తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

0
    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు అయిన జింక్, ఇనుము మరియు బోరాన్ లతో కలిసి మరింత కరగని రూపంలోకి మారిపోతుంది. మనం వ్యవసాయంలో వాడే రసాయనిక భాస్వరం మొత్తంలో కేవలం 20% మాత్రమే మొక్కలకు లభ్యమవుతుంది.  మిగిలిన 80% భూమిలో కరగని స్థితిలో మారిపోతుంది.  తెలంగాణ లో భాస్వర నిల్వలు ఎక్కువ నుండి మధ్యస్థంగా ఉన్నాయి. కావున, రైతు సోదరులు భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను (PSB) పంట పొలాల్లో వినియోగించుకుంటే……
• భాస్వర లభ్యత పెరుగుతుంది.
• పంటల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.
• భూమి ఆరోగ్యం మెరుగవుతుంది.
ఈ విధంగా సూక్ష్మజీవుల సహాయంతో వ్యవసాయంలో సుస్థిరతను సాధించుకోవచ్చు.
ఫాస్ఫరస్ కరిగించే బ్యాక్టీరియ?
  సహజంగా మట్టిలో ఉండే కొన్ని మైక్రోబ్స్, ముఖ్యంగా కొన్ని బ్యాక్టీరియా, ఫంగీ, యాక్టినోమైసెట్స్ వంటివి ఫాస్ఫరస్‌ను కరిగించగలిగేవి.
ముఖ్యమైన బ్యాక్టీరియా జాతులు:
• బ్యాసిల్లస్  (Bacillus spp.)
• సూడోమోనాస్ (Pseudomonas spp.)
• రైజోబియం (Rhizobium spp.)
• బర్కోల్డీరియా (Burkholderia spp.)
• అజోటోబ్యాక్టర్ (Azotobacter spp.)
   ఈ సూక్ష్మజీవులు మట్టిలోని ఫాస్ఫేట్‌ను సేంద్రీయ ఆమ్లాలు (జీవ ఆమ్లాలు) స్రవించడం ద్వారా కరిగించడమే కాకుండా, కొన్నిసార్లు ఫాస్ఫటేజెస్ అనే ఎంజైములు విడుదల చేసి కూడా ఫాస్ఫరస్ అందుబాటును పెంచుతాయి.
వివిధ పంటలలో PSB ఉపయోగం :
ధాన్యం పంటలు :
   వరి, గోధుమ, మక్క వంటి ధాన్యాల్లో ఫాస్ఫరస్ అవసరం ఎక్కువ. Bacillus megaterium వంటి బ్యాక్టీరియాలు విత్తన శోధన (seed treatment) రూపంలో లేదా మట్టి పూత (soil application) ద్వారా వాడితే, మొక్కలు వేగంగా ఎదుగుతాయి మరియు ధాన్యం దిగుబడి పెరుగుతుంది. తక్కువ ఫాస్ఫరస్ యూనిట్‌తో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
కూరగాయలు :
  టమాట, మిరప, వంకాయ వంటి కూరగాయ పంటల్లో విత్తనాలు నాటే ముందు PSB కలిపితే మట్టి ఫాస్ఫరస్ లభ్యత పెరిగి, మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ముఖ్యంగా పూత దశలో (flowering stage) ఫాస్ఫరస్ అవసరం ఎక్కువగా ఉంటుంది, PSB దీన్ని సమర్థవంతంగా అందిస్తుంది.
పప్పు ధాన్యాలు
      పెసర, మినుము, కందులు వంటి పప్పు ధాన్యాల్లో నత్రజని స్థిరీకరణ (Nitrogen fixation) జరగడం తో పాటు ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం అవసరం. ఇక్కడ Rhizobium వంటివి ఉపయోగపడతాయి. వీటితో పాటు PSB కలిపి వాడితే రెండు మేలు ఒకేసారి జరుగుతుంది: నత్రజనిని, ఫాస్ఫరసును మొక్కలు త్వరగా పొందుతాయి.
చక్కెర పంటలు
         చక్కెరగడ వంటి పంటల్లో PSB వాడితే, ఆకుల వృద్ధి మరియు గట్టిపడే దశ (cane hardening) మరింత మెరుగ్గా జరుగుతుంది. ఫోటోసింథసిస్ శక్తి పెరగడం వలన చక్కెర శాతం కూడా పెరుగుతుంది.
వినియోగ విధానం
1. విత్తనశుద్ధి (Seed Treatment): విత్తనాలను PSB సంస్కరించిన ద్రావణంలో 30 నిమిషాలు ముంచి, ఆరబెట్టిన తర్వాత నాటాలి.
2. మట్టి పూత (Soil Application): PSB కలిపిన జీవామృతం లేదా వర్మీ కంపోస్ట్‌ను మట్టిలో వేసుకోవచ్చు. ఒక ఎకరాకు సుమారు 2 కిలోల PSB సంస్కరణ సరిపోతుంది.
3. నాటే సమయంలో (Root Dipping): నాటే ముందు మొక్కల రూన్లను (roots) PSB కలిపిన ద్రావణంలో ముంచి నాటితే మంచి ఫలితం ఉంటుంది.
లాభాలు
• సేంద్రీయ పద్ధతిలో పోషకాలను అందించడం.
• రసాయనిక ఫాస్ఫరస్ వాడకాన్ని తగ్గించడం.
• మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
• దిగుబడిని పెంచడం.
• మట్టిలో సూక్ష్మజీవాల చైతన్యాన్ని పెంపొందించడం.
• పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు.
జాగ్రత్తలు
• నాణ్యమైన PSB ఉత్పత్తులను మాత్రమే వాడాలి.
• వాడే ముందు బ్యాక్టీరియా జీవనం సక్రియంగా ఉందో లేదో పరిశీలించాలి.
• ఫంగిసైడ్లు వాడిన వెంటనే PSB వాడకూడదు, కనీసం 7 రోజుల గ్యాప్ ఇవ్వాలి.
పంటల ప్రకారం ఫాస్ఫరస్ బ్యాక్టీరియా వాడే విధానం
1. విత్తనశుద్ధి (Seed Treatment)
విధానం:
• PSB ను చక్కగా నీటిలో కలిపి ఓ మృదువైన ద్రావణం తయారు చేయాలి.
• ప్రతి కిలో విత్తనానికి సుమారు 10 గ్రాములు PSB పోసి, విత్తనాలపై నానబెట్టి నీడలో ఆరనివ్వాలి.
• ఆరిన తర్వాత విత్తనాలను నాటాలి.
ప్రయోజనం : మొలకెత్తే సమయంలోనే రూట్‌జోన్ వద్ద PSB ప్రాభావం ఏర్పడుతుంది, తద్వారా మొక్కలు ప్రారంభ దశ నుంచే మంచి ఫాస్ఫరస్ లభ్యత పొందుతాయి.
పంటల ప్రకారం :
2. మట్టి పూత (Soil Application)
విధానం:
• PSB ని గోబర్ ఎరువు లేదా జీవామృతం వంటి మట్టి కారకములతో బాగా కలిపి, విత్తే ముందు లేదా మొలకెత్తిన 15 రోజుల్లో మట్టిలో కలపాలి.
• నీటి మిశ్రమం ద్వారా కూడా చల్లవచ్చు.
పరిధి (Dosage):
 
3. నాటే ముందు వేర్లు ముంచడం (Root Dipping)
విధానం:
• నాటే మొక్కల వేర్లును PSB ద్రావణంలో ముంచి (సుమారు 15–30 నిమిషాలు) తరువాత నాటాలి.
• ద్రావణం: 1 లీటర్ నీటిలో 10–20 గ్రాములు PSB కలపాలి.
ఎప్పుడు ఉపయోగించాలి?
• నర్సరీ నుండి చెరుకు, వరి, కూరగాయ మొక్కలను తెచ్చినప్పుడు.
• మొక్కల ఆరోగ్యానికి ఎక్కువ ఉపయోగపడుతుంది.
ప్రత్యేక సూచనలు:
• విత్తన శోధన తర్వాత వెంటనే నాటడం మంచిది.
• మట్టి పూత చేసినప్పుడు, వర్షం రాకముందు లేదా తడి మట్టిలో చల్లడం ఉత్తమం.
• ఫంగిసైడ్లు వాడితే, కనీసం 5–7 రోజుల గ్యాప్ తర్వాత మాత్రమే PSB వినియోగించాలి.
• PSB నిల్వ ఉంచేటప్పుడు, చలిని మరియు నేరుగా ఎండలను నివారించాలి.
           ఈరోజుల్లో సాగు వ్యయాలు పెరిగిపోతున్న పరిస్థితిలో, ఫాస్ఫరస్ కరిగించే బ్యాక్టీరియా వాడటం ద్వారా నేడు రైతులు స్థిరమైన దిగుబడులు సాధించడమే కాకుండా భవిష్యత్తులో మట్టిని కూడా సంరక్షించగలుగుతారు. జీవ వ్యవసాయం దిశగా తీసుకునే ఈ చిన్న చిన్న అడుగులు, రైతుల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకురాగలవు.
డా. ఎస్. త్రివేణి, డా. యం. సంతోషి లావణ్య, డి. శ్రీదేవి
వ్యవసాయ సూక్ష్మజీవ శాస్త్రం మరియు బయోఎనర్జీ విభాగం,
వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్ : 70329 24539
Leave Your Comments

తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి(30.04.2025 నుండి 04.05.2025 ) వాతావరణా,వ్యవసాయ సలహాలు

Previous article

విత్తన నాణ్యతా ప్రమాణాలు

Next article

You may also like