Summer Management Practices in Banana: వేసవి ఉష్ణోగ్రతలు 45°c మించి, వడగాలులు వీచినప్పుడు అన్ని రకాల అరటి తోటలు ఎక్కువ శాతం నష్టానికి గురవుతాయి.. పొట్టిపచ్చ అరటి (వామనకేళి), కర్పూర చక్కెరకేళి, అధిక ఉష్ణోగ్రతలను కొంత వరకు తట్టుకోగలవు. వేసవి కాలంలో తేలిక నేలల్లో ప్రతి రెండు రోజులకు, బరువు నేలల్లో ప్రతి 4 రోజులకు నీటి తడులు ఇచ్చినట్లయితే వేడిని చాలా వరకు తట్టుకోగలవు. అధిక ఉష్ణోగ్రతల తాకిడికి ముందుగా లేత ఆకులు తరువాత ముదురు ఆకులు ఎండిపోతాయి. లేత గెలలు నల్లగా మాడిపోతాయి. కోసిన గెలలలోని కాయలు త్వరగా పండుబారతాయి. పండ్లు ఉడికించినట్లుగా మెత్తబడి నీరుకారి సాధారణ రుచి, నిల్వ సామర్ధ్యాలను కోల్పోతాయి. వేసవికి దెబ్బతిన్న గెలలు అమ్మకానికి పనికి రావు.
వేసవిలో నాలుగు మాసాల లోపు తోటల ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. తడులు మూడు రోజుల కొకసారి అందించలేని పరిస్థితుల్లో కాండం మరియు దుంప కూడ ఎండి, కుళ్ళిపోతుంది. ఎండలు తగ్గిన తరువాత చెట్లు చిగురించి మామూలు ఎదుగుదలకు ప్రతి 3 or 4 రోజుల కొకసారి నీటి తడి తప్పనిసరి ఇవ్వాలి. ఎరువులను తక్కువ మోతాదులో దగ్గర దగ్గరగా ఎక్కువసార్లు అందివ్వాలి. ఒకటి లేక రెండు మాసాల వయసుగల తోటల్లో ఎక్కువ శాతం మొక్కలు చనిపోతే, వాటిని దున్ని మరల జూన్, జూలై నెలల్లో నాటుకోవాలి.
వేసవిలో 5 మాసాల పైబడిన తోటల ఆకులు ఎండిపోతాయి. దుంపకు మరియు కాండానికి తక్కువ నష్టం కలుగుతుంది. ఈ వయసు తోటలు తేలికగా తేరుకుంటాయి. గెలవేయటానికి గల సమయం తక్కువ ఉన్నందున చిన్న గెలలు వేస్తాయి. పెద్ద గెలలు వేసినా సరిగా పక్వానికి రావు. ఇటువంటి తోటలకు ప్రతి 3 or 4 రోజులకు తప్పనిసరిగా తడి ఇవ్వాలి. ఎరువులను సిఫార్సు చేసిన మోతాదు కన్నా 50 % అదనంగా ఇవ్వాలి. గెల వేసే సమయంలో గెలలో పండ్ల ఎదుగుదల ఆధారంగా litre నీటికి 5 గ్రాముల. పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్లను మార్చి మార్చి జిగురుతో కలిపి వారం రోజుల వ్యవధితో నాలుగుసార్లు ఆకులు, గెలలు పూర్తిగా తడిసే విధంగా పిచికారి చేయాలి.
Also Read: Diseases of Banana: అరటి పంటలో సిగటోక ఆకుమచ్చ తెగులు యాజమాన్యం.!

Summer Management Practices in Banana
గెలలు వేస్తున్న, గెలలు వేయటానికి సిద్ధంగా వున్న మరియు లేత గెలల (సగం లోపు తయారైన)తో ఉన్న తోటల్లో తీవ్రమైన ఎండ మరియు వడగాలులకు ఆకులు పూర్తిగా మాడి, ఎండిపోతాయి. అరటి గెలలు సరిగా తయారుకాక ఎండ వేడిమికి మాడిపోతాయి. పచ్చ అరటి రకాల్లో గెలలు కూడ రాలిపడిపోతాయి. ఈ దశలో ఉన్న తోటలకు జరిగే నష్టం ఎక్కువ. తగిన సమయం లేనందున నష్టాన్ని పూరించటానికి అవకాశం లేదు.
ఇటువంటి తోటలకు నీటి తడులు దగ్గర దగ్గరగా పెట్టాలి. తొండం సహా గెల మొత్తానికి ఎండు ఆకు చుట్టి ఎండల నుండి రక్షణ కల్పించాలి. ఎండలు తగ్గాక మొక్కకు 5 నుండి 6 ఆరోగ్యవంతమైన ఆకులు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అమ్ముకొనగలిగే గెలలు తయారవుతాయి. లీటరు నీటికి 5 గ్రా. పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్లను మార్చి మార్చి జిగురుతో కలిపి వారం రోజుల వ్యవధితో నాలుగు సార్లు ఆకులు, గెలలు పూర్తిగా తడిసే విధంగా పిచికారి చేసి జరిగిన నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. చెట్ల ఆకులు పూర్తిగా మాడిన తోటల్లో ఆరోగ్యంగా వున్న పిలకలను కార్మితోటగా పెంచటం మంచిది.
వేసవిలో గెలలు సగం, ఆపైన తయారైన దశలో ఉన్న తోటల ఆకులు, గెలలు ఎండిపోతాయి. చెట్లు విరిగిపడిపోతాయి. గెలలు కోసిన తర్వాత తొందరగా పండి, రుచి తగ్గి మరియు నిల్వ సామర్థ్యం కోల్పోతుంది. ఇటువంటి గెలల్లోని కాయలు ఉడికించినట్లు ఉండడంతో మార్కెట్లో మంచి ధర రాదు. ఇటువంటి చెట్ల గెలలకు ఎండు ఆకు చుట్టి ఎండ నుండి రక్షించాలి. పక్వానికి వచ్చిన గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో మాత్రమే కోసి నీడవున్న (ఎండ మరియు వేడి గాలులు తగలని) ప్రదేశంలో ఉంచాలి.
ముందు జాగ్రత్త చర్యలు: 2-3 నెలల వయసున్న సూది పిలకలను ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3 నుండి 4 వరుసల్లో అరటితోపాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. అరటి తోటను సిఫార్సు చేసిన సాంద్రతలోనే నాటుకొని తోటలోని మొక్కలన్నీ బ్రతికి ఉండే విధంగా జాగ్రత్త పడాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి కాలంలో తడులు ఇవ్వాలి.
తేలిక నేలల్లో రెండు నుండి మూడు రోజులకు మరియు బరువైన నేలల్లో నాలుగు నుండి ఐదు రోజులకు నీరు పెట్టాలి. మార్చి నెల నుండి 10 నుండి 15 రోజులకొకసారి చొప్పున పొటాషియం సల్ఫేటు (0.5 శాతం) మందు ద్రావణాన్ని, జిగురు మందుతో కలిపి పైరు పూర్తిగా తడిసేవిధంగా పిచికారి చేసిన ఎడల, అరటికి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకొనే శక్తి కలుగుతుంది.
Also Read: Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!