Gypsum Application on Groundnut: భారతదేశంలోని నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో వేరుశనగ 67 శాతం ఉంది. మన దేశం విస్తీర్ణంలోను (7.6 మి.హె.) ఉత్పత్తిలోను (7.2 మి.టన్నులు) మొదటి స్థానంలో ఉన్న హెక్టారు దిగుబడిలో 8వ స్థానంలో ఉంది. వేరుశనగ తెలంగాణా రాష్త్రంలో అత్యధిక విస్తీర్ణంలో సుమారు 1. 6 – 1. 7 లక్షల హెక్టార్లు సాగులో ఉంది. వేరుశనగ ముఖ్యమైన వర్షాధార పంట వేరుశనగ. నీటి పారుదల కింద వేరుశనగ దిగుబడులు ఒక స్థాయిలో ఆగిపోవడానికి కారణం తగినంత ఎరువులు వాడకపోవడం. అదే మెట్టసాగులో వేరుశనగ దిగుబడులు తగ్గడానికి ఎరువుల వాడకంలో లోపాలు మరియు బెట్ట పరిస్థితులు ముఖ్య కారణాలుగ చెప్పవచ్చును. దేశంలో వేరుశనగ సాగుచేస్తున్న ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో సాగు ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం సరైన యాజమాన్య పద్దతులను పాటించకపోవడమే.
వేరుశనగ పంటకు నత్రజని, భాస్వరం మొదలగు పోషక పదార్థాలు ఎంత అవసరమో కాల్షియం కూడా అంతే అవసరం. ఎందుకంటే వేరుశనగ ‘‘కాల్సీకోల్’’ (అంటే కాల్షియం ఇష్టపడే మొక్క) కాల్షియం లోపించడం వలన 30 శాతం కంటే ఎక్కువగా లోప లక్షణాలు ప్రపంచ వ్యాప్తంగా వేరుశనగలో గమనించడమైంది. ఈ పంటకు గంధకం కూడా ముఖ్య పోషక పదార్థం. ఎందుకంటే వేరుశనగ విత్తనం 50 శాతం నూనెతో పాటు 25 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ రెండిరటి ఉత్పత్తికి గంధకం చాలా అవసరం. వేరుశనగకు కావాల్సిన ఈ రెండు పోషక పదార్థాలను జిప్సం అందజేస్తుంది. అంతే కాకుండా జిప్సం నేల యొక్క భౌతిక పరిస్థుతులను మెరుగుపరచి వేరుశనగలో అధిక దిగుబడులు పొందుటకు దోహదపడుతుంది. జిప్సం సాధారణంగా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఇనుములాంటి మలినాల వల్ల రంగు కలిగి మెత్తగా ఉంటుంది. జిప్సంను ‘‘ల్యాండ్ ప్లాస్టర్’’ అంటారు.
జిప్సం విరివిగా అమెరికాలో దొరుకుతుంది. మన దేశంలో సుమారుగా ఒక బిలియన్ టన్నులు ఉన్నట్లు అంచనా. అందులో 90 శాతం నిల్వలు రాజస్థాన్‌లో ఉన్నాయి. పరిశ్రమలో బైప్రొడక్ట్ గా కూడా జిప్సం ఉత్పత్తి అవుతుంది. 70`80 శాతం కాల్షియం సల్ఫేట్ ఉండాలి. 10 శాతం కంటే ఎక్కువ సోడియం ఉండకూడదు. జిప్సం స్వచ్ఛత తగ్గినచో ఎక్కువ జిప్సం పంటకు వేయాలి. జిప్సంలో 24 శాతం కాల్షియం మరియు 18.6 శాతం గంధకం ఉంటుంది. కేవలం 10 మి.మీ. వర్షంలో కాని నీటి పారుదలలో కాని జిప్సం చాలా సులభంగా కరుగుతుంది. జిప్సంలో వేరుశనగకు కావాల్సిన కాల్షియం, గంధకం ఉండటం వలన జిప్సం యొక్క పాత్ర, ఈ రెండు పోషక పదార్థాల ద్వారా వివరించవచ్చును.
Also Read: వానాకాలంలో పశువుల్లో తర్వగా వచ్చే వ్యాధులు.!
కాల్షియం :
నాణ్యతగల వేరుశనగ కాయలు ఉత్పత్తి చేయడానికి తగినంత కాల్షియం ఎంతైనా అవసరం. భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి వేరుశనగ మొక్కలో ఈ కాల్సియం మొదట నాలుగు వారాలలో క్రమేణా పెరిగి తర్వాత పంట కోత దశ వరకు ఒక స్థాయిలో ఉండి పోతుంది. ఈ కాల్షియం పాత్ర వేరుశనగ (Groundnut) పై చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం వలన మొక్కలు బాగా మొలకెత్తడం, మొలకెత్తినవి ఎక్కువ శాతం బతకడానికి, వేర్లు ఏపుగా పెరగడానికి తద్వారా బెట్టను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది మరియు కాయ నిండడానికి దోహదం చేస్తుంది. వేరు చివర కాల్షియం ఉండటం వలన కొత్త కణాలు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. వేర్లలో బుడిపెల చర్యను వృద్ధి చేయడానికి దోహదపడుతుంది.
మొక్కల కణంలోని కణుపు గోడలకు కాల్షియం పెక్టెన్ మధ్య పొరగా ఉంటుంది. వేరుశనగ కాయలు వృద్ధి చెందు ప్రాంతంలో కాల్షియం ఉండటం వలన అండాశయం విచ్ఛిన్నతి తగ్గించి మొక్కకు కాయలు ఎక్కువగా ఉండటానికి తద్వారా దిగుబడులు పెరగడానికి ఉపయోగపడుతుంది. పిండి పదార్థాల రవాణాపై కాల్షియం ప్రభావం ఉంటుంది. భూమిలోని సూక్ష్మ క్రిముల అభివృద్ధికి కావలసిన వాతావరణాన్ని కాల్షియం కలుగజేస్తుంది. కాల్షియం ఊడలకు శక్తినివ్వటమే కాకుండ వాటి పెరుగుదలకు తోడ్పడుతుంది.
కాల్షియం లోప లక్షణాలు :
వేరుశనగలో తాలుకాయలు ఎక్కువగా ఉంటాయి.
మొక్క తొడిమ పచ్చగా మారి మొక్క చివరలు వాడిపోయి ఎండిపోవడం, వేరు దెబ్బతినడం జరుగుతుంది.
వేరు వాతావరణంలోని నత్రజనిని గ్రహించే శక్తి కోల్పోతాయి.
కిరణ జన్య సంయోగ క్రియకు కావల్సిన పత్రహరితం ఉత్పత్తి కాదు. పూత తగ్గిపోయి దిగుబడి కూడ తగ్గిపోతుంది.
గంధకం:
గంధకము వేరుశనగ పౌష్టికతలో బహుముఖ పాత్ర కలిగిఉన్నది. గంధకం మొక్కల శ్వాసక్రియకు అవసరం. వేరు పైగల బుడిపెల అభివృద్ధిలో కూడ ప్రముఖ పాత్ర కలిగి ఉన్నది. ఇది అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ మరియు ఫ్యాటీ ఆమ్లాలలో ముఖ్య భాగము. వేరుశనగ గింజలలో నూనె బాగా పట్టుటకు గంధకము ప్రముఖ పాత్ర కలిగి ఉన్నది. గంధకము వేరుశనగ కాయల రంగును అభివృద్ది చేయుటకు, ఆకులు ముందే రాలిపోకుండ అరికట్టుటకు, మొక్కలకు కాయలు బాగా అతుక్కొని ఉండుటకు దోహదపడుతుంది. మొక్కలలో తగినంత గంధకం ఉండటం వలన వివిధ రకాలైన బూజు తెగులు అరికట్టు శక్తి ఉంటుంది. ఊడలు మరియు కాయలు గంధకాన్ని గ్రహిస్తాయి. కాబట్టి కాయలు పెరిగే ప్రాంతంలో తగినంత గంధకం లభ్యమయ్యేటట్లు చూడాలి.
గంధక లోప లక్షణాలు:
లేత ఆకులు చిన్నవై, వివర్ణమై నిటారుగా ఉంటాయి.
ఆకులు పసుపు పచ్చగా మారును. మొక్క పరిమాణం తగ్గిపోవును.
ఇసుక నేలల్లో గంధకం లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
కాల్షియం మరియు గంధకం వేరు వేరుగా వేయడం కంటే ఒక ఎకరాకు 200 కేజీల జిప్సంను విత్తిన 25 %–% 45 రోజుల మధ్య వేయడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఇతర పోషక పదార్థాల గ్రహింపుపై జిప్సం ప్రభావం:
జిప్సంను విత్తేటప్పుడుగాని లేదా ఊడలు దిగే సమయంలోగాని వేయడం వలన నత్రజని, భాస్వరం మరియు పొటాషియంను ఎక్కువగా గ్రహిస్తాయి. అంటే జిప్సం వేయడం వలన వేరుశనగలో ఇతర పోషక పదార్థాల గ్రహింపు కూడా ఎక్కువ ఉంటుంది.
జిప్సం వేసే పద్ధతి:
జిప్సం ఎరువును మెత్తగా పొడి చేసి వేయాలి. మొక్క మొదలుకు చుట్టూ 5 సెం.మీ. లోతు వరకు ఉన్న మట్టిలో కలియబెట్టాలి. వీలైతే జిప్సం వేసే పరికరం ఉపయోగించాలి. ఈ పరికరంతో మొక్కల మధ్య అంతర కృషి, మొక్క మధ్యలో జిప్సం వేయడం రెండు పనులు ఒకేసారి జరుగుతాయి.
Also Read: భారత దేశానికి పాకిన విదేశీ మొక్క చెకుర్మనీస్.!