ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు -1121, యం.టి.యు -1153, యం.టి.యు -1156, యం.టి.యు -3626, నెల్లూరు మషూరి, యం.టి.యు రైస్ -1293, ఎన్.ఎల్ ఆర్ రైస్ 3238, ఎస్.ఎల్ -10, పి.ఆర్ -126 రకాలు ఎక్కువగా చేయబడుతున్నాయి. రబీ కాలంలో రైతాంగం ఎదుర్కొనే ప్రధాన సమస్య మిల్లింగ్ లో గింజ విరిగిపోయి నూక ఎక్కువగా రావడం. దీని వల్ల కొనుగోలు ధర తగ్గి, బస్తాకు 2 – 3 కిలోలు అదనంగా తీసుకోవడం, తద్వారా నికరాదాయం తగ్గిపోవడం గమనిస్తున్నాము. గత చివరి రెండు రబీ కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగింది.
నూక ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు :
- పూత సమయం తరువాత కూడా పైపాటుగా నత్రజని ఎరువులు వేయడం.
- పంట పక్వానికి వచ్చినా కూడా చేను పైనే ఎండిపోవాలనే ఉద్దేశ్యంతో కోతను ఆలస్యం చేయడం. తద్వారా పంట ఎక్కువగా ఎండిపోయి గింజ పై పగుళ్ళు రావడం.
- పంట పక్వానికి వచ్చినా కూడా చేను పైనే ఎండిపోవాలనే ఉద్దేశ్యంతో కోతను ఆలస్యం చేయడం. తద్వారా పంట ఎక్కువగా ఎండిపోయి గింజ పై పగుళ్ళు రావడం.
- కోత కొరకు చేను ఆరగట్టడానికి క్రమ క్రమంగా కాకుండా ఒకేసారి నీటిని తగ్గించివేయడం
- చౌడు నేలల్లో సాగు చేసిన వరి పంట కూడా నూక శాతం ఎక్కువగా రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
- దోమపోటు ఎక్కువగా ఆశించడం వల్ల గింజ పూర్తిగా తోడు కోక నూక శాతం ఎక్కువ వస్తుంది.
- పంటను బాక్టీరియా ఆకు ఎండు తెగులు, పొడ తెగులు, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు వంటి తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం వల్ల గింజలు పూర్తిగా తోడుకోక నూక శాతం ఎక్కువ వస్తుంది.
- కీలక దశలలో పంట నీటి ఎద్దడికి గురి కావడం వల్ల కింద గింజలు పూర్తిగా తోడుకోక, నూక ఎక్కువగా వస్తుంది
- ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ధాన్యాన్ని కల్లంలో ఎక్కువ రోజులు ఆరబెట్టడం వల్ల గింజలలో తేమ ఒకేసారి తగ్గి, గింజలపై పగుళ్ళు వస్తాయి, తద్వారా నూక శాతం ఎక్కువ వస్తుంది.
- పంట పక్వ దశలో వర్షాలకు గురి కావడం వలన కూడా నూక శాతం పెరుగుతుంది.
మిల్లింగ్ లో నూక శాతం తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు :
- చిరు పొట్ట తరువాత ఎటువంటి నత్రజని ఎరువులు వేయరాదు
- వెన్నులో 80 90% శాతం గింజలు పసుపు రంగుకు మారుతున్నప్పుడు పంటను కోయాలి. పూర్తిగా ఎండిపోయే వరకు చేసుపై ఉంచకూడదు.
- పంట పక్వానికి వచ్చిన తరువాత ఎక్కువకాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గడంతో పాటూ, గింజలపై పగుళ్ళు ఏర్పడతాయి.
- పొలాన్ని కోతకు 7 10 రోజుల ముందు మాత్రమే క్రమేపీ నీటిని తగ్గించాలి. ఒకేసారి నీటిని కట్టేయకూడదు.
- దోమపోటు, పొడ తెగులు, అగ్గితెగులు, బాక్టీరియా ఆకు ఎండు వంటి తెగుళ్ళను సకాలంలో అరికట్టడం వల్ల మిల్లింగ్ లో నూక శాతం తగ్గించవచ్చు.
- మనుషులతో కోత కోసేటప్పుడు, పంట కోసిన తరువాత పనల మీద గింజలు కొంతవరకు ఎండుతాయి.
- అయితే ధాన్యం లో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు. క్రమక్రమంగా తగ్గాలి. దీనికోసం సాధరణమైన ఎండలో ధాన్యాన్ని పరచి మధ్య మధ్యలో తిరగదిప్పాలి. తూర్పార బట్టి శుభ్ర పరిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ 12% వచ్చేవరకు తగ్గించాలి.
- ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెట్టినట్లైతే గింజలలో తేమ ఒక్కసారిగా తగ్గి గింజలపై పగుళ్ళు వస్తాయి.
- తేమ శాతం తగ్గాలనే ఉద్దేశ్యంతో ఆలస్యంగా కోయడం, వేగంగా ఆరతాయనే ఉద్దేశ్యంతో అధిక ఉష్ణోగ్రత వద్ద ఆరబెడితే ధాన్యం మిల్లింగ్ లో నూక ఎక్కువయ్యే అవకాశం ఉన్నది.
- రబీ పంట ఏప్రిల్ 15 లోపల కోతకు వచ్చే విధంగా అంటే జనవరి 15 లోపల నాట్లు వేయడం పూర్తిచేయాలి.
డాక్టర్. కె. ఫణి కుమార్,ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్, ఏరువాక కేంద్రం, ఏలూరు.శ్రీ.ఎన్. నాగేంద్ర బాబు,విస్తరణ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, ఏలూరు.