వ్యవసాయ పంటలు

Cotton-Climatic Conditions: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ప్రత్తి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు.!

2
Cotton Plant
Cotton Plant

Cotton-Climatic Conditions: ఈ సంవత్సరం ప్రత్తి పంటను ఇప్పటి వరకు అంటే జూలై మొదటి వారం వరకు సుమారుగా 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగినది. ప్రస్తుతం ప్రత్తి పంట చాలా చోట్ల 15 నుండి 20 రోజుల దశలో ఉన్నది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ భిన్నంగా అధిక వర్షాలతో పాటుగా అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉండటం వలన ప్రత్తి పంట తొలిదశలోనే చాలా చోట్ల తామర పురుగులు, పేను బంక మరియు వేరుకుళ్ళు తాకిడి వలన రైతులు ఇబ్బందులను ఎదుర్కొవడం గమనించడం జరిగింది. ప్రస్తుత తరుణంలో పంట తొలిదశలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు వాటి నియంత్రణ పద్ధతులను గూర్చి ఈ క్రింద వివరించడం జరిగినది.
పురుగులు, తెగుళ్లు – లక్షణాలు, సమగ్ర యాజమాన్యం :
ప్రత్తి పంటలో ఆశించే పురుగులు రెండు రకాలు.
1. రసం పీల్చే పురుగులు
2. కాయ తలుచు పురుగులు
రసం పీల్చే పురుగులు : పచ్చ దోమ, పేను బంక, తామర పురుగు, తెల్లదోమ, ఎర్ర నల్ల, పిండి నల్లి.
పచ్చ దోమ –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి.
2. ఆకులు మొదట దోనెలుగా ముడుచుకొని, లేత పురుగు రంగులోకి మారి ఆ తరువాత ఆకుల అంచుల నుండి ఎర్రబడి కమెపి ఎండి రాలిపోతాయి.
3. ఈ పచ్చదోమ ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి తగ్గుతుంది.
4. పైరు లేత దశ నుండి పంట కాలం చివరి వరకు ఈ పురుగు ఆశిస్తుంది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఎక్కువ వర్షపాతం మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఎక్కువగా వృద్ధి చెందుతుంది.
అనుకూల వాతావరణ పరిస్థితులు :
ఎక్కువ వర్షపాతం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఎక్కువగా వృద్ధి చెందుతుంది.

Cotton Plants

Cotton Plants

పురుగు మందులు :
1.తొలి దశలో విచ్చల విడిగా రసాయన మందులను పిచికారి చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి. 30, 45 రోజులలో మోనోక్రోటో ఫాస్‌, నీరు 1:4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్‌, నీరు లేదా ఫోనికామిడ్‌, నీరు 1:20 నిష్పత్తిలో పూయాలి.
2. మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఫిప్రొనిల్‌ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా, లేదా ఎసిఫేట్‌ 15 యస్‌ పి 1.5 గ్రా., లేదా ఫోనికామిడ్‌ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.25 మి. లీ. లేదా డైఫెన్‌ థయురాన్‌ 1.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జీవరసాయనాలు :
లీటరు నీటికి 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె (15 పిపియం) 5 మి.లీ. కలిపి వాడాలి.
పేను బంక –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. ఈ పురుగులు మొక్క లేత కొమ్మల నుండి మరియు ఆకుల అడుగు భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి.
2. ఆకులు దోనెలుగా మారి, మొక్క పెరుగుదల కుంటుపడుతుంది.
3. ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్కల ఆకులపై, కాండం పైన నల్లని బూజు ఏర్పడుతుంది.
4. పేను బంక విసర్జించిన తేనె వంటి జిగురు పదార్థాన్ని తీనడానికి,ఆకర్షింపబడిన చీమలు మొక్కలపై కనిపించినట్లయితే పేనుబంక ఆశించినట్లుగా భావించవచ్చు.
పురుగు మందులు :
5. నివారణకు పంట తొలి దశలో కాండానికి ముందు పూతకు, 45 రోజులలో మోనోక్రోటోఫాస్‌, నీరు 1:4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్‌, నీరు లేదా ఫోని కామిడ్‌ నీరు 1:20 నిష్పత్తిలో పూయాలి.
6. ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా., లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.25 మి.లీ. లేదా ధయోమిథాక్సామ్‌ 0.2 గ్రా., లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జీవ రసాయనాలు :
లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయు లేదా వేపనూనెను 5 మి.లీ. కలిపి వాడాలి.

Cotton -Climatic Conditions

Cotton -Climatic Conditions

తామర పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. వీటి పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులు ముడుచుకొని పెళుసుగా మారతాయి.
2. ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి వెండి వలె మెరిసే చారలు కనబడతాయి.
3. ప్రత్తిలో తలమాడు తెగులు (టొబాకో స్ట్రీక్‌ వైరస్‌) తామర పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది.
పురుగు మందులు :
లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 75 యస్‌ పి 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.25 మి.లీ. లేదా డైఫెన్‌ థయూరాన్‌ 1.25 గ్రా. లేదా థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా. ను గాని కలిపి పిచికారి చేయాలి.
జీవ రసాయనాలు :
లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేపనూనెను 5 మీ.లీ, కలపి వాడాలి.
తెల్ల దోమ –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. పైరు పిందె, కాయ దశలలో ఎక్కువగా ఆశిస్తుంది.
2. పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి.
3. ఆకుల మీద పచ్చదనం కోల్పోయి ముఛ్ఛ లేర్పడి, ఆకులు పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి. పురుగు సోకిన మొక్కలు గిడసబారి , పూ మొగ్గలు, పూలు, కాయలు రాలి, కాయలు తయారు కాకుండానే విచ్చుకొని దూది నాణ్యత తగ్గుతుంది.
4. పురుగు సోకిన మొక్కలు గిడసబారి, పూమొగ్గలు, పూలు, కాయలు రాలి కాయలు తయారుకాకుండానే విచ్చుకొని దూది నాణ్యత తగ్గుతుంది.
పురుగు మందులు :
1. కాండానికి మందు పూత 30, 45 రోజులలో మోనోక్రోటోఫాస్‌, నీరు 1: 4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్‌, నీరు లేదా ఫ్లోనికామిడ్‌, నీరు 31:20 నిష్పత్తిలో పూయాలి.
2. లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 75 యన్‌ పి 1.5 గ్రా.లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.25 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ట్రైజోఫాస్‌ 2 మి.లీ. లేదా డైఫెన్‌థయూరాన్‌ 1.25 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్‌ 1 మి.లీ. లేదా థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా. పిచికారి చేయాలి. వీలైనంత వరకు పై పురుగు మందులతో పాటు వేప సంబంధిత మందులను కలిపి పిచికారి చేయాలి.

Cotton iInsecticide

Cotton Insecticide

ఎర్ర నల్లి –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
ఎర్రనల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి సాలీడు గుడులా అల్లిక చేసి ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల పై పసుపు పచ్చని చుక్కలు ఏర్పడుతాయి. ఆకు మధ్య భాగం నుండి ఎరుపుగా మారి ఎండి పోతుంది.
పురుగు మందులు :
ముఖ్యంగా పంట తొలిదశలో సింథటిక్‌ పైరిథ్రాయిడ్‌ మరియు నికోటినాయిడ్‌ మందులను విచ్చల విడిగా పిచికారి చేయకూడదు. నీటిలో కరిగే గంధకము 3 గ్రా., లేదా స్పైరోమెసిఫెన్‌ 1. మి.లీ. లేదా డైకోఫాల్‌ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుని మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
పిండి నల్లి –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. ఈ పురుగులు ఆకు తొడిముల నుండి ఆకుల నుండి పూత, కాయల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులపై పసుపు రంగు మచ్చలు, ఏర్పడతాయి మరియు పూత, పిందె రాలుతాయి.
2. ఈ ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి.
పురుగు మందులు :
నివారణకు ప్రోఫెనోఫాన్‌ 50 ఇ.సి. లేదా మిథైల్‌ పారాథియాన్‌ 2. సి. 3.మి.లీ, లేదా ఎసిఫేట్‌ 2 గ్రా., G ట్రైటాన్‌ లేదా సాండోవిట్‌ లాంటి జిగురు మందులను 1.మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లుగా పిచికారి చేయాలి.
కాయ తొలుచు పురుగులు :
పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, తలనత్త పురుగు మరియు గులాబి రంగు పురుగు.
పొగాకు లద్దె పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. గుడ్ల నుండి వచ్చిన చిన్న లార్వాలు ఆకుల అడుగున గుంపులు గుంపులుగా చేరి ఆకులోని పత్రహరితాన్ని గీకి తింటాయి.
2. లార్వా దశలు పెరిగే కొద్దీ విడివిడిగా ఆకులను కొరికి తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. వీటినే జల్లెడ ఆకులు అంటారు.
3. ఈ లార్వాలు మొగ్గలు, పువ్వులు మరియు కాయలను ఆశించి నష్టపరుస్తాయి.
4. పగటి పూట ఇవి మొక్కల మొదళ్ళలో భూమి లోపల ఉండి రాత్రిపూట నష్టం కలుగజేస్తాయి.
పురుగు మందులు :
1. మూడవ దశ దాటిన లద్దె పురుగును అదుపు చేయటానికి విషపు ఎరను వాడాలి. ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లంతో పాటు 1 లీటరు మోనోక్రోటోఫాస్‌ లేదా 750 మి.లీ. క్లోరిఫైరిఫాన్‌ లేదా 300 గ్రా. థయోడికార్బ్‌ మందుకు సరిపడే నీటిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయంలో పొలమంతా చల్లాలి.
జీవరసాయనాలు :
5 శాతం వేప గింజల కషాయాన్ని పిచికారి చేయాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరాకు ఎర పంటగా 20 ఆముదం మొక్కలను వేయాలి.
శనగ పచ్చ పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. గ్రుడ్ల నుండి పొదిగిన లార్వాలు ఆకులు, గూడ, పూత మరియు కాయలకు చిన్న రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి.
2. లార్వా ముందుగా తలను పూత, కాయలలోనికి చొప్పించి మిగతా శరీర భాగాన్ని బయట ఉంచి తింటుంది.
3. కాయకు చేసే రంద్రం గుండ్రంగా పెద్దగా ఉంటుంది.
4. పురుగు ఆశించిన మొగ్గలు, పూత రాలిపోతాయి. ఈ పురుగు ఆశించిన పూలు విచ్చుకొని కనిపిస్తాయి.

Also Read:Gram Pod Borer in Bt Cotton: బి.టి ప్రత్తి శెనగపచ్చ పురుగుపై ఎలా పని చేస్తుంది.!

పురుగు మందులు :
1. పచ్చ పురుగు (గుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
2. పచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఇండాక్సాకార్బ్‌ 4 మి.లీ. లేదా స్పైనోశాడ్‌ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 05 గ్రా. లేదా ప్లూబెండామైడ్‌ 0.3 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.

Also Read:High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు

తల నత్త పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. ఈ పురుగు లార్వాలు లేత కొమ్మలను, పూమొగ్గలను మరియు కాయలను తొలిచి నష్టం కలుగ చేస్తాయి.
2. చిన్న లార్వా మొక్కల చివర్లను తొలచి తినడం వలన కొమ్ముల చివర్లు వడలి ఎండిపోతాయి. దీనిని తలనత్త  అంటారు.
3. పురుగు ఆశించిన లేత కొమ్మలు వాలిపోయి ఎండిపోవడం, పూ మొగ్గలు మరియు కాయలు రాలిపోవడం జరుగుతుంది.
4. పురుగు ఆశించిన భాగాలలో విసర్జన పదార్థం కనబడుట ముఖ్య లక్షణం.
పురుగు మందులు :
లీటరు నీటికి క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్‌ 2 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 4.5 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
గులాబీ రంగు పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన కంటికి కనిపించని చిన్న లార్వాలు పూమొగ్గలోనికి తొలుచుకొని పోయి లోపలి పదార్ధములను తిని వీటిని  గుడ్డి పూలుగా మారుస్తాయి.
2. చిన్న లార్వాలు కాయలపై కనిపించనంత చిన్న రంధ్రాలు చేసి, లోనికి ప్రవేశిస్తాయి. తర్వాత కాయలకు చేసిన రంధ్రం పూడిపోయి, పురుగు  కాయలోనే ఉండి గింజలను తింటూ దూదిని బాగా నష్ట పరుస్తుంది. దూది రంగు, నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి.
3. పురుగు లార్వా దశ మొత్తం కోయలోనే గడపటం వలన, కాయ పగిలిన తర్వాత మాత్రమే నష్టాన్ని గుర్తించగలం.
4. పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందకి త్వరగా పక్వానికి వస్తాయి.
యాజమాన్య పద్ధతులు :
1. ఎకరాకు 8 లింగా కర్షక బుట్టలు పెట్టుకుంటే పురుగు ఉధృతిని నియంత్రించవచ్చును.
2. లింగాకర్షక బుట్టల ఆధారంగా పురుగు ఉధృతిని అంచనా వేసుకొని నష్ట పరిమితికి చేరే సమయంలో ఎకరాకు 4 కార్డుల ట్రైకోగ్రామా టాయిడియా బాక్ట్రే గుడ్డు పరాన్న జీవిని చేనులో వేసుకోవాలి.
3. క్వినాల్‌ ఫాస్‌ 2.0 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా., లేదా ప్రొఫెనోఫాన్‌ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
4. పంట కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సింధటిక్‌ పైరిత్రాయిడ్‌ మందులైన సైపర్‌మైథిన్‌ 25 శాతం ఇ.సి. 1.0 మి.లీ. లేదా లామ్డా సైహలోత్రిన్‌ 5.0, ఇ.సి. 1.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలపి పిచికారి చేయాలి.
5. సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ మందులు ప్రత్తి పంటపై ఎక్కువ సార్లు పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి పేరిగే అవకాశముంది.
కాండం తొలుచు పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. ఈ పురుగు లార్వాలు, పత్రి యొక్క కాండాన్ని భూమి నుండి అడుగున్నర దూరంలో తొలిచి కాండము మధ్య భాగాన్ని మొత్తం తినేస్తాయి.
2. పురుగు ఆశించిన ప్రతి మొక్కల దగ్గర రంపపు పొట్టులాగా పడుండటం గమనించవచ్చు.
3. పురుగు ఆశించినప్పుడు కాండం బలహీనమై, కొమ్మలు విరుగుతాయి. క్రమేపి మొక్క మొత్తం చనిపోతుంది.

Stem Borer in Cotton plant

Stem Borer in Cotton plant

పురుగు మందులు :
ఆక్సీడెమటాన్‌ మిథైల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే పురుగు ఉధృతి కొంత వరకు తగ్గుతుంది.
కాండపు ముక్కు పురుగు –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. ఇవి ప్రత్తి యొక్క మొదలు భాగంలో చిన్న రంధ్రాన్ని చేసి కాండములోనికి తొలుచుకొని పోయి నష్టాన్ని కలిగిస్తాయి.
2. ఆశించిన కొమ్మలు బలహీనపడి, బలమైన గాలులు వీచినప్పుడు లేదా అంతరకృషి చేసినప్పుడు విరిగి పడిపోతాయి.
3. ఆశించిన మొక్క భాగం కొంత ఉబ్బి ఉంటుంది. పురుగు ఆశించిన కొమ్మలు కాలక్రమేణా వడలి చనిపోతాయి.
పురుగు మందులు :
లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6. మీ.లీ. లేదా క్లోరిపైరిఫాన్‌ 2.5 మి.లీ. కలిపి మొక్క మొదళ్ళు దగ్గరి పిచికారి చేయాలి.
జీవ రసాయనాలు :
ఎకరాకు 100 కిలోల వేప పిండి వేయాలి.
ప్రత్తి పంట`తెగుళ్ళు :
బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు, ఫ్యుజేరియం వడలు తెగులు, వర్టిసిలీయం వడలు తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, హెల్మింథో సోరియమ్‌ ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు లేదా గ్రే మిల్యూ, కాయకుళ్ళు తెగులు.
బాక్టీరియా నల్ల మచ్చ తెగులు లేదా బ్లాక్‌ ఆర్మ్‌ –
ముఖ్య గుర్తింపు లక్షణాలు :
1. నల్ల మచ్చ తెగులు మొక్క వివిధ దశలలో వివిధ రూపాలలో కన్పిస్తుంది.
2. ముందుగా ఆకులపై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారి మూడవ దశలో ఆకుల ఈ నెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది.
3. తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు కొమ్మలకు కూడా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోతాయి. దీనినే ‘‘బ్లాక్‌ ఆర్‌’’ అని పిలుస్తారు.
4. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పండి రాలుతాయి.
5. తెగులు పువ్వులకు కాయలకు సోకినప్పుడు పరిపక్వం చెందకుండానే రాలిపోతాయి.
1. కనుక  మీద ముదురు ఆకుపచ్చ నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారి గుంటలు ఏర్పడటం వలన కాయలు కుళ్ళిపోతాయి.
6. ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది.

Bacterial Black Spot

Bacterial Black Spot

అనుకూల వాతావరణ పరిస్థితులు :
వర్షాకాలంలో మబ్బులు పట్టినప్పుడు ఈ తెగులు బాగా వ్యాపిస్తుంది.
తెగుళ్ళ మందులు :
1. కిలో విత్తనానికి 10 గ్రా. సూడోమోనాస్‌ ఫ్లోరసెన్స్‌తో విత్తనశుద్ధి చేయాలి.
2. ఉధృతిని బట్టి 3-4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్ట్రెప్టోసైక్లిన్‌ లేదా పాషామైసిన్‌ లేదా ప్లాంటామైసిన్‌ 1గ్రా. మరియు రాగి ధాతు సంబంధిత మందులు (కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌) 30 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
వేరుకుళ్ళు తెగులు :
3 . అర్థాంతరంగా మొక్క పూర్తిగా ఎండిపోవడం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణం. ఒక్క రోజులోనే మొక్క చనిపోతుంది. తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులు గుంపులుగా చనిపోతాయి.
4. మొక్కలోని అన్ని ఆకులపై నుండి క్రింది వరకు వాడిపోయి వ్రేలాడుతూ ఉంటాయి.
5. తెగులు సోకిన మొక్కలను తేలికగా పీకివేయచ్చును.
6. ఎదిగిన మొక్కలు వాడిపోయి ఆకులు పసుపుబారి రాలిపోతాయి.
7. భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు ఆశిస్తుంది.
అనుకూల వాతావరణ పరిస్థితులు :
భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు పైరు అన్ని దశల్లో కనపడుతుంది.

Also Read:Pink Stem Borer in Cotton: ప్రత్తిలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగును ఎలా కనిపెట్టాలి?

Must Watch: 

Also Watch:

Leave Your Comments

Aquatic Weed Damage: నీటికలుపు మొక్కల వలన కలిగే నష్టాలు.!

Previous article

Mushroom Cultivation: పుట్ట గొడుగులు ప్రాముఖ్యత.!

Next article

You may also like