Nutrient Deficiency In Plants: అకాల వర్షాలకి రైతులు పంటకి ఇచ్చిన ఎరువులు మొక్కకి అందకుండా నీటిలో కొట్టుకొని పోయివుంటాయి. ఈ ఎరువులు మొత్తం పొలంలో ఒక చోట ఆగిపోయే, పొలం మట్టి లోపలి వెళ్తాయి. ఇలా జరగడం వల్ల కూడా నేల నాణ్యత, పంట నాణ్యత కూడా తగ్గుతుంది. మొక్కలో ఎరువుల లోపాలని గుర్తు పట్టి, మొక్కకి తగ్గినంత ఎరువులు అందించి మంచి దిగుబడి పొందవచ్చు.
నత్రజని లోపం ఉన్నప్పుడు మొక్కలు సరిగా పెరగవు. చిన్నవిగా ఉంటాయి. లేత ఆకు పచ్చరంగులో లేదా పసుపు వర్ణంతో ఆకులు ఉంటాయి. ఆకు చివర్లు పసుపు పచ్చ వర్ణంలో ఉండి. ఈనెలు ఊదారంగులోకి మారుతాయి. కాండం మందంగా ఉండి పెళుసుగా ఉంటుంది. పూల మొగ్గలు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. కాయలు చిన్నవిగా ఉండి పండే ముందు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దిగుబడి బాగా తగ్గుతుంది.
నత్రజని లోపని నివారణకి హెక్టారుకు 100 కిలోల నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి నాటిన 30వ రోజు, 45 వ రోజు, 60వ రోజు భూమిలో వేసి నత్రజని లోపాన్ని సవరించవచ్చును.
భాస్వరం లోపం ఉన్న మొక్కలు ఆలస్యంగా పెరుగుతాయి. మొక్కల పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఆకులు ముదురు ఆకు పచ్చరంగులో ఉంటాయి. ఆకు క్రింది భాగపు ఈనెలు ఊదారంగులోకి మారుతాయి. కాండం తక్కువ మందంతో నారతో గట్టిగా ఉంటుంది. భాస్వరం లోపం నివారణకు హెక్టారుకు 60 కిలోల భాస్వరాన్ని నాటేటప్పుడు భూమిలో వేస్తే భాస్వరం లోపం రాకుండా చేయవచ్చును.
పొటాషియం లోపం ఎక్కువగా ఉన్నప్పుడు లేత మొక్కలు ముదురు ఆకుపచ్చ ఆకులతో చిన్న కాండంతో, కణుపుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఆకు కాడలు సరిగ్గా పెరగక పోవడంతో మొక్కల చివర్లలో ఆకులు గుత్తి వలె గుబురుగా ఉంటాయి. లేత ఆకులు ముదురు ఆకుపచ్చరంగుతో, ముదురు ఆకులు లేత ఆకు పచ్చ రంగుతో, ఆకు అంచుల చుట్టు గోధుమ వర్ణంలోకి మారి ఉంటాయి. వీటి ఈనెల మధ్య భాగాలు బలహీన పడటంతో చింపిరిగా ఉంటాయి. పొటాషియం లోపించినప్పుడు పక్వానికి వచ్చిన వెంటనే కాయలు రాలిపోతాయి. ఇటువంటి మొక్కల కాయలలో కంద అంత ఉండక పండు మొత్తం ఒకే సారి పండక, అతుకులు ఉన్నట్లుగా కనబడతాయి. పొటాషియం లోప నివారణకు హెక్టారుకు 60 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను రెండు సమభాగాలుగా చేసి ఒక భాగాన్ని భూమిలో నాటేటప్పుడు వేసి, రెండవ భాగాన్ని నాటిన 60 రోజులకు నత్రజనితో కలిపి పొటాషియం లోపం రాకుండా చేయవచ్చును.
మెగ్నీషియం లోపని తేలికపాటి నేలల్లో, అధిక మోతాదులో కాల్షియం కలిగి ఉన్న ఎరువులను వాడినప్పుడు లేదా సాగు నీటిలో కాల్షియం అధిక స్థాయిలో ఉన్నప్పుడు మెగ్నీషియం లోపాలు కనబడుతాయి. పొటాషియంను అధికంగా వాడినప్పుడు కూడా మెగ్నీషియం లోపాలు వస్తాయి. మెగ్నీషియం లోపం మొదట క్రింది ముదురు ఆకులను ప్రభావితం చేస్తాయి. ఆకు ఈనెలు ముదురు ఆకు పచ్చగా ఉంటూ ఈనెల మధ్యభాగం పసుపు పచ్చగా మారుతుంది. నత్రజని లోపం మెగ్నీషియం లోపాన్ని ఎక్కువ చేస్తుంది.
మెగ్నీషియం లోపాన్ని నివారించుటకు 0.5 శాతం మెగ్నీషియం సల్ఫేట్ అనగా 5 గ్రాముల మెగ్నీషియం ఒక లీటరు నీటిలో కలిపి కావలసిన మేర ద్రావణాన్ని తయారు చేసి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి లోపాన్ని సవరించవచ్చును. ముందుగా లేత ఆకులు క్రింది భాగం ఊదారంగులోకి మారుతాయి. ఆకు చివర్లు, అంచులు ఎండిపోతాయి. మొక్క చివర ఉండే మొగ్గ భాగం చనిపోతుంది. కాయలు కుళ్ళిపోతాయి. వేర్లలో పెరుగుదల తక్కువగా ఉండి గోధుమ రంగులో ఉంటాయి. ఈ లోపం ముఖ్యంగా ఆమ్ల నేలల్లో, ఉప్పునేలల్లో వస్తుంది.
కాల్షియం లోప నివారణకు 0.5 శాతం కాల్షియం నైట్రేటు అనగా 5 గ్రాముల కాల్షియం నైట్రేటును ఒక లీటరు నీటిలో కలిపి కావలసిన మేర ద్రావణాన్ని తయారు చేసి, వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి లోపాన్ని సవరించవచ్చు.
ఇనుము లోపం ఉన్న నేలలో సున్నం అధికంగా ఉన్నప్పుడు లేదా సాగు నీటిలో కార్బనేట్స్ అధికంగా ఉ న్నప్పుడు ఇనుము లోపం పంటల్లో కనబడుతుంది. ఇనుము లోపం ఉన్నప్పుడు లేత ఆకులు తమ సహజ ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. లేత పసుపు వర్ణంతో కూడిన మచ్చలు ఆకు క్రింది భాగం నుండి మొదలయి క్రమంగా ఆకు ఈనె వెంట అనుసరించి విస్తరిస్తాయి.
ఇనుము లోపాన్ని నివారించుటకు 0.5 శాతం అన్నభేది అంటే 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము సిట్రిక్ యాసిడ్ ఒక లీటరు నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి లోపం చిన్నాలు కొత్త ఆకుల మీద కనపడనంత వరకు వారం రోజుల కొకసారి పిచికారి చేసి నివారించవచ్చును.
మన రాష్ట్రంలోని నేలల్లో జింకు లోపం విస్తారంగా కనబడుతుంది. సున్నం అధికంగా గల నేలల్లో, చవటి నేలల్లో ఎక్కువగా కనబడుతుంది. జింక్ లోపం ఉన్నప్పుడు మొక్కలో లేత ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఈనెల మధ్య భాగంలో పసుపు వర్ణంతో కూడిన మచ్చలు ఉంటాయి. బాగా పెరిగిన ఆకుల్లో, ముదురు ఆకుల్లోని ఈనెల మధ్య భాగాలు ఎండి పోతాయి. జింక్ లోపాన్ని 0.25 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణం అంటే 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటరు నీటిలో కలిపి కావలసిన మేర ద్రావణాన్ని తయారు చేసి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసి సవరించవచ్చును. జింక్ లోపమున్న నేలల్లో ఈ పోషకలోపాన్ని నివారించటానికి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను వేయాలి.
బోరాన్ లోపం ఉన్న మొక్కలో లేత ఆకులు పసువు నారింజ పండు రంగులో ఉండి ఆకులు కిందకి వంకర తిరిగి ఉండటం బోరాన్ లోపం ముఖ్య లక్షణం. పెరుగుదల బాగా తగ్గిపోతుంది. లేత ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగతా భాగం పసుపు వర్ణంలోకి మారి ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం మిగతా భాగాలు బాగా పెళుసుగా ఉంటాయి. కాయలు పగిలి పోతాయి.
బోరాన్ లోప నివారణకు 1 లీటరు నీటిలో 2 గ్రా. ల బొరాక్స్న కలిపి కావలసిన మేరకు ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారి చేయాలి. నాటే ముందు హెక్టారుకు 20-30 కిలోల బోరాక్స్ చొప్పున వేసినట్లయితే బొరాన్ కోపం రాకుండా ఉంటుంది.
Also Read: Modern Seedling Cultivation: ఆధునిక సాగు పద్ధతిలో నారు పెంపకం, క్యూ కడుతున్న రైతులు.!