kharif Crops Management Practices: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అధిక వర్షాలకు వివిధ దశల్లో ఉన్న ఖరీఫ్ పంటలు అక్కడక్కడా పాక్షికంగా ముంపుకు గురయ్యాయి. దీని వలన బరువైన నల్లరేగడి నేలల్లో సాగు చేసే ప్రత్తి, కంది, జొన్న, చెఱకు మరియు తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేసే వేరుశనగ పంటల్లో నీరు నిలవడం జరిగిoది.
అధిక తేమ శాతం వలన పూత, కాత రాలటం, పంట పెరుగుదల కుంటు పడడంతో పాటు దిగుబడులు తగ్గి, పంట నాణ్యత కూడ లోపిస్తుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వివిధ పంటల్లో రైతాంగం ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులను ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్.యల్. ప్రశాంతి గారు క్రింది విధంగా వివరించారు.
Also Read: Prevent Sucking Pest of Cotton: ప్రత్తి లో రసం పీల్చు పురుగుల నివారణ .!
ప్రత్తి
పత్తిలో వర్షపు నీరు నిలబడితే ఆకులు ఎర్రగా మారి పూత మరియు గూడ రాలిపోతాయి కనుక పొలంలో నిలబడి ఉన్న నీటిని తీసి వేయాలి.
ఎకరాకు 25-30 కిలోల యూరియా + 10-15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనపు స్ప్లిట్ డోస్ వేయాలి. వాతావరణము అనుకూలించిన వెంటనే పలుమార్లు అంతర కృషి చేయాలి.
వర్షము తెరపి ఇచ్చాక అవసరాన్ని బట్టి పొటాషియం నైట్రేట్ 2% (20 గ్రా / లీ) నీటికి కలిపి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
పత్తిలో కాయ తెగులు మరియు ఆకు మచ్చ వ్యాధులను నివారించడానికి నివారణ చర్యగా 3గ్రా/లీ కాపెరాక్సీ క్లోరైడ్ (CoC)ని పిచికారీ చేయాలి.
ఆర్ధిక సహాన పరిమితి ఆధారంగా పచ్చదోమ, పేనుబంక మరియు తామర పురుగులను నియంత్రించడానికి ఎసిఫేట్ @1.5 గ్రా/లీ లేదా ఫిప్రోనిల్ @ 2.0 మి. లీ./లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ @ 0.4 మి. లీ./లీ. లేదా ఎసిటామిప్రిడ్ @ 0.2 గ్రా/లీ లేదా డయాఫెంథియురాన్ @ 1.25 గ్రా/లీ లేదా ఫ్లోనికామిడ్ @ 0.3 గ్రా/లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్ల దోమ నివారణకు పసుపు రంగు జిగురు ఏరాలను (10-15/ ఎకరానికి) ఏర్పాటు చేసుకోవడమే గాక అవసరాన్ని బట్టి 5% వేప కషాయాన్ని పిచికారి చేయాలి. ఆర్ధిక సహాన స్తితి దాటితే డయాఫెంథియురాన్ @ 1.25 గ్రా/లీ లేదా ప్రొఫెనో ఫోస్ 2.0 మి. లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కమ్యూనిటీ ప్రాతిపదికన ఎకరానికి 10-15 ఫెరోమోన్ ఎరలతో గులాబిరంగు పురుగు పర్యవేక్షణ మరియు సామూహిక ట్రాపింగ్ మరియు ఆకుపచ్చ కాయల యొక్క యాదృచ్ఛిక విధ్వంసక నమూనా. ప్రారంభ దశలో గులాబిరంగు పురుగు ఉధృతిని క్రమానుగతంగా అణిచివేయడానికి, రోసెట్ పువ్వులను నాశనం చేయడం మరియు పడిపోయిన గూడ, ఎండిన పువ్వులు మరియు పూర్తిగా పరిపక్వం చెందని కాయలను తొలగించండి.
గులాబిరంగు పురుగు ఉధృతిని బట్టి థయోడికార్బ్ @ 1.5 గ్రా లేక ప్రోఫినోఫోస్ @ 2.0. మీ.లీ./ లీటరు నీటికి లేక పంట 100 రోజులు దాటినట్లయితే సైపెరమేత్రిన్ లేక లాంబ్డా సైహలోత్రిన్ @ 1.0 మీ.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి
పంట చాలా చోట్ల ఏపుగా పెరిగి పుష్పించే దశలో ఉంది. కొన్ని జిల్లాల్లో కంకి ప్రారంభ దశలో వుంది. ఈ దశలో కొన్ని చోట్ల పంట నీట ముంపునకు గురైంది.
అధికంగా ఉన్న నీటిని ఎప్పటికప్పుడు మురుగు నీటి కాల్వల ద్వారా బయటకు పంపాలి.
Also Read: Paddy Crop Protection: వరి పంటలో వచ్చే వివిధ రకాల దోమ రోగాలు మరియు వాటి నివారణ చర్యలు
వర్షాలు పూర్తిగా ఆగి, పొలాల్లోని నీరు ఇంకిపోయిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 20 కిలోల ఎంఓపి ఎరువులను బూస్టర్ డోస్‌లో వేయాలి. తెగుళ్లు మరియు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ముఖ్యంగా ప్రొపికోనజోల్ @ 1 మీ.లీ./లీటరు లేదా హెక్సాకోనజోల్ @ 2 మీ/లీటరు. తో పాటు ఏదైనా అనుకూల పురుగుమందుతో కలిపి పిచికారీ చేయాలి. ధాన్యం మొలకెత్తకుండా ఉండేందుకు కోతకు వచ్చిన పైరుపై 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
చిరుధాన్య పంటలు
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ జొన్న, సజ్జ పంటలు కోతకు వచ్చాయి.
కోత కోయని పంటలో గింజ బూజు మరియు రంగు మరడాన్ని నివారించడానికి కంకులపై 1.0 మి.లీ./లీటరు నీటికి ప్రొపికోనజోల్ని పిచికారీ చేయాలి
రాగి పంట గింజ గట్టిపడే దశలో ఉంది. భారీ వర్షాల కారణంగా పంట నేలకొరిగింది. ఈ దశలో అగ్గి తెగులు ఆశించే అవకాశం వుంది కనుక కార్బెండజిమ్ 1.0 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
పప్పు ధాన్యాలు
ఖరీఫ్‌లో విత్తిన కంది పంట ఏపుగా పెరిగే దశలో ఉంది. ఖరీఫ్ మినుము మరియు పెసర పక్వానికి వచ్చే దశలో అధిక మరియు నిరంతర వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ఇటీవలే రబీకి ముందు విత్తిన పప్పుధాన్యాల పంటలైన మినుము, పెసర మరియు ఖరీఫ్‌లో విత్తిన కంది పంట కూడా కొంతమేరకు నీరు నిలిచిపోవడం/అధిక తేమతో ప్రభావితమైంది. కింది తక్షణ నివారణ చర్యలు సిఫార్సు చేయబడ్డాయి.
పాక్షికంగా ప్రభావితమైన పప్పుధాన్య పంటల్లో అధికంగా నిలిచిపోయిన నీటిని బయటకు తీసి, ఆ తర్వాత సమర్థవంతంగా కోలుకోవడానికి యూరియా 2% పిచికారీ చేయాలి. అధిక వర్షాలకు ఇనుప ధాతు లోపం వచ్చే అవకాశం వుంది కాబట్టి అన్నభేది 5.0 గ్రా., నిమ్మ ఉప్పు 0.5 గ్రాము మరియు యూరియా 20 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.
Also Read: Problems in pulse production: పప్పు ధాన్యాల పంట సాగు లో సమస్యలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మినుము, పెసర పంటలలో ఆకుమచ్చ మరియు బూడిద తెగుళ్ళు ఆశించే అవకాశము ఉంది కనుక నివారణకు హేక్జాకోనజోల్ 2.0 మి.లీ లేదా ప్రోపికోనజోల్ 1.0 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంట పుష్పించే దశలో ఉన్నట్లయితే గూడు పురుగు ఆశించే అవకాశము ఉంది కనుక క్లోరిపైరిఫాస్ @ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా లీటరుకు పిచికారీ చేయాలి. కంది లో ఎకరానికి 15-20 కిలోల యూరియాను బూస్టర్ డోస్‌గా వరద నీరు/ మిగులు నీరు బయటకు పోయిన తర్వాత వేయాలి.
వేరుశనగ
ప్రస్తుతము కురిసిన వర్షాలకు వేరుశనగ కోత చేపట్టనున్న రైతులు వర్ష౦ తెరపి ఇచ్చిన వెంటనే కోత చేపట్టి శిలీంద్రపు తెగుళ్ళు ఆశించకుండా బాగా ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశము ఉంది. కనుక హేక్జాకోనజోల్ 400 మి.లీ/ఎకరానికి కలిపి వాతావరణము అనుకూలముగా ఉన్నపుడు భూమి బాగా తడిచేట్లు పిచికారి చేయాలి.
ప్రస్తుత అధిక తేమ కూడిన వాతావరణము వేరుశనగ లో తుప్పు తెగులు & ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశము ఉంది. కనుక రెండిoటికి నివారణకు మాoకోజేబ్ 400 గ్రా + కార్బెండజిమ్ 200 గ్రా కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
చెఱుకు మొక్క లేదా కార్శి తోట
అధిక వర్షాలకు నీరు నిలబడితే, నీటిని త్వరగా పొలం నుండి తీసివేసి 50 కేజి యo.ఓ.పి (పొటాష్) వేసుకోవాలి. వీలుకాకపోతే యూరియ 25 గ్రా మరియు యo.ఓ.పి @ 25 గ్రా సమపాళ్ళలో లీటరు నీటికి కలిపి తోట వయస్సును బట్టి 200 నుండి 450 లీటర్లు ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పంట ఎదుగుదలను బట్టి చెఱుకు తోటలు పడిపోకుండా రెండవ విడత మరియు మూడవ విడత జడచుట్లు వేసుకోవాలి.
అధిక వర్షాల వలన వలయపు మచ్చ తెగులు, మొవ్వ కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి ఆకులు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి.
తెల్ల ఈగ వంటి రసం పీల్చు పురుగుల ఉనికిని గమనించి మోనోక్రోటోఫోస్ 1.6 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం తడిచే విధంగా పిచికారి చేయాలి.
వర్షాధార చెరకు పంట
నీటిని వీలయినంత త్వరగా పొలం నుండి తీసివేసి 35 కేజి యూరియ మరియు 40 కేజి యo.ఓ.పి (పొటాష్) వేసుకోవాలి.
అధిక వర్షాల వలన వలయపు మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు మాంకోజేల్ 3.0 గ్రా లేదా కార్బెన్ డజిం 1.0 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
డా. యల్. ప్రశాంతి
పరిశోధనా సంచాలకులు
ఆచార్య యన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
పరిపాలనా భవనం
లాo, గుంటూరు – 522 034.
Also Read: Sugarcane Seed Development Methods: చెరకు విత్తనాభివృధిలో పద్ధతులు.!