Rangpur Lime Root Stock: ఆంధ్రప్రదేశ్లో చీని తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగులో ఉన్నాయి.
చీని అంట్ల తయారీ, ఎంపికలో లోపాలు జరిగితే తోటలు ఉన్నంతకాలం ఈ లోపాలవల్ల కలిగే నష్టాన్ని భరిస్తునే ఉండాలి. కాబట్టి అంట్ల ఎంపికలో, వార్షిక పంటల విత్తనం ఎంపికలో కంటే మరింత ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. చీని తోటలు తొందరగా క్షీణించేందుకు గల కారణాల్లో అతి ముఖ్యమైనది సరైన వేరు మూలాన్ని వాడకపోవడమే. వేరు మూలం తనపై పెరిగే చీని చెట్టును చాలా అంశాల్లో ప్రభావితం చేస్తుంది. సరైన వేరు మూలంపై అంటుకట్టిన చీని అంట్లను నాటేందుకు వాడకుంటే తోటలు ఉన్నంతకాలం దీని చెడు ప్రభావాన్నే అనుభవించాల్సి ఉంటుంది.
Also Read: Natural Farming: నేలల రక్షణలో పురాతన ప్రకృతి వ్యవసాయం.!
వేరు మూలం ప్రాముఖ్యత:
వేరు మూలం (రూట్ స్టాక్) – అంటుకట్టిన భాగానికి కిందనున్న భాగాన్నే వేరుమూలం అంటారు. వేరుమూలం తనపై పెరిగే చీని చెట్టు కింది అంశాల్లో ప్రభావితం చేస్తుంది..
• చెట్టు పెరుగుదల, పరిమాణం, ఆకారం.
• కాపుకొచ్చేందుకు పట్టేకాలం.
• పోషకాల్ని భూమి నుంచి గ్రహించడం.
• శిలీంద్ర రోగాల్ని, వైరస్ తెగుళ్ళను తట్టుకొనే శక్తి.
• నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తి.
• చెట్టు జీవితకాలం.
• పండ్ల నాణ్యత, దిగుబడి.
అందుకే అనువైన వేరు మూలం రకాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
గత కొన్నేళ్ళుగా “జంబేరిని” వేరు మూలంగా వాడి అంటుకట్టిన చీని అంట్లను నాటారు. వీటివల్ల తోటలు క్షీణిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం జంబేరి వేరు మూలం శిలీంద్ర రోగాలైన “వేరు కుళ్లుకు”, వైరస్ తెగుళ్లయిన ట్రిస్బీ జాకు, బడ్ యూనియన్ క్రీజ్కు నీటి ఎద్దడికి తట్టుకొనే శక్తి లేకపోవడమే కారణమని తెలుస్తుంది. అందువల్ల జంబేరికి బదులుగా రంగపూర్ నిమ్మను వాడితే పై లోపాలుండవని, చెట్లు ఎక్కువకాలం జీవిస్తాయని పరి శోధనలు, రైతుల అనుభవాల ద్వారా తెలిసింది. కనుక రంగపూర్ నిమ్మపై కట్టిన చీని అంట్లనే రైతాంగం ఎంపిక చేసుకొని నాటుకోవాలి.
Also Read: Eradication of Parthenium Weed: నిమ్మ తోటల్లో పార్థీనియం కలుపు నిర్మూలన.!