వ్యవసాయ పంటలు

Monsoon Maize Cultivation: వానాకాలంలో మొక్కజొన్న సాగు – అధిక దిగుబడికి సూచనలు.!

1
Monsoon Maize Cultivation
Monsoon Maize Cultivation

Monsoon Maize Cultivation: ఇరు తెలుగు రాష్ట్రాలలో వరి, ప్రత్తి తర్వాత మొక్కజొన్న పంటను ఎక్కువగా వానకాలంలో సాగు చేస్తున్నారు. ఈ పంటను ఆహారం గాను, వివిధ పరిశ్రమలలో, పశువులకు మేతగాను ఉపయోగిస్తున్నారు. వివిధ జిల్లాలలో నీటి లభ్యత మరియు నేలల ఆధారంగాను దీర్ఘకాలిక, మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి వానకాలంలో విత్తుకోవాలి.

నేలలు : సారవంతమైన మంచి నేలలు ఎన్నుకోవాలి.
విత్తే కాలం : ఈ పంటను జూన్‌ 15 నుండి జూలై 15 వరకు మరియు వర్షాభావ పరిస్ధితుల్లో స్వల్పకాలిక రకాలను జూలై 31 వరకు విత్తుకోవాలి.
రకాల ఎంపిక : ప్రభుత్వ మరియు సిఫార్సు చేసిన ప్రైవేట్‌ రంగ సంస్థల నుండి దీర్ఘకాలిక, మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి.

Monsoon Maize Cultivation

Monsoon Maize Farming

ప్రభుత్వ రకాలు :

డి.హెచ్‌.ఎం.117 : ఈ రకం ఆకు ఎండు, కాండంకుళ్ళు తెగులు మరియు కాండం తొలిచే పురుగును తట్టుకుంటుంది .
డి.హెచ్‌.ఎం.121 : ఈ రకము పాము పొడ, ఆకు ఎండు మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు లేదా మసి కుళ్ళు తెగులును మరియు కాండం తొలిచే పురుగును తట్టుకుంటుంది.
కరీంనగర్‌ మక్కా-1: ఈ రకము ఎండు తెగులు,పాముపోడ తెగులు మరియు ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది.
కరీంనగర్‌ మక్కా : ఈ రకము త్రుప్పుతెగులు మరియు ఆకు ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.

ప్రైవేట్‌ రకాలు : సిఫార్సు చేసిన ప్రైవేటు రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి .

విత్తన మోతాదు : ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది. మొక్కకు మొక్కకు 20 సెం.మీ., సాలుకు సాలుకు 60 సెంటీమీటర్లు ఎడమ ఉండేటట్లు విత్తుకోవాలి.

విత్తన శుద్ధి : కత్తెర పురుగు ఉధృతి ఎక్కువ అవుతున్నది కావున రైతులు విత్తే ముందు ఒక కిలో విత్తనానికి సైంట్రానిలిప్రోల్‌19.8% ం థయామిథాక్సమ్‌ 19.8%- 6మిల్లీలీటర్ల లేదా 6 మిల్లీలీటర్ల థయోమెథాక్సమ్‌లను కలిపి విత్తుకోవాలి.

తెగుళ్లు : పంటలో కిలో విత్తనానికి ఒక గ్రామ్‌ కార్బన్డిజం కలిపి విత్తుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులును తగ్గించుకోవచ్చును. ఎండు తెగులు నివారణకు 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్లయితే ఈ తెగులును తగ్గించుకోవచ్చును .

Cultivation of Maize In Paddy Fields

Monsoon Maize Cultivation

ఎరువుల యజమాన్యం :
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు వ్యవసాయ శాఖలు ఇచ్చిన భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను రైతులు ఈ పంటలో వాడాలి. ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. వానకాలం మొక్కజొన్నలో 80 కిలోల నత్రజని (మూడు దఫాలుగా) 24 కిలోల భాస్వరము దుక్కిలో వేయవలెను. 20 కిలోల పొటాషియం (రెండు దఫాలుగా) ఇచ్చే రసాయన ఎరువులను ఒక ఎకరంలో వేయవలెను.
జింక్‌ ఒక ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ను దుక్కిలో వేయవలెను.

కలుపు యజమాన్యం: ఈ పంట విత్తనాలు విత్తిన తర్వాత అట్రాజన్‌ 50% డబ్లు.పి. 800 గ్రాముల నుంచి ఒక కిలో మందును 200 లీటర్లలో కలిపి విత్తిన ఒక్క రోజు నుంచి రెండో రోజు లోపే పిచికారి చేయవలెను.

నీటి యజమాన్యం : సాధారణంగా మొక్కజొన్న పంటకు నేల ఆధారంగా వానకాలంలో 350-500 మి.మీ. అవసరం. ముఖ్యంగా పూత దశలో మరియు గింజలు పాలు పోసుకునే దశలో నీరు తప్పకుండా ఈ పంటకివ్వాలి.

పురుగులు మరియు తెగుళ్లు నివారణ: ఈ పంటకు పురుగులు %డ% తెగుళ్లు ఆశించి నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. కత్తెర పురుగు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పురుగు ఉధృతి ఎక్కువ అవుతున్నది. కావున రైతులు ఈ పురుగును గుర్తించిన వెంటనే ఐదు మిల్లి లీటర్ల వేప నూనె 1500 పి.పి.యం. మొక్క సుడులలో పిచికారి చేయవలెను. ఈ పురుగు ఉధృతి తగ్గనిచో ఇమామేక్టిన్‌ బెంజ్యోటే 0.4 మి.లీ. లేదా క్లోరాంత్రి నిల్‌ ప్రోల్‌ 0. 3 మి.లీ. లేదా 0. 5 మి.లీ. స్పైనటోరం వీటిలో ఏదైనా ఒక మందును ఒక్క లీటర్‌ నీటిలో కలిపి పైరు మొత్తం తడిచే విధంగా పిచికారి చేయవలెను.

Pests in Maize

Pests in Maize

పురుగులలో ముఖ్యమైనది కాండం తొలిచే పురుగు: ఈ పురుగు ను గుర్తించిన వెంటనే కార్బో ప్యూరాన్‌ 3%స్త్ర% గుళికలను మూడు కిలోలును మొక్క సుడిలలో లేదా మోనోక్రోటపాస్‌ 1.6 మి.లీ. ను ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయవలెను.

తెగుళ్లు: వివిధ రకాల తెగుళ్లు ఆశించి నష్టం కలిగే చేసే అవకాశం ఉన్నది.ఎండు తెగులు వచ్చే ప్రాంతంలో తట్టుకునే రకాలైన డి.హెచ్‌.ఎం. 117 ,డి.హెచ్‌.ఎం.121 , కరీంనగర్‌ మక్కా 1 మరియు సిఫార్సు చేసిన ప్రైవేటు రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించవలెను. ఈ తెగులు రాకుండా ఉండడానికి పూతా దశ నుండి తేమ తగ్గకుండా మొక్కజొన్న పంటకు నీటీతడులు ఇవ్వాలి.

పంట కోత: మొక్కజొన్నలో కండెల పై పొరలు ఎండి, మొక్కలపై వేలాడుతూ, గింజలు గట్టిపడి తేమ శాతం 25 శాతం నుండి 30 శాతం ఉన్నప్పుడు ఈ పంటను కొయ్యాలి. కోసిన కండెలను ఎండలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలను ఒలిచిన తర్వాత తేమ 10 నుంచి 12 శాతం వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి.

పైన చెప్పిన విధంగా రైతులు సరైన సమయంలో మంచిరకాలు ఎన్నుకొని, విత్తన శుద్ధి చేసి, సిఫారసు మేరకు ఎరువుల మోతాదును, పురుగులను మరియు తెగుళ్లను గుర్తించిన తరువాత సస్య రక్షణ చర్యలను చేపట్టినట్లయితే వానకాలం లో అధిక దిగుబడులను పొందవచ్చును.

Leave Your Comments

July Month Animal Protection: జూలైమాసంలో పాడి, జీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యలు.!

Previous article

Questions to Ask Farmers: రైతన్నకో ప్రశ్న..

Next article

You may also like