Cotton Crop: మన తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర మరియు తెలంగాణలో తెల్ల బంగారంగా పిలవబడే పత్తి పంటను విపరీతంగా సాగు చేస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర తరువాత మన తెలుగు రాష్ట్రాలు మూడు మరియు నాలుగు స్థానాలలో ఉన్నాయి. వాణిజ్య పంటలలో ప్రధాన మైన పంట పత్తి (Cotton). ఆంధ్రాలో గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కృష్ణ జిల్లాలు పత్తిని ఎక్కువగా సాగు చేస్తున్నాయి. అలాగే కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా కొంతమేరకు సాగు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు పత్తిని ఎక్కువగా సాగు చేస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొంతమేరకు సాగు చేస్తున్నారు.
20 శతాబ్దం వరకు కూడా ప్రపంచ దేశాలలోని పత్తి పండిరచే రైతులుకు కాయ తొలుచు పురుగు బెడద ఎక్కవగా ఉండేది. అయితే బి.టి అనే బాక్టీరియాను పత్తి మొక్కలలో జన్యుమార్పిడి చేసి కాయ తొలిచే పురుగు నివారణకు కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ బి.టి పత్తిని మన దేశం లోకి బి.జి`1 2002 లోను బి.జి-2 2006 సంవత్సరంలో తీసుకువచ్చి కాయతొలిచే పురుగులు అయిన తలనత్త (దీనినే మచ్చల కాయ తొలిచే పురుగు అని కూడా అంటారు) శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు కాయ తొలిచే పురుగు) నుండి విముక్తి లభించడం జరిగింది. ఈ మేరకు పత్తిని తిని నష్ట పరిచే శాతం ఒక దశాబ్దం కాలం తగ్గినప్పటికీ క్రమేపి వీటి యొక్క బెడద ఎక్కువ అవ్వడం మన అందరికీ తెలిసిన విషయమే. ఈ కాయ తొలిచే పురుగులు వలన రైతులు, వస్త్ర పరిశ్రమలు, విత్తన కంపెనీలకు, దానితో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది.
ఈ కాయ తొలిచే పురుగులకు ఆశ్రయాన్ని ఇచ్చే ఇతర పంట జాతి మొక్కలు చాలా ఉన్నప్పటికీ గులాబీ రంగు పురుగుకు మాత్రం వీటికి భిన్నంగా ఎటువంటి మొక్కలు ఆశ్రయాన్ని ఇవ్వకపోవడం గమనార్హం. చాలా కొద్దిపాటిగా అదే కుటుంబానికి చెందిన బెండ, తుత్తుర బెండ జాతి మొక్కలు ఆశ్రయాన్ని అది కూడా పత్తి పంట లభ్యం కానీ కాలాల్లో మాత్రం కారణమవుతున్నాయి. అందువలన పత్తిలో గులాబీ తీవ్ర స్థాయికి చేరి రైతన్నకు శాపంగా మారింది. దీనిని అదుపులో ఉంచడం కోసం శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీ యాజమాన్యాలు ఒకటిగా దృష్టి సారించి కొన్ని మెరుగైన మరియు ఆచరణాత్మక మార్గాలను రైతులకు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా గులాబీ రంగు పురుగు తీవ్రత తార స్థాయికి చేరడానికి గల కారణాలను గుర్తించడం జరిగింది. ఈ గులాబీ రంగు పురుగు వల్ల రైతు ఒక ఎకరానికి 7 నుండి 10 క్విటాళ్ళ పత్తిని నష్టపోవడం మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కొన్ని ప్రాంతాలలో రైతులు గులాబీ తీవ్రత గుర్తించి పత్తి పంటను పొలం మధ్యలోనే దున్నివేయడం దీని తీవ్రత కు నిదర్శనంగా భావించవచ్చును.
పత్తి పండిరచే రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ప్రధానమైనవి. అందుకోసమని మన శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు పాటిస్తూ గులాబీని తరిమివేయాలి. అయితే ఈ గులాబీని పంట కాలం ముగిసాక కొన్ని జాగ్రత్తలు పాటించి దాని సంతతి అదుపులో ఉంచి తీవ్రతను తగ్గిస్తూ తదుపరి ఏడాది అధిక లాభాలు ఆర్జియించవచ్చును. ఇందులో భాగంగా పంట కాలం (ప్రత్తి తీతలు) ముగిసాక ఫిబ్రవరి నుండి జులై మధ్య మాసాలలో చేయవలసిన పనులు…..
Also Read: వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవాలి?
చేయాల్సిన పనులు :
1. గులాబీ రంగు పురుగు తీవ్రతకు కారణం, బి.టి ప్రత్తి మన దేశంలో 95 శాతం పండిస్తున్నారు అందువలన గులాబీ రంగు పురుగు గత దశాబ్దం కాలం పాటు బి.టి ప్రత్తిని తిని నిరోధకతను పెంచుకోవడం జరిగింది. అందుకోసమని మనం గులాబీ తీవ్రతను తగ్గించడం కోసం నాన్ బి.టి పత్తి రకాలు కూడా బి.టి పత్తితో పానిటు విత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల గులాబీ పురుగు నిరోధకత తగ్గి వాటి సంతతి కూడా అదుపులో ఉంటుంది.
2. తక్కువ కాల పరిమితి కలిగిన పత్తిని విత్తుకోవాలి
3. గులాబీ రంగు పురుగు మిగతా కాయ తొలిచే పురుగులుకు భిన్నంగా 45 రోజులు ఉన్నప్పుడు పత్తి పంట మీదకి వచ్చి, నెమ్మదిగా డిసెంబరు, జనవరి నెలలు గడిచేసరికి తన ఉధృతి అధికం చేసుకుంటుంది. అందుకని ఈ మాసాలు చివరకి వచ్చేసరికి పత్తి తీయడం ముగించుకోవాలి. ఇలా చేయని యెడల అపారమైన నష్టం కలుగజేస్తుంది.
4. లింగాకర్షక బుట్టలను పత్తి తీసిన తరువాత పంట గట్ల మీద సరిహద్దు వెంబడి ఎకరానికి 4 -5 పాతి పెట్టి ఉంచాలి ఇలా చేయడం వల్ల తరువాత ఆకర్షించబడిన మగ రెక్కల పురుగులను నాశనం చేయాలి.
5. పత్తి తీసిన తరువాత మొక్కల మోళ్లను ట్రాక్టర్ సహాయంతో నేలలో కలిసిపోయేలా కలియదున్నాలి.
6. పత్తి పంట చేతికి వచ్చిన తరువాత ఆ పంట చేళ్ళలో గొర్రెలు, మేకలు, పశువులను వదలటం వల్ల మిగిలిపోయిన ఆకులు, గుడ్ది పువ్వులు, చిన్న,చిన్న పత్తి కాయలను అలాగే వాటిలో ఉన్న గులాబీ పురుగులు తినివేసి రైతుకు పరోక్షంగా లాభాన్ని చేకూరుస్తాయి.
7. గులాబీ రంగు కాయ తొలిచే పురుగులకు ఆవాసాలు అయినటువంటి కాటన్ (జిన్నింగ్) మిల్లులు, మార్కెట్ యార్డు, కాటన్ ఆయిల్ మిల్లులు దగ్గర లింగాకర్షక బుట్టలు పెట్టి మగ పురుగు సంతతిని నివారించుకోవాలి.
8. అలాగే జిన్నింగ్ మిల్లులు దగ్గర లభ్యమవుతున్న జిన్నింగ్ చెత్తను కాల్చివేయాలి. ఇలా చేయటం వల్లన డిరబకాలు, కోశస్థ దిశలో ఉన్న పురుగులు, చంపబడతాయి
9. గులాబీ రంగు కాయతొలిచే పురుగుకి ఆశ్రయాన్ని ఇచ్చే పత్తి కాకుండా ఇతరత్రా బెండి మరియు తుత్తురబెండ, వంటి మొక్కలును పంట విరామ సమయంలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .
10. పత్తి ఏరివేయటం అయ్యాక, పత్తి చేను మోళ్లను తీసివేసి పొలం అంత కూడా దున్నించాలి. ఈ రకమైన చర్యలో కోశస్థ దశలో ఉన్న పురుగులు నాశనం అవుతాయి
11. పత్తి తీత అనంతరం పంట మార్పిడిగా జొన్న, అపరాలును ప్రోత్సహించడం వలన గులాబీని పారద్రోలవచ్చు.
చేయకూడని పనులు :
1. బెండి పంటను పత్తి పంటకు ఆనుకుని సాగుచేయరాదు. ఇలా చేసిన యెడల గులాబీ రంగు పురుగు పంట లేని సమయంలో ఆశ్రయాన్ని ఏర్పరచుకుంటాయి
2. పత్తి పంటను కార్సి పంటగా సాగుచేయరాదు. ఇలా చేసిన యెడల గులాబీ రంగు పురుగు తన సంతతిని పెంచుకుని తీవ్ర నష్టాన్ని చూపిస్తుంది.
3. గుంటూరు జిల్లా అమరావతి ప్రాంత రైతులు నుండి సేకరించిన మోళ్లను కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు విద్యుత్ ఫ్యాక్టరీల దగ్గర ఇంధనంగా (మంట) కోసం మరియు వంటచెరుకు కోసం ఇంటి దగ్గర పోగు చేయటం చేస్తున్నారు.
4. అలా పోగు చేసిన ఆమోళ్లలో గులాబీ రంగు పురుగు డిరభకం దిశలో నిద్రావస్థను కలిగి ఉండి తరువాత సీజన్‌కు రెడీగా ఉంటుంది
5. కొంత మంది రైతులు పత్తి తీసిన తరువాత కూడా అదనపు దిగుబడి కోసం మల్లి నీరు, ఎరువులు ప్రత్తి చేను కి అందించి, గులాబీ పురుగు సంతతి ని ఇంకొక మూడు తరాలు ఎక్కవ చేసుకునేటట్లు వేసవి మాసాలలో అవకాశం కల్పిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన చర్యగా పరిగణంచాల్సిన బాధ్యత రైతులు మీద ఉంది.
6. మాల్వసీఎ కుటుంబానికి చెందిన గోగు, జనుము నార పంటలను ప్రత్తి పంటకు సమీపంగా అలాగే ప్రత్తి పండిరచే సీజన్ లో పండిరచరాదు, ఇలా చేసిన యెడల గులాబీ రంగు పురుగు ఆ మొక్కలు మీద ఆశ్రయాన్ని కలిపించుకొని వాటి సంతతిని మెరుగుపరుచుకుంటాయి.
Also Read: పశు గ్రాస పంచాంగము
డా. అన్నెపు అప్పల రాజు, ఆచార్య ఎన్. జి. రంగా. వ్యవసాయ విశ్వ విద్యాలయం.
డా. ఎస్. వినోద్, కుకునూర్, సైంటిఫిక్ ఆఫీసర్, ఇక్రిశాట్
డా. జి. ఎమ్. వి ప్రసాద రావు (కీటక శాస్త్రవేత్త) లాం, గుంటూరు,