Sri Method in Sugar Cultivation: చెరకు సాగులో ఎక్కువ పెట్టబడి విత్తనానికే. దీన్ని తగ్గించటానికి పలు యత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. రైతు కమతాల్లో రూపుదిద్దుకొన్న ‘శ్రీ’ విధానంతో (సుగర్ కేన్ రెన్యూడ్ ఇంటేన్సిఫికేషన్) విత్తనం ఖర్చు సగానికి పైగా తగ్గింది. ఈ శ్రీ పద్ధతిలో ఖర్చు తగ్గుతుంది. నీరు ఆదా అవుతుంది. అంతర పంటలకు అవకాశం ఏర్పడుతుంది. చీడ-పీడల తాకిడి తగ్గుతుంది. పంచదార నాణ్యత పెరుగుతుంది. చెరకు దిగుబడి పెరుగుతుంది. చెరకును యంత్రాలతో నరికించడానికి అనువుగా ఉంటుంది.
శ్రీ పద్ధతిలో చెరకు సాగు చేయటం వల్ల పలు లాభాలున్నాయి. సాధారణ పద్ధతిలో చెరకు నాటాలంటే హెక్టారుకు దాదాపు 10 టన్నుల విత్తనం కావాలి. టన్ను విత్తనం ధర 3,000ల రూపాయలు. హెక్టారుకు సరిపడే విత్తనం ఖరీదు 30,000ల రూపాయలు. కొన్ని ప్రాంతాల్లో సెంట్లు లెక్కన విత్తనం అమ్మటం కూడా ఉంది. ఒక హెక్టారుకు 30 సెంట్ల విత్తనం కావాలి. సెంటు విత్తనం ధర 1,000 రూపాయలు. ఈ విధంగా చూసిన హెక్టారుకు 30,000ల రూపాయలవుతుంది. శ్రీ పద్ధతిలో 1,000 విత్తనం గడలు హెక్టారుకు సరిపోతాయి. వీటి ఖరీదు సుమారుగా 1,5000 రూపాయలు. ఈ విత్తనం గదల ఆకురెలచి, హేండ్ కట్టర్ సహాయంతో చెరకు కన్ను భాగం (మొలచే భాగం) అర్ధచంద్రాకారంగా వేరు చేయాలి. ఇలా వేరు చేసిన కన్నులను విత్తనంగా ఉపయోగించి, మిగిలిన చెరకు ఫ్యాక్టరీకి పంపవచ్చు.
కన్నులు వేరు చేసినా, గడలు గడలుగానే ఉంటాయి. కాబట్టి ఫ్యాక్టరీకి పంపుట సులువు. కన్నులు తీసిన చెరకును ఫ్యాక్టరీకి పంపగలిగితే హెక్టారుకు అవసరమైన విత్తనం ఖరీదు 500 రూపాయలే. ఈ సందర్భంలో రైతుల్లో ఒక అనుమానం తలెత్తుతుంది. విత్తనానికి ఉపయోగించే చెరకు లేతగా 6-7 నెలల వయస్సు కలిగి ఉంటుంది. అలాంటి చెరకులో పంచదార పాళ్ళు తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి లేత చెరకును ఫ్యాక్టరీలు క్రషింగ్‌కు తీసుకోవనే భయం ఉంది. నిజమే! సహజంగా విత్తనానికి ఉపయోగించేది లేత చెరకే. దానిలో పంచదార శాతం తక్కువగా ఉండడం కూడా యదార్థమే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, చెరకు గడలో పంచదార శాతం తక్కువగా ఉండేది మొలక వచ్చే భాగంలోనే.
Also Read: Rotovator and Rotopuddlers Uses: వరిలో రోటోవేటర్ మరియు రోటోపడ్లర్ యొక్క ఉపయోగాలు.!
పంచదార తక్కువగా ఉండే భాగాన్ని అర్ధచంద్రాకారంగా వేరు చేసి, మొక్కలు పెంచటానికి ఉపయోగించుకుంటున్నాము. అంటే చక్కరేతర పదార్థం కొంత వరకు తొలగించబడుతుంది. మిగిలిన భాగంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంచదార దిగుబడి శాతంలో మార్పు కనిపించదు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. శ్రీ చెరకు నారు పెంచటానికి లేత విత్తనమే వాడాలనే నియమం లేదు. ముదురు తోటలలోని చెరకును కూడా కన్నులు కన్నులు తీయడానికి ఉపయోగించవచ్చు. గడ మొదటి భాగంలో కొంత భాగం వ్రేళ్ళు వేసి, గిడసబారిపోయి ఉంటాయి. అలాంటి వాటిని వదిలేసి, లేత భాగంలోనికన్నులు మాత్రమే స్వీకరించాలి. ముదురు గడ చివరి నుంచి మొదలకు 15 కన్నులు తీయవచ్చు. ఈ మొదలు భాగంలో పంచదార హెచ్చుగా ఉంటుంది. అలా పంపలేక వదిలేసినా, సాధారణ పద్ధతిలో 30,000 రూపాయలు విలువైన విత్తనం అవసరమైతే, శ్రీ పద్ధతిలో నాటదానికి వెయ్యి రూపాయల ఖరీదైన విత్తనం సరిపోతుంది.
హెక్టారు పొలంలో నాటటానికి సుమారు 12,000 మొక్కలు అవసరం. 10,000 మొక్కలతో సాగు చేసిన రైతులు కూడా మంచి దిగుబడే సాధించారు. మనం ఎంచుకున్న 1,000 విత్తనం గదల నుంచి సజావుగా మొలకెత్తగల కన్నులు 16 వేలు లభిస్తాయి. వాటిల్లో 80 శాతం మొలకెత్తినా హెక్టారులో నాటుకోటానికి సరిపోతాయి. విత్తనం గడ నుంచి కన్నులు వేరు చేయడం, కన్నులను శుద్ధి చేయడం, శుద్ధి చేసిన కన్నులను ప్లాస్టిక్ ట్రేలలో పెంచడానికి 15 మంది ఆడ కూలీలు అవసరమవుతారు. విత్తనం కన్నులను శుద్ధి చేయడం చాలా సులభం. ప్లాస్టిక్ టబ్‌లలో సగం నీరు పోసి, ఒకో టబ్‌లో 10 గ్రాముల బావిస్టిన్ మరియు 50 గ్రాముల ఫోరేట్ గుళికలు కలిపిన ద్రావణంలో విత్తనం కన్నులు పోసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. లేదా 200 లీటర్ల డ్రమ్ముల్లో 20 గ్రాముల బావిస్టిన్, 40 గ్రాముల ఫోరేట్ గుళికలు కలిపిన ద్రావణంతో విత్తనం శుద్ధి చేయాలి. చేతి సంచుల నిండా విత్తనం కన్నులు పోసి, డ్రమ్ములలోని మందు ద్రావణంతో 20 నిమిషాలుంచి, ఆ తర్వాత ట్రేలలో పేర్చుకోవాలి.
శ్రీ చెరకు మొక్కలను పెంచటానికి ‘‘కాయిర్ పిట్’’ బాగా పనికొస్తుంది. వాటిని నివారించుకొని, కొద్దిగా నత్రజని ద్రావణం జల్లి ‘‘కాయిర్ పిట్’’ను ట్రేలలో వుండే గుంతలను సగం వరకు నింపి దానిపై శుద్ది చేసిన విత్తనం కన్నును మొలక భాగం పైకి ఉండే విధంగా పేర్చి, ఆ పైన ఎరువుతో ట్రేలు పూర్తిగా నింపాలి. అలా నింపిన ట్రేలను ఒకదానిపై ఒకటి దొంతర్లగా పేర్చాలి. 20 ట్రేల వరకు ఎత్తుగా దొంతర్లుగా పేర్చి చుట్టూ పాలిథీన్ షీట్‌తో కప్పాలి. ట్రేల డొంతర్లలోకి గాలి జొరబడకుండా జాగ్రత్త పడాలి. రెండు, మూడు రాత్రులలా వుండే సరికి ట్రేల నుంచి మొలకలు వస్తాయి. విత్తనం స్వభావం, విత్తనం వయస్సు, గాలి జొరబడకుండా తీసుకొన్న చర్యలను బట్టి, మొలక వచ్చే వ్యవధి ఆధారపడి వుంటుంది. ట్రేలు నుంచి కనులు పొడుచుకు రావటం గమనించిన రోజు సాయంత్రం, ముందే తయారు చేసి వుంచుకొన్న బెడ్ల మీద వరుసగా పేర్చాలి.
ట్రేలు పేర్చిన రోజు గాని, మరుసటి రోజు ఉదయం గాని నీళ్ళు జల్లకూడదు. మరుసటి రోజు సాయంత్రం తప్పని సరిగా నీళ్ళు చల్లాలి. రోజ్ క్యాన్లతో కూడా నీరు చల్లవచ్చు. అలా ప్రతి రోజు సాయంత్రం నీరు చల్లాలి. మొక్కలు మారాకు తొడిగే దశలో కొద్దిగా ఎండోసల్ఫాన్ మందును నీటలోకి కలపడం అవసరం. పది లీటర్ల నీటికి 2 మి.లీ. మందు సరిపోతుంది. 10,12 రోజులకు మొలకలు రావటం పూర్తవుతుంది. కొన్ని చోట్ల కన్నులుండి, మొలకలు రాకపోవటం గమనిస్తాము. 15 రోజులు తర్వాత గ్రేడిరగ్ చేయాలి.
చిన్నగా వున్న మొక్కలను వేరే ట్రేలలోకి సర్దాలి. మొక్కలు రాని గళ్ళలో కూడా వేరే ట్రేలలో మొక్కలను తెచ్చి సర్దితే అపుడు పెద్ద మొక్కలన్నీ ఒక చోటకు, చిన్న మొక్కలన్నీ ఒక చోటకు చేరతాయి. 18, 20 రోజులు వయస్సులో మొక్కలపై చల్లే నీటిలో కొద్దిగా యూరియా కలపటం అవసరం. 28 రోజుల వయస్సు దాటిన మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. అప్పటికే మొక్క వేరు గూడు కట్టుకొంటుంది. కాయిర్ పిట్ కూడా రాలిపోకుండా వుండ చుట్టుకుపోతుంది. మొక్క పట్టుకుంటే వేర్లుకు హాని జరగకుండా ఉండలా బయటకు వచ్చేస్తుంది. ట్రేల నుంచి తీయక ముందే పిలకలు వేయటం గమనించవచ్చు. 30 రోజులకు మొక్కలు తయారవుతాయి.
Also Read: Chemical Fertilizers for Rabi Pears: రబీ పైర్లకు వాడే రసాయన ఎరువుల సమర్ధ వినియోగం.!