Castor Farming: ఆముదపు పంట విస్తీర్ణము, ఉత్పత్తులలో భారత దేశము ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది .ఆముదము ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 650 కోట్ల రూపాయిలు విదేశీమారక ద్రవ్యము వస్తుంది. ఆముదము నూనెను నైలాన్ దారముల తయారి,జెట్ యంత్రాలలో ఇంధనంగా, హైడ్రాలిక్ ద్రవంగా, ఔషధాల తయారీ మొదలగు 200 పరిశ్రమలలో వాడుతున్నారు.పరిశ్రమలకూ, ఎగుమతులకూ ఆముదపు పంట చాలా ముఖ్యము కాబట్టి, ధర కూడా ఎక్కువగానూ,నిలకడగాను ఉంటుంది. పంటను ఎక్కువగాను పండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన వంగడాలను అధిక దిగుబడి నిచ్చు సంకర రకాలను వాడి, మంచి యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్య రక్షణను పాటించి అధిక దిగుబడిని సాధించవచ్చు.
ఆముదము పంటను అన్ని రకాల నేలలో సాగుచేయవచ్చు. నీరు బాగా ఇంకిపోయే తేలిక నేలలు అనుకూలమైనవి.నీరు నిలిచె నేలలు, చవుడు నేలలు ఈ పంటకు అనువైనవి కావు. వేసవిలో రెండు,మూడు,సార్లు దున్ని గుంటకతో చదును చేయాలి.
విత్తనాలు విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 3గ్రా థైరమ్ లేదా 3 కాప్టాన్ లేదా 1గ్రా కార్బండైజిమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి.విత్తన శుద్ధి చేయటం ద్వారా మొలకకుళ్ళు తెగులు, ఆల్టర్నేరియా ఆకు మచ్చ తగులు కొంత వరకు వడలు తెగుళ్లని అరికట్టవచ్చు.
Also Read: Dairy Farming: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పై దృష్టి పెడితే.. పాల వెల్లువ.!
ఖరీఫ్ లో జూన్ 15నుండి జూలై 31వరకు రబీ లో సెప్టెంబర్ 15 నుండిబ అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు.తొలకరి వర్షాలకు విత్తాలి. వర్షాధార పంటను ఆగుష్టు 15తర్వాత విత్తరాదు. రబీ, వేసవిలో విత్తునప్పుడు పొడిదుక్కిలో విత్తనం వేసి నీరు పెట్టాలి. ఇలా చేసిన మొక్కలు సమానంగా మొలకెత్తి బాగా ఎదుగుతాయి. తరువాత నెల స్వభావాన్ని బట్టి 10నుండి 15రోజుల కొకసారి తడి పెట్టాలి.
ప్రతి సంవత్సరం హెక్టారుకు 5-10టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయడం వలన తెగులు కొంతవరకు నివారించుకొనవచ్చును. ఎరువులను భూసార పరీక్షా ఫలితాలననుసరించి నిర్ణయించిన మోతాదులో వాడాలి. హెక్టారుకు నత్రజని 90కిలోలు, భాస్వరము 50కిలోలు, పోటాష్ 30కిలోలు వేసుకోవాలి. నత్రజని మాత్రము 30కిలోలు మొదటి దఫా ఇతర ఎరువులతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన 60కిలోల్లో ఒక పర్యాయం 30కిలోలు మొదటి గెల పూత దశలో 40 నుండి 50 రోజులలో, మిగిలిన 30కిలోలు రెండవ గెల పూత దశలో 70 నుండి 80 రోజులలో వేసుకొని నీరు కట్టుకోవాలి.
ఆముదాన్ని దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు.ఎందుకంటే మొక్కలో ప్రతీ భాగం మానవుడికి ఉపయోగపడుతుంది. అతి ప్రాచీన కాలం నుండి ఆముదాన్ని మందుల తయారితో వాడుతున్నారు. శుశ్రుత ఆయుర్వేదంలో కూడ ఆముదాన్ని గురించి వివరించారు.ఆముదముతో దాదాపు 200రకాల పదార్ధాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మందుల తయారీలో,రంగుల తయారీలో విమానాలకు, జెట్ యంత్రాలకు ఇంధనంగా హైడ్రాలిక్ ద్రవంగా, నైలాన్ దారాలతయారిలో,సబ్బుల తయారీలో,ఇలా పలు రకాలుగా వాడుతారు. అందువల్ల రైతులకి కూడా ఈ పంట ద్వారా మంచి లాభాలు వస్తున్నాయి.
Also Read: Goat Farming: తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రాబడి..