించవచ్చు. సాళ్ళల్లో విత్తుకుంటే కలుపుతీతకు అనుకూలంగా ఉంటుంది. విత్తిన 1-2 రోజులకు ఐసోప్రొట్యురాన్ ఎకరాకు 400 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వెడల్పాకు కలుపు మొక్కలుంటే తర్వాత 2,4-డిసోడియంసాల్ట్ 80 శాతం పొడిమందును ఎకరాకు 400 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 20-25 రోజుల తర్వాత పిచికారి చేయాలి.
అంతరపంటలు : కొర్ర-ఆవాలు,కొర్రపెసలు, కొర్రకంది, కొర్ర-పొద్దుతిరుగుడు అంతరపంటల సాగు మంచి లాభదాయకం.
చీడపీడలు :
కాండంతొలుచుపురుగు : నివారణకి కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు ఎకరానికి 8 కిలోలచొప్పున నీటి తడి ముందు వేసిన చో మంచి ఫలితం ఉంటుంది లేదా థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొవ్వుఈగ : విత్తనం నాటిన నుంచి వారాల వరకు పంటను నష్టపరుస్తుంది. కాండం ఎండి పోతుంది. పంటకాలం పెరిగే కొద్దిపిలకలు ఎక్కువగా వస్తాయి. చెడిపోయిన పిలకల మీద కంకులు ఏర్పడతాయి. కాని గింజలు ఉండవు. ఈపురుగు ఎక్కువగా ఆలస్యంగా జులై లేదా ఆగస్టు మాసంలోవస్తుంది.
నివారణ : పంట ముందుగా నాటాలి (జులై రెండోపక్షంలోగా) సిఫారసు చేసిన విత్తన మోతాదు కన్నా 1.5 రెట్లు అధికంగావేయాలి. ఫోరేట్ 4జి. లేదా కార్బోఫ్యూరాన్ 3జి. గుళికలు నేలలో వేయడం వల్ల పురుగు ఆశించటం తగ్గుతుంది. క్యినాల్ఫాస్ 2 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అగ్గి తెగులు : నివారణకి కార్బెండిజం 1 గ్రా. లేదా ట్రైసైక్లాజోల్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
వెర్రి కంకి తెగులు : నివారణకి 3 గ్రా. కేప్తాన్ లేదా 3 గ్రా. మెటలాక్సిల్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పంటకోత : పంట 80-100 రోజుల్లో కోతకు వస్తుంది. కంకులు బాగా ఎండాక మొత్తం మొక్కను లేదా కంకులు మాత్రమే వేరుగా కోయాలి. పంటకోత ఖరీఫ్‌లో సెప్టెంబర్నుంచి అక్టోబర్‌లో, రబీలో జనవరి నుంచి ఫిబ్రవరిలో చేయాలి.
Also Read: Tomato Price: కిలో టమాట 50 రూపాయలకే .. 103 మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం