తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

మామిడి పూత దశలో ఈ జాగ్రత్తలు తీసుకోండి !

0
  • మామిడిని తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పండ్లతోట. వేసవిలో నోరూరించే  మామిడి పండ్ల గురించి ఇప్పుడు ఎందుకు అని అంటారా..? చాలా మంది రైతులు పొరపాటు చేసేది ఇక్కడే… ! పూత, పిందె వచ్చిన తర్వాతే తోటలపై దృష్టి పెడతారు. అలా కాకుండా గతేడాది తోటల్లో వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభిస్తే సకాలంలో పూత వచ్చి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. మామిడి పూత ముందు తీసుకోవాల్సిన జాగ్రతల గురించి తెలుసుకుందాం.

    మామిడి పూత ముందు మనం తగిన యాజమాన్య పద్దతులు చేసుకున్నట్లయితే, పూత, కాత  సమయంలో చీడపీడల ఉధృతి తగ్గుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది.

  • ముందుగా తోటను శుభ్రం చేసుకుని, కలుపుని నివారించాలి.
  •  గత సంవత్సరం కూడా పండు ఈగ వల్ల నష్టం జరిగి ఉంటే ఈ సంవత్సరం కుడా పండు ఈగ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెట్టు చుట్టు పాదులు చేసుకొని ముందు జాగ్రత్త చర్యగా వేపపిండిని ఒక చెట్టుకు ఒక కిలో చొప్పున చల్లుకోవాలి.
  • చెట్టు మీద ఎలాంటి ఎండు కొమ్మలు, ఎండుపుల్లలు లేకుండా తీసివేయాలి. తీసివేసిన ఎండుకొమ్మల భాగాలకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందు పిచికారీ లేదా పూతలాగా పూయాలి.
  • చెట్ల మీద గూడు పురుగు చేసిన గూళ్ళు ఉన్నట్లయితే కర్రలతో వాటిని చెదరగొట్టి, పురుగుమందులను పిచికారి చేయాలి.
  • చలి వాతవరణంలో తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి, పగలు ఉష్ణోగ్రతలలో తేడాలు ఉండటం వల్ల తేనె మంచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
  • తేనెమంచు పురుగు నివారణకు సైహ్యాలోత్రిన్ మందును 0.5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయవచ్చు.
  •  ఆకుల మీద, కొమ్మల మీద నల్లని మచ్చలు ఉన్నట్లయితే 1 గ్రా. కార్బండిజమ్ లేదా మాంకొజెబ్ 2.5 గ్రా.లీటరు నీటికి పిచికారి చేయాలి.
  • పూత మొత్తం ఒకే సమయానికి రావడానికి 13: 0 : 45 గ్రా. మరియు 5 గ్రా. ఫార్ములా – 4 చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • ఈ మధ్య కాలంలో తోటల్లో తుప్పు తెగులు ఆశిస్తోంది. తుప్పు తెగులు ఎక్కువగా రావడానికి గల కారణం మనం గడ్డిని ఎక్కువగా ఉంచి, నేలను ఎక్కువగా దున్నకపోవడం వల్ల అధిక వర్షాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి బెట్ట పరిస్థితుల్లో తుప్పుతెగులు ఎక్కువగా వస్తుంది.
    మామిడిలో రెట్టింపు లాభాల కోసం…
  • మామిడిలో లేత తోటలు వేసుకునేటప్పుడు అధిక సాంద్రతలో (5 మీ.× 5మీ.) 160 మొక్కలు ఎకరానికి ఉండేటట్లుగా వేసుకోవాలి. దీని వల్ల ఉత్పాదకత పెరిగి లాభాలు రెట్టింపు అవుతాయి.
  • మొక్కలకు నీటిని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చుకుంటూ చెట్ల పాదుల్లో మల్చింగ్ చేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయి. ఈ  రెండు పద్ధతులను ఆచరించడం ద్వారా దిగుబడులు పెరిగి ఆదాయం రెట్టింపు అవుతుంది.
  • క్రమం తప్పకుండ కత్తిరింపులను జూన్-జూలై మాసంలో చేసుకోవాలి.
  • సిఫారసు చేసిన ఎరువులను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాడాలి.
  • సూక్ష్మధాతు లోప నివారణకు జింక్, బోరాన్ ప్రత్యేకంగా సంవత్సరంలో 3, 4 సార్లు సిఫారసు మేరకు పిచికారి చేసుకోవాలి.
  • పొటాషియం నైట్రేట్ 10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పూతకు ముందు, పిందెలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు రెండవసారి క్రమం తప్పకుండా ప్రతి ఏటా పిచికారి చేయాలి.
  • కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ పద్ధతి ద్వారా చెట్టుకు సిఫారసు మేరకు నీరు అందించాలి.
  • ఎగుమతులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు (పురుగు మందుల పిచికారి, కాయకోత) పాటించాలి.

నెలవారీ సస్యరక్షణ చర్యలు:

డిసెంబర్: చెట్టు పూమొగ్గ దశలో ఎసిఫేట్ 1.5 గ్రా. మరియు శిలీంధ్ర నాశినులు అయిన డైఫెన్ కొనజోల్ 1 మి.లీ లేదా థయోఫానేట్ మిథైల్ లేదా కార్బండిజమ్ 1 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

జనవరి: పచ్చిపూత దశలో థయోమిథాక్సామ్ 0.3 గ్రా. లేదా డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా లామ్డా సైహలోత్రిన్ 2 మి.లీ మరియు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైనోకాప్ 1 మి.లీ. లేదా హెక్సాకొనాజోల్ 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఫిబ్రవరి: తామర పురుగు, తేనెమంచు పురుగు అధికంగా ఉంటే ఫిప్రోనిల్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో అకాల వర్షాల వల్ల వచ్చే తెగుళ్లను కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 3 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసి అరికట్టవచ్చు.

ఎం.డి సాదిక్ పాషా, డా.జె. చీనా, డా. ఎస్.మల్లేష్, కె. నాగరాజు
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం,
 డా. ఎ. నిర్మల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.

Leave Your Comments

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

Previous article

లాభదాయకంగా పుట్టగొడుగుల పెంపకం  

Next article

You may also like