ఆంధ్రప్రదేశ్తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

రైతుకు గౌరవం దక్కిన రోజే  భారతదేశం అభివృద్ధి చెందినది అని చెప్పవచ్చు 

0
ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ 
   1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు, వ్యవసాయంపై మక్కువతో రైతులకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్న అనంతరం న్యూఢిల్లీ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్ – అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ విజయవంతంగా పూర్తి చేశారు.
     1992లో భోపాల్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ – ఐఐఎస్‌ఎస్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. ఆరేళ్లపాటు అదే సంస్థలో రైతులతో మమేకమై పని చేశారు. 1998-2003 వరకు కాన్పూర్‌ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ – ఐఐపీఆర్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా సేవలందించిన శ్రీనివాసరావు, 2003-2006 వరకు హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌ – క్రీడా ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసి తెలుగు రాష్ట్రాల రైతాంగం మన్ననలు పొందారు. ఈ క్రమంలో 2006-13 వరకు ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ – ఏఐసీఆర్‌పీడీఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పని చేశారు.
    2013-14 వరకు ఇక్రిశాట్‌లో సేవలందించిన శ్రీనివాసరావు, పదోన్నతిపై 2014-17 వరకు మళ్లీ క్రీడా సంస్థలో డైరెక్టర్‌గా పని చేసి వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. 2017 – 24 వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లోని నార్మ్‌కు డైరెక్టర్‌గా పని చేసారు.  తన సుధీర్ఘ కాలంలో నార్మ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేశారు.
  దేశంలో పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేసిన శ్రీనివాసరావు 2019లో వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు ప్రతిష్టాత్మక రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డు అందుకున్నారు. అదే ఏడాది సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ ఇంజనీరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న శ్రీనివాసరావు, అవే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు స్వీకరించారు.
1. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ప్రారంభమై 120 ఏళ్ళు అవుతోంది.. ఈ నేపథ్యంలో ఐఏఆర్ఐ స్థాపించినప్పటి నుంచి  ఇప్పటివరకు వాతావరణంలో, రైతుల సాగు విధానంలో, దేశవాళీ వెరైటీస్ లో, పంట దిగుబడులల్లో వచ్చిన మార్పులు ఏంటి? స్థూలంగా వ్యవసాయ రంగం తీరు తెన్నులు, రైతుల జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? ఈ మార్పులన్నింటిలో ఐఏఆర్ఐ పాత్ర ఎంతవరకు ఉంది? ఈ సంస్థ ఏం చేస్తుంది?
      ఐఏఆర్ఐ 1905లో బీహార్ రాష్ట్రం పూసాలోని సమస్తిపూర్ లో ప్రారంభమైంది. అందుకే దీన్ని పూసా ఇన్ స్టిట్యూట్ అని కూడా అంటారు. 1929లో పెద్ద భూకంపం వచ్చి సంస్థ భవనం, పరికరాలు ధ్వంసం అయ్యాయి. దాంతో ఈ సంస్థను ఢిల్లీకి తరలించారు. భారతదేశంలో 1950 వరకు ఆహార ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. ఆకలి చావులు కూడా ఎక్కువగా ఉండేవి. అప్పట్లో చాలా కరువు కాటకాలు రావడంతో జనం తిండి లేక అల్లాడిపోయేవారు. బెంగాల్లో తీవ్ర కరువు ఏర్పడి 30 లక్షల మంది ఆకలిచావులతో చచ్చిపోయారు. ఈ నేపథ్యంలో 1960వ దశకంలో హరిత విప్లవం వచ్చింది. దీనికి ఐఏఆర్ఐ నాంది పలికింది. మెరుగైన విత్తన రకాలను ఐఏఆర్ఐ ఉత్పత్తి చేసి హరిత విప్లవానికి దోహద పడింది. అప్పటివరకు బలహీనమైన వరి, గోధుమ వంగడాల వల్ల దిగుబడి అంతంత మాత్రంగానే ఉండేది. అలాంటి సమయంలో తక్కువ నీటి  వనరులు, పరిమితమైన ఎరువులు పురుగుమందులతో అధిక ఉత్పత్తి సాధించే మెరుగైన వంగడాలను ఐఏఆర్ఐ తయారుచేసింది. ఫలితంగా భారతదేశంలో ఆహార భద్రత ఏర్పడింది. అందువల్లే ఒకప్పుడు 50 మిలియన్ టన్నుల ఆహార పంటలను మాత్రమే ఉత్పత్తి చేసే భారతదేశం.. ప్రస్తుతం 345 టన్నుల ఆహార పంటలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఒకప్పటికి ఇప్పటికీ రైతులు పరిస్థితి బాగా మెరుగుపడింది. మెరుగైన వంగడాల ద్వారా పంట దిగుబడి పెరగడమే కాకుండా.. మార్కెట్లో ఉత్పత్తులు అమ్ముకొని రైతులు లబ్ధి చెందే పరిస్థితి వచ్చింది. పొలాల్లో వరి, గోధుమ, రాగులు, సజ్జలు తదితర ఆహార పంటలనే కాకుండా కూరగాయలు, పండ్లు, పూలను కూడా ఉత్పత్తి చేసే పరిస్థితులు నెలకొన్నాయి. వీటితోపాటు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ యాజమాన్య పద్ధతులతో పంటల దిగుబడి మరింతగా పెరిగింది. హరిత విప్లవంతో పాటే కురియన్ నేతృత్వంలో శ్వేత విప్లవం కూడా వచ్చింది. రైతులు వ్యవసాయంతో పాటు ఆవులు, గేదెల పెంపకాన్ని ప్రారంభించారు. దీంతో రైతులకు  ఆదాయం పెరిగింది. ఫలితంగా వారి కుటుంబాల్లోని పిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం, పెద్ద చదువులు చదివి ఉపాధి పొందడం  ప్రారంభమైంది. అంతే కాదు గతంతో పోలిస్తే పెరిగిన జీవన ప్రమాణాల వల్ల రైతులు ఆయుష్షు కూడా పెరిగింది. ఈ మార్పులన్నింటిలో ఐఏఆర్ఐ ప్రముఖ పాత్ర పోషించింది.
2. హరిత విప్లవం వల్ల వ్యవసాయంలో రసాయనాల వాడకం విపరీతంగా పెరిగి ఆహార పంటలు  కలుషితమయ్యాయనే విమర్శ ఉంది. దానివల్లే బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర రోగాలు ప్రస్తుతం ప్రబలుతున్నాయని చాలామంది భావిస్తున్నారు. దీనికి మీరేమంటారు?
      ఆకలి చావులు తగ్గించడానికి హరిత విప్లవం తీసుకొచ్చాం. కానీ, అధికంగా పంటలు పండించే క్రమంలో కొన్ని దుష్ఫలితాలు తలెత్తుతున్నాయి. మనకు ఉష్ణోగ్రతలు కూడా అధికం. అందువల్ల మన నేలల్లో 80 శాతం నత్రజని తక్కువగా ఉంది. అధిక దిగుబడి సాధించే ప్రయత్నంలో నేల సారం, పోషక తత్వాలు తగ్గడం ప్రారంభమైంది. దీనికి తోడు వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పశు పెంపకం తగ్గిపోయింది. ఫలితంగా పేడ, గొర్రెల పెంట వంటి సేంద్రియ ఎరువుల వాడకం కూడా తగ్గిపోయి.. రసాయన ఎరువుల వాడకం అధికమైంది. గతంలో వరి పంట తర్వాత పిల్లి పెసర వేసి దాన్ని ఎరువుగా వాడేవాళ్ళం.  ఇప్పుడు అలా లేదు. వరి పంట తర్వాత వేరే పంట వేస్తున్నారు. పంటలు వేయడం అధికమవడం వల్ల భూసారం తగ్గిపోతుంది. భూమిలో కార్బన్ తగ్గిపోతుంది. నీటి వనరుల కొరత ఏర్పడడంతో పాటు  జీవ వైవిధ్యం కొరవడుతోంది. దేశీ వంగడాలతో పాటు హైబ్రిడ్ వంగడాలు ఉపయోగించడం, 50 శాతం బీటితోపాటు 50 శాతం నాన్ బీటీ వినియోగించడం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు అలా చేయడం లేదు. ఈ నేపథ్యంలో హరిత విప్లవాన్ని నిరంతర హరిత విప్లవంగా చేయాలన్నది ప్రస్తుత శాస్త్రజ్ఞులు, పాలకులకు సవాలుగా నిలిచింది.
3. ఆ రోజుల్లో ఆకలి చావులు తగ్గించడానికి, పంట దిగుబడి పెంచడానికి హరిత విప్లవం అనేది సరైన చర్యే. కానీ, ఈ పరిణామ క్రమంలో తలెత్తిన దుష్ఫలితాలను గుర్తించేటప్పటికి నేల సారం పాడైపోయిందని చెప్పవచ్చా?
      పాడైపోవడం అంటూ పూర్తిగా ఏదీ ఉండదు. దాన్ని మరమ్మతు చేయొచ్చు. గతంలో వరి తర్వాత జీలుగు వంటి పంటలను నేల సారాన్ని కాపాడడానికి వేసేవారు. ఇప్పుడు వ్యవసాయం కూడా వాణిజ్యపరంగా మారిపోవడంతో రైతులు వరుసగా మూడు పంటలు వేసి నేల సారాన్ని దెబ్బతీస్తున్నారు. అయినప్పటికీ నేలలో కర్బన  శాతం ఎలా పెంచాలి అనేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 650 నుంచి 700 మిలియన్ టన్నుల పంట చెత్త వేస్తే 350 మిలియన్ టన్నుల సారాన్ని నేలలో పెంచుతుంది. దాంతో కార్బన్ పెంచవచ్చు. ఫలితంగా నైట్రోజన్ పెరుగుతుంది.. ఫాస్ఫరస్ పెరుగుతుంది. మైక్రోబ్స్ పెరుగుతాయి. ఫలితంగా నేల గుల్ల గుల్లగా ఉంటుంది. అలా ఉంటే వర్షానికి నేల కొట్టుకుపోదు.
4. కొంతమంది పెద్ద / ఆదర్శ రైతులు ఆధునిక యాజమాన్య పద్ధతులతో, భారీ స్థాయిలో వ్యవసాయం చేసి లాభం పొందుతున్నారు. కాని ఈ శాతం చాలా తక్కువ. ఇదే విధంగా  గ్రామీణ రైతుకు కూడా అధికాదాయం వస్తుందా? దానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి?
     గ్రామాల్లో ఉన్న రైతులందరూ సంఘటితంగా ఉండి, ఒకేసారి పండిన పంట ఉత్పత్తులను వివిధ రూపాల్లోకి మార్చి అధికాదాయం సాధించాలి. పంట నష్టాన్ని  నివారించాలి. ఉదాహరణకు ఒక గ్రామంలో ఉన్న టమోటా రైతులందరూ ఒకేసారి టమాటాలను అమ్మేయడం వల్ల లాభాలు పెద్దగా రావు. అలాకాకుండా.. టమాట పచ్చళ్ళు, చిప్స్ తయారు చేయడం ద్వారా వాటి నుంచి అధిక లబ్ధిని పొందవచ్చు. ఇలా చేయడం వల్ల పండిన పంట పాడవకుండా ఉంటుంది మరియు రైతులకు కుడా లాభం వస్తుంది. నేల మేద భారం కుడా తగ్గే అవకాశాలు ఎక్కువ  తద్వారా నేల, నీరు వంటి సహజ వనరులను కాపాడిన వారమవుతాం.
5. కాలక్రమేణా వచ్చిన పరిణామాల వల్ల నేలలో ప్లాస్టిక్ అధికమై కాలుష్యం బాగా పెరిగిపోయింది. నీటిపారుదల వ్యవస్థ సరిగా లేదు. అధిక వర్షపాతం, అల్ప వర్షపాతం తదితర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయంలో రసాయనాల వాడకం అధికం అవుతుంది. ఈ సమస్యలన్నింటికీ ఐఏఆర్ఐ సూచించే పరిష్కారాలు ఏంటి?
      ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం నిలవాలంటే ఆధునిక పద్ధతుల్లో సాగు చేయక తప్పదు. యంత్రాలను ఉపయోగించాలి. ఆధునిక వంగడాలను వినియోగించాలి. సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూనే నేల సారాన్ని పెంచుకుంటూ.. ఎరువులు, పురుగు మందులను తగు మోతాదులో వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధించాలి. ప్రస్తుతం వినియోదారుల్లో కూడా చైతన్యం బాగా వచ్చింది. భవిష్యత్తులో మనం తినే ఆహార పదార్థం ఎక్కడ ఉత్పత్తి అయింది? దానిలో రసాయనాలు ఏ మోతాదులో ఉన్నాయి? పురుగుమందుల అవశేషాలు ఏ మేరకు ఉన్నాయి? అని చెక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు.. చెరువుల మట్టి, పంట చెత్త, వర్మీ కంపోస్టు ఉపయోగించి, పరిమిత మోతాదులో ఎరువులను వినియోగించడం వల్ల ఆహార నాణ్యత బాగుంటుంది. నేల సారాన్ని కూడా కాపాడవచ్చు. ఇలా పండించిన సేంద్రీయ  పంటలకు అధిక ఆదాయం కూడా లభిస్తుంది.
6. మీ పరిశోధనా ఫలితాలను రైతుల వద్దకు తీసుకెళ్లి వాళ్ల వ్యవసాయ పద్ధతుల్లో మార్పు తీసుకురావడానికి ఐఏఆర్ఐ ఏ రకంగా కృషి చేస్తుంది? ఐఏఆర్ఐలో కొత్తగా మీరు వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు ఏంటి?
      చాలా రకాల కార్యక్రమాలు ఐ ఏ ర్ ఐ చేస్తుంది. రసాయనాలతో కూడిన పురుగు మందుల నుంచి బయో ఫార్ములేషన్స్ ఎలా ఉన్నాయి అనేదానిపై మేం చేసిన పరిశోధన చాలా ముఖ్యమైనది. నేలలో ఫాస్పరస్, పొటాషియం వేయకుండా రైజోబియం వేసి వాతావరణం నుంచి నత్రజనిని తీసుకునే బయో ఫెర్టిలైజర్స్ గురించి ప్రచారం చేస్తున్నాం. పంట అవశేషాలను కాల్చకుండా పూస డీ కంపోజర్ అనే విధానాన్ని సూచిస్తున్నాం. తక్కువ సమయంలో డికంపోజ్ అయిపోయి.. పంట చెత్తలో పోషకాలు, ప్రయోజనాలు నేలకు చేర్చే పూస డికంపోజర్ విధానం బాగా పాపులర్ అయింది కూడా. ఎరువులు, పురుగు మందులు ఏ మోతాదులో వేయాలి అనేది కూడా వివరిస్తున్నాం. సాయిల్ టెస్ట్ చేసి ఏ పంటకు ఏది ఎంత అవసరం అనేది చెబుతున్నాం.
     కరువు కాటకాలను తట్టుకునే విధంగా వినూత్న విత్తన రకాలను తయారు చేశాం. ఉదాహరణకు భారతదేశంలో ఉన్న 40 శాతానికి పైగా గోధుమ వెరైటీస్ ఐఏఆర్ఐ తయారు చేసినవే. మేము తయారుచేసిన మెరుగైన వంగడాలు, మేలైన విత్తన రకాలను ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్లాలన్నది మా ముందున్న లక్ష్యం. అస్సాంలో, జార్ఖండ్లో, మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో, కర్ణాటకలో ఐఏఆర్ఐ తయారుచేసిన విత్తన రకాలను ఉపయోగిస్తున్నాం. పంట అవశేషాలను ఎక్కడెక్కడ కాలుస్తున్నారు? వాటిని ఏం చేయాలనే దానిపై స్థానికంగా పరిష్కారాలు తయారు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. సేంద్రియ ఎరువులు,  పురుగు మందులపై రైతులకు అవగాహన కలిగించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. పండించిన పంటల్లో మూడో వంతు వృధా అవుతోంది. ఆ వృధాను తగ్గించేందుకు అగ్రి స్టార్టప్ లు పెట్టే విధంగా యువతను  ప్రోత్సహిస్తున్నాం. దేశంలో ఉన్న అందరు శాస్త్రవేత్తలతో ఐఏఆర్ఐ బృందాలను ఏర్పాటు చేసి.. తగ్గిపోతున్న జీవవైవిద్యం, నేల సారం, నీటి వనరులు, ఆహార వృధా తదితర అంశాలకు పరిష్కార మార్గాలు కనుగొనేలా కృషి చేస్తున్నాం.
7. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట కోత సరైన సమయంలో చేయకపోవడంతో రైతు నష్టపోతున్నాడు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఏం చేయాలి?
       భారతీయ వ్యవసాయ రంగం మాన్సూన్ చాలెంజెస్. మార్కెటింగ్ ఛాలెంజెస్ ను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ దేశంలో 55 శాతం వ్యవసాయం వర్షాలపైనే ఆధారపడి ఉంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? పండించిన పంటను మార్కెటింగ్ ఎలా చేయాలి? దళారులను ఎలా నియంత్రించాలి అన్నది చాలా ముఖ్యం. అలాగే పంట కోతలో యంత్రాలను ఉపయోగించడం అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. దీనివల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే యంత్రాలను చిన్న రైతులకు ఉపయోగపడేలా చేయాలి. అయితే అందరూ మిషన్లు కొనుక్కోలేరు. అన్ని గ్రామాల్లో మిషన్లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో 40 మంది రైతులతో కష్టమైజింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సెంటర్లకు ఐఏఆర్ఐ తరుపున యంత్రాలను కొనుగోలు చేసి అందిస్తున్నాం ప్రైవేట్ వాళ్లు కూడా కష్టమైజింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఏ స్కీమ్స్ అందిస్తుంది అన్నదానిపై కూడా అవగాహన కల్పిస్తున్నాం.
8. ఐఏఆర్ఐ పరిశోధన ఫలితాలు రైతులకు అందేలా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం లాంటి చర్యలు ఏమైనా చేస్తున్నారా?
      ఇది ఇప్పటికే జరుగుతుందండి. దీన్ని పార్టిసిపేట్ రీసెర్చ్ ఎవల్యూషన్ అంటారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, రీజనల్ కేంద్రాల ద్వారా ఈ కృషి జరుగుతోంది.
9. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఆర్ఐ శాఖ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా?
    రెండు తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఆర్ఐ రీజనల్ సెంటర్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. అది ప్రతిపాదన దశలోనే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఆర్ఐ శాఖ ఉండాలని డిమాండ్ కూడా చాలా ఏళ్లుగా ఉంది. గోవాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. తెలుగు రాష్ట్రాలు కోరితే అలాంటి యాక్షన్ ప్లాన్ ను ఇక్కడ కూడా తయారు చేస్తాం. ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన కోసా కిసాన్ మేళాలో తెలుగు రైతులకు అవార్డులు ఇచ్చాం. ఈ సంవత్సరం డిసెంబర్ లో 400 మంది రైతులతో రైతు దినోత్సవం చేస్తున్నాం. ఇందులో ఉత్తమ రైతులు వినియోగించిన మెరుగైన యాజమాన్య పద్ధతులను మిగతా రైతులందరికీ పరిచయం చేస్తాం.
10. సేంద్రియ వ్యవసాయంపై మీ విధానం ఏంటి?
     సహజ వనరులను పరిరక్షిస్తూనే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. అదే ఆర్గానిక్ ఫార్మింగ్.  దశలవారీగా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని దేశవ్యాప్తం చేయాలన్నది నా ఆలోచన. సహజ వనరుల పరిరక్షణ, రైతుల ఆదాయ అభివృద్ధి, ఆహార భద్రత.. ఈ మూడు కలగలిస్తేనే ఆర్గానిక్ ఫార్మింగ్ అభివృద్ధి చెందుతుంది.
11. చివరగా రైతులకు మీరిచ్చే సందేశం ఏంటి?
       రైతులు చాలా సానుకూల దృక్పథం కలిగిన వాళ్లు. మూడేళ్లుగా వర్షాలు పడకపోయినా నాలుగో ఏడు కూడా వ్యవసాయం కొనసాగిస్తూనే ఉంటారు. ఇలాంటి సానుకూల దృక్పథం కలిగిన రైతులను అభివృద్ధి చేయాలి. ఈ క్రమంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం రైతులు వ్యవసాయాన్ని పరస్పర సహకారంతో సమిష్టిగా చేయాలి. ఆధునిక సాగు పద్ధతులు అనుసరించాలి. సంఘటిత వ్యవసాయంతోనే భారతదేశానికి భవిష్యత్తు.
ప్రతిష్టాత్మక ఐసీఏఆర్ – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IARI) డైరెక్టర్‌గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ – నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ – నార్మ్ డైరెక్టర్‌గా పనిచేచేసిన శ్రీనివాసరావు, ఐఏఆర్‌ఐ అధిపతిగా ఎంపికైన తొలి తొలుగు శాస్త్రవేత్త కావడం విశేషం. 
Leave Your Comments

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు తేది: 03.05.2025 నుండి 07.05.2025వరకు

Previous article

నీటి యాజమాన్య పనులకు సరైన సమయం వేసవికాలం

Next article

You may also like