Paddy Nursery Management: కేరళను జూన్ 1వ తేదీన తాకవలసిన ఋతుపవనాలు ఈ సారి 8వ తేదీన తాకాయి. అయితే ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుఫానుల వలన మన రాష్ట్రంలోకి ఋతుపవనాలు కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా ఇప్పుడిప్పుడే ప్రవేశించాయి. వచ్చే 2-3 రోజుల్లో ఋతుపవనాలు మిగిలిన తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నది.
ప్రస్తుతం వరి పంటలో చూసుకున్నట్లైతే కొందరు రైతులు ఇప్పటికే ఉన్న లభ్య నీటి వనరుల ఆధారంగా నారు పోసుకున్నారు. మరి కొందరు వర్షాల కోసం ఎదురు చూస్తూ నారు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో వరి నార్లు పోయడానికి రైతు సోదరులు దీర్ఘ కాలిక రకాలను కాకుండా మధ్యకాలిక రకాలను, స్వల్ప కాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి.
సాధారణంగా మధ్య కాలిక రకాలను (130-135 రోజులు) జూలై 10వ తారీఖు వరకు, స్వల్ప కాలిక రకాలను (120-125 రోజులు) జూలై చివరి వరకు వరి నార్లు పోసుకోవచ్చును. అతి స్వల్ప కాలిక రకాలను ఆగస్టు మొదటి వారం లోపు నారు పోసుకోవచ్చు.
మధ్య కాలిక రకాలు :
రాజేంద్ర నగర్ వరి-1 రాజేంద్ర నగర్ వరి-2 , జగిత్యాల మశూరి , ప్రాణహిత , శోభిని, వరంగల్ రైస్-1, వంటి మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకోవచ్చు.
స్వల్ప కాలిక రకాలు :
జగిత్యాల రైస్ -1, కునారం సన్నాలు, బతుకమ్మ, కునారం రైస్ -1, కునారం వరి -2, వంటి స్వల్ప కాలిక రకాలను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు ఆలస్యమైన పరిస్థితులలో ప్రధ్యుమ్న, వరాలు వంటి అతి స్వల్ప కాలిక రకాలను కూడా ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు.
Also Read: Pulses Cultivation Management: అపరాలలో సస్యరక్షణ.!
నారుమడి పెంపకంలో తీసుకోవాల్సిన చర్యలు :
. నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ముచేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారు చేయాలి.
. రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని (1 కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12 -14 రోజులకు), 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పోటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి.
. పశువుల పేడను లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది. మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో (వారం రోజులు) ఆరు తడులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా (2-3 సెం.మీ) నీరు ఉంచాలి.
. జింకు లోప సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి.
. మెట్టనారుమడిలో ఇనుప ధాతు లోపాన్ని గమనిస్తే సరిచేయాలి. మొక్క వయసు మరియు ఎదుగుదల బట్టి 2 గ్రా. నుండి 5 గ్రా. అన్న బేధీ G 0.5 నుండి 1 గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
. నారుపీకే 7 రోజుల ముందు గుంట నరుమడికి (2.5 సెంట్లకు 400 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు ఇసుకతో కలిపి చల్లి పలుచగా నిరుంచాలి. అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రధాన పొలం తయారీ, మొక్కల సాంద్రత :
నాట్లు వేయటానికి 15 రోజుల ముందు నుంచే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురుగ దమ్ము చేయాలి. నాలుగు నుండి ఐదు ఆకులున్న నారును నాటుకోవాలి కొద్దిగా చౌడున్న పొలాల్లో లేత నారు వేయవద్దు. మట్ట ముదరాలి. భూసారాన్ని, రకాన్ని, కాలాన్ని బట్టి చ.మీ.కు కుదుళ్ళ సంఖ్య మారుతుంది.
నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 30 సెం.మీ. బాటలు తీయడం వలన పైరుకి గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంత వరకు అదుపు చేయవచ్చు. బాగా నారు ముదిరి, ఆలస్యంగా నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి, కుదురుకు 6-8 మొక్కల చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫార్సుకంటే 25% పెంచి ముడు దఫాలుగా గాక రెండు దఫాలుగా అంటే 70% నాటే సమయంలో మిగతా 30% అంకురం దశలో వాడాలి.
Also Read: Monsoon Diseases Precautions: వర్షాకాలం సీజన్‌లో వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?