Ladies finger and Cabbage – బెండలో సస్యరక్షణ: బెండలో ఎక్కువగా తెల్లదోమ, పచ్చదోమ ఆశించి నష్టం కలుగజేస్తాయి. వీటి నివారణకు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* కాయతొలుచు పురుగు నివారణకు 4-5 చొప్పున ఒక ఎకరానికి లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
* వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా థయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* పురుగు ఆశించిన కాయలను ఏరి కాల్చి వేయాలి.
* బెండలో పల్లాకు తెగులు, తెల్లదోమ వలన వ్యాప్తి చెందుతుంది.
* ఇది కలుపు మొక్కలను అతిధేయంగా కల్గి ఉండును.
* ఈ తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకొని బెండ సాగు చేసుకోవాలి.
* ముఖ్యంగా తెల్లదోమ అదుపులో ఉంటే ఈ తెగులు సోకదు.
* ఎండాకాలంలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది.
Also Read: Ragi Laddu Health Benefits: హిమోగ్లోబిన్ పెంపొందిస్తున్న రాగి లడ్డు.!
క్యాబేజి మరియు కాలిఫ్లవర్ లో సస్యరక్షణ:
* క్యాబేజి/కాలిఫ్లవర్, నారును నాటేటప్పుడు ప్రతి 25 వరుసలకు 2 వరుసల ఆవాలు ఎరపంటగా వేయాలి లేదా క్యాబేజీ చుట్టు ఎరపంటగా చైనీస్ క్యాబేజీ వేసుకుంటే క్యాబేజిని ఆశించే పురుగులు చైనీస్ క్యాబేజీని ఆశిస్తాయి.
* రసం పీల్చే పురుగుల నివారణకు వేపనూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* అంతర పంటగా క్యారెట్ మరియు టమాట వేయడం వలన డైమండ్ రెక్కల పురుగు తక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.
* ఈ పురుగు నివారణకు నౌవాల్యురాన్ 1 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* ఎకరానికి 4-5 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
* క్యాబేజిలో కుళ్ళు రోగం ఆశించినప్పుడు మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
Also Read: Turmeric Crop: పసుపులో ఎరువుల యాజమాన్యం.!