వ్యవసాయ పంటలు

Post-harvest Management of Mango: మామిడిలో కోత అనంతరం చేపట్టవలసిన కీలక పద్ధతులు.!

2
Post-harvest Management of Mango
Post-harvest Management of Mango

Post-harvest Management of Mango: భారతదేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది మామిడి. దీనిని ఫలరాజుగా పిలుస్తారు. భారతదేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 35 శాతం సాగులో 22,58,130 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది, ఆంద్రప్రదేశ్‌లో మామిడి విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో దేశంలో రెండవ స్థానంలో ఉన్నది. దాదాపుగా మూడు లక్షల హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. ప్రతి ఏడాది దాదాపుగా 28 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. మామిడి తోటలలో సాధారణంగా కోతలు పూర్తి అయినవి.

సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి పెడతారు. కోత తర్వాత మళ్ళీ పూత, కాత వచ్చినప్పుడు మాత్రమే చెట్టుకు కావలసిన ఎరువులను అందిస్తారు. దీని వలన చెట్టుకు సరైన పోషకాలు సరైన సమయంలో లభించక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక పోవడం జరిగి దిగుబడి మీద ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో రైతులు వచ్చే ఏడాది అధిక దిగుబడులతో ఎక్కువ మంది వినియోగదారులకు అందించుటకు కోత అనంతరం మామిడి రైతులు సరైన యజమాన్యం పాటించడం ద్వారా వచ్చే ఏడాది పూత సక్రమంగా రావడంతో పాటు అధిక దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. మామిడిలో కోత అనంతరం జులై-ఆగస్టులో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యజమాన్యం మరియు అవసరానికి అనుగుణంగా సస్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు.

చెట్లకి విశ్రాంతి : పంటకోత తర్వాత మామిడి మొక్కలు చాలా శక్తిని పండ్ల ద్వారా కోల్పోవడం వలన జూన్‌, జూలై మాసాలలో చెట్లు బలహీనంగా, పెరుగుదల లేకుండా నిద్రావస్థ దశలో ఉండి, చెట్లలో ఎండు కొమ్మలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా 20-30 రోజుల పాటు ఏ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఉండి, ఆ తర్వాత కొమ్మల కత్తిరింపులు, అంతరకృషి చేయాలి.

నీటి తడి ఇవ్వటం : మామిడి కాయలు కోసిన తరువాత చెట్లు చాలా శక్తిని కోల్పోతాయి అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు బలహీనపడి ఉంటాయి. కావున చెట్లకి నీటిని సమృద్దిగా ఇవ్వటం ద్వారా చెట్లు కోలుకుంటాయి.

Also Read: వానాకాలం (ఖరీఫ్‌) టమాటా సాగులో మెళకువలు

Post-harvest Management of Mango

Post-harvest Management of Mango

కొమ్మ కత్తిరింపులు : విశ్రాంతి అనంతరం ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన, నేల బారుగా ఉన్న కొమ్మలను తీసివేయాలి. అలాగే కాపు కాసిన కొమ్మలను ఒక కణుపు వెనకకు కత్తిరించాలి. గుబురుగా పెరిగిన చెట్లలో సూర్యరశ్మి, గాలి లోపలికి ప్రసరించేలాగా తలపైన 3-4 అంగుళాల మందమున్న కొమ్మలను కోసి వాటిమద్య ఖాళీ ఏర్పరచాలి. ఈ విధంగా కత్తిరించినందున మధ్యాహ్నం సమయంలో ఎండ చెట్ల మొదళ్ళ పై పడుతుంది.

అవసరమైతే తూర్పు, పడమర దిశల్లో కూడా 2-3 అంగుళాల మందమున్న కొమ్మలను కత్తిరించి కొమ్మల మధ్యలో ఖాళీ ఏర్పడేలా చేసినట్లైతే, సూర్యుడు తూర్పున పుట్టి పడమర దిశకు ప్రయాణించేటప్పుడు సూర్యరశ్మి ఖాళీ ప్రదేశాల గుండా లోపలికి ప్రసరిస్తుంది. ఈ కత్తిరింపులు కొమ్మలు, ఆకులు ఎక్కువగా పుట్టే రకాలైన ఆల్ఫాన్సో (ఖాదర్‌), బంగినపల్లి (బెనిషన్‌), నీలం లాంటి రకాలకు తప్పనిసరిగా చేయాలి.

ప్రూనింగ్‌ సా, ప్రూనింగ్‌ నైఫ్‌, ప్రూనింగ్‌ సికేచర్‌ వంటి పరికరాలు కొమ్మ మందాన్ని బట్టి ఉపయోగించవచ్చు. మామిడి కొమ్మలను పై నుంచి కిందకి మూడవ కణుపు వరకు కత్తిరించిన తరువాత దీనికి తక్షణ చర్యగా 10 గ్రా యూరియా 5 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ను లీటర్‌ నీటికి కలిపిన ద్రావణం పిచికారి చేసినట్లైతే త్వరగా చెట్లు కోలుకొని కొత్త కొమ్మలు/చిగురులు పుట్టుకొచ్చి, అవే వచ్చే ఋతువులో పుష్పిస్తాయి.

అనగా నవంబర్‌, డిసెంబర్‌ నెలలో పూతకు వస్తాయి. అలాగే కత్తిరింపులు చేసిన తరువాత బొర్డోపేస్టు లేదా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ పేస్ట్‌ను పూసి తరువాత మళ్ళీ కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని చెటలపై పిచికారి చేయాలి, ఈ విధంగా కొమ్మలను ప్రతి సంవత్సరం కత్తిరింపులు చేయడం వల్ల చెట్టులో క్రమం తప్పకుండా కాపు నిలకడగా వస్తుంది, అంతేగాక గాలి మరియు వెలుతురు సక్రమంగా అందడం వల్ల వివిధ చీడ పీడలు, తెగుళ్ళు ఆశించకుండా నివారించబడతాయి.

తోటల్లో దుక్కి దున్నడం : తొలకరి వర్షాలు పడిన తరువాత తోటల్లో వాలుకి అడ్డంగా చెట్ల మధ్యన 2-3 సార్లు దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడుతుంది. అంతేకాకుండా నేల గుల్లబారి, వేర్లు బాగా గాలి పీల్చుకొని చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. చెట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పచ్చిరొట్ట పైర్లను వేసి వాటిని పూత దశలో అనగా ఆగష్టు నెలలో రెండవ దుక్కి చేపట్టినప్పుడు నేలలో కలిసేలాగా దున్నాలి. దీని వలన నేల సారవంతం అవుతుంది. మూడవ దుక్కి అక్టోబర్‌ నెలలో చేపట్టినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుండి 1.5 – 2.0 మీటర్ల దూరం వదిలి దున్నుకోవాలి.

ఎరువుల యజమాన్యం : మామిడి కొమ్మ కత్తిరింపుల అనంతరం ప్రతి సంవత్సరం సేంద్రీయ మరియు రసాయన ఎరువులను తప్పనిసరిగా వేసి దిగుబడిని పెంచవచ్చు. తోటల్లో చెట్టుకు 150 గ్రా. జింక్‌ సల్ఫేట్‌, 75 గ్రా. బోరాక్స్‌ మరియు 100 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ 125 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ పశువుల ఎరువుతో కలిపి జూన్‌-జూలై మాసాలలో మొక్కల పాదుల్లో వేయాలి.

చెట్ల మద్య దున్నకం పూర్తయిన తరువాత చెట్టు వయసును బట్టి సిఫారసు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా ? భాగం ఎరువులను కాయ బఠానీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి వేయాలి. ఎరువుల మోతాదును 1 సంపప వయసు ఉన్న ప్రతి చెట్టుకు 25 కిలోలు పశువుల ఎరువు, 217 గ్రా. యూరియా, 625 గ్రా సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 167 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ చొప్పున వేయాలి. 5 సంవత్సరాలు వయసు ఉన్న చెట్టుకు 50 కేజీలు పశువుల ఎరువు, 1085 గ్రా. యూరియా, 3125 గ్రా. సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 1000 గ్రాములు మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ చొప్పున వేయాలి.

అలాగే 10 సంపప లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న చెట్టుకు 60- 70 కేజీలు పశువుల ఎరువు, 2170 గ్రా. యూరియా, 6250 గ్రా. సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 1670 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి. కొత్త చిగురులు తొడిగే సమయంలో, అంటే సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఒక్కసారి మరియు బఠానీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి సూక్ష్మపోషక మిశ్రమాలైన ఫార్ములా-4 లేదా ఆర్క మ్యాంగో స్పెషల్‌ వంటి వాటిని 5 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి చెట్లపై పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎరువులు వేసిన అనంతరం తదుపరి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను చల్లి పచ్చి రొట్ట పైరు పూత సమయంలో తోటలో కలియబెట్టడం వల్ల సేంద్రీయ కర్భనం మరియు ఇతర పోషకాల లభ్యత పెరుగుతుంది.

నీటి యజమాన్యం : సాధారణంగా రైతులు కాపు లేనప్పుడు మామిడికి నీరు పెట్టరు. కోతలు పూర్తయిన తరువాత అక్టోబర్‌- నవంబర్‌ వరకు రుతుపవన వర్షాల కారణంగా భూమిలో కావలిసినంత తేమ ఉంటుంది. వర్షాలు లేక భూమి బెట్ట పరిస్థితులు గురైనప్పుడు అవసరమైన మేరకు నీటి తడి ఇవ్వాలి లేదా బిందు పద్ధతిలో నీరు పెట్టాలి. మామిడి చెట్లు పూతకు వచ్చే ముందు కనీసం రెండు నెలలు బెట్ట పరిస్థితులు ఉండాలి. కాబట్టి అక్టోబరు ఆఖరు నుంచి పూత వచ్చే వరకు మామిడి చెట్లకు నీరు పారించటం పూర్తిగా ఆపేయాలి.

పూతకు ముందు భూమిలో తడి ఉంటే, చెట్లలో పూతకు బదులు ఆకు చిగుర్లు వచేస్తాయి. కానీ ఈశాన్య ఋతు పవనాలు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు నవంబర్‌లో కూడా పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు ఆగిన తరువాత మామిడి తోటల్లో తేలికగా దున్నుకోవాలి. దీనివల్ల భూమిలోని తేమ ఆవిరై బెట్ట పరిస్థితులు ఏర్పడి పూత యథావిధిగా రావటానికి వీలుంటుంది. ఈ సమయంలో చెట్ల మద్య లోతుగా దున్నడం మంచిది కాదు. ఈశాన్య ఋతుపవన వర్షాలు నవంబరు నెలకు మించి పొడిగించబడినప్పుడు పూత యథావిధిగా రావడం కోసం లీటరు నీటికి మల్టీ-కె (పొటాషియం నైట్రేట్‌) 10 గ్రా.యూరియా 10 గ్రా. చొప్పున కలిపి డిసెంబర్‌ రెండో పక్షంలో పిచికారి చేయవచ్చు.

సస్య రక్షణ పద్దతులు : మామిడి కాయల కోత తరువాత సాధారణంగా కాండం తొలిచే పురుగు, బెరడు తొలిచే పురుగు, ఆకులను గుళ్ళుగా చేసుకొని పురుగు, ఆకులను కత్తిరించే పురుగు, ఆకులపై బుడిపెలను చేసే పురుగును ఆశించే నష్టపరుస్తాయి. ఈ దశలో మామిడి చెట్లను చాలా మంది రైతులు పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తుంటారు. అందువల్ల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు బలహీనపడుతాయి. మామిడి తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ పురుగులను తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. కాండం, బెరడు తొలిచే పురుగులు ఆశించే భాగాలను శుభ్రంగా చేసి, అవసరమైతే వాటిని జాగ్రత్తగా కత్తిరించి నాశనం చేయాలి. కాండం, కొమ్మలపై పురుగులు చేసిన రంధ్రాల్లో డైక్లోరోవస్‌ మందు ద్రావణంను (లీటరు నీటికి 10 మీ.లీ ) దూదిలో అద్ది రంధ్రాల్లో ఉంచి మట్టితో కప్పి ఉంచాలి. దీనివల్ల లోపల ఉన్న పురుగులు చనిపోతాయి.

ఆకు గూడు పురుగులు, ఆకు బూడిపై పురుగులు, ఆకు చుట్టూ పురుగు నివారణాకు క్లోరోపైరిఫాస్‌ 2 మీ.లి లేదా ఇమామెక్టిన్‌ బెంజయోట్‌ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మామిడిలో ప్రధానంగా వచ్చే బంకకారు తెగులు, కొమ్మలపై నల్లకట్టు తెగులు కూడా ఆశించి నష్టపరుస్తాయి. ఈ తెగుళ్లు ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. మిగిలిన కొమ్మల్లో బంక, నల్లకట్టను గోనెసంచి గుడ్డతోరుద్ది శుభ్రపరచి కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తెగుళ్ళ వ్యాప్తిని నివారించవచ్చు. పైన పేర్కొన్న పద్దతులను మామిడి రైతులు కోత అనంతరం చేపట్టి అధిక ఫలసాయం పొందగలరు.

Also Read: రోజురోజుకు పెరుగుతున్న ఆయిల్‌పామ్‌ సాగు.!

Leave Your Comments

Monsoon Tomato Cultivation: వానాకాలం (ఖరీఫ్‌) టమాటా సాగులో మెళకువలు

Previous article

Questions to Farmers: రైతన్నకో ప్రశ్న.!

Next article

You may also like