Soybean Cultivation: సోయా చిక్కుడు చైనాలో పుట్టి మిగతా ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా దేశాలలో సాగు చేస్తున్నారు. ఈ పంట మన దేశంలో విస్తరముగా సాగు చేస్తున్నారు. ఈ పంట తెలుగు ప్రాంతాల్లో 0.88 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు రైతులు సాగు చేస్తున్నారు.
మొత్తం ఉత్పత్తి 1.73 లక్షల టన్నులు సాగు చేస్తున్నారు.
సోయాచిక్కుడులో ప్రోటీన్లు 43 శాతం, 20 శాతం నూనె ఉంటుంది. అందువలన ఈ పంటను పప్పు ధాన్యపు పంటగా, నూనె గింజల పంటగా రెండు రకాలుగా వాడుకోవచ్చు. సోయా గింజల నుండి తీసిన నూనె గుండె సంబంధిత రోగులకు చాలా మంచిది.
వాతావరణం: పగటి ఉష్ణోగ్రత 15-32 డిగ్రీ సెల్సియస్ మధ్య సోయా చిక్కుడు మొలక శాతం ఎక్కువగా వస్తుంది. కాని మొక్క అభివృద్ధి, పెరుగుదలకు ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అయితే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ, 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పంట పెరుగుదల ఆగిపోతుంది. ఈ పంట 600-650 మి.మీ వర్ష పాతం ఉన్న ప్రాంతాల్లో మంచి దిగుబడితో పెరుగుతుంది. అధిక వర్షం వల్ల కూడా పంట దిగుబడి తగ్గుతుంది.
నేలలు: సోయా చిక్కుడుకు నేలల pH 6.5-7.5 ఉండాలి. ఇసుక, కర్బన శాతము ఎక్కువ ఉన్న నేలలు ఈ పంటకి మంచి దిగుబడిని ఇస్తాయి.
నేల తయారీ: నేలను ఒకటి లేదా రెండు సార్లులోతులో దుక్కి దున్ని ఆ తర్వాత గుంటక లేదా కల్టివేటర్తో మళ్ళీ దున్నాలి. ఇలా తయారు చేసిన నేలలో విత్తనాలు విత్తుకోవాలి.
Also Read: SRI Method of Paddy Cultivation: శ్రీ పద్ధతిలో వరి సాగు చేయడం ఎలా.?
విత్తనం: ఎకరాకు 25-30 కిలోల విత్తనాలు వాడాలి.
విత్తన శుద్ధి: సోయాచిక్కుడు పంట లేగ్యూం జాతికి చెందినది కాబట్టి రైజోబియం జపానికం అనే బాక్టీరియాతో విత్తన శుద్ధి చేస్తే, గాలిలోని నత్రజనిని, మొక్కల దగ్గర నత్రజని ఎరువుగా మారి,నత్రజని ఎరువుల వాడకం తగ్గిస్తుంది. ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200గ్రాముల రైజోబియం కల్చరును కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. దీని కన్నా ముందు థైరామ్ లేదా కాప్టాన్, ఇమిడా క్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తే సమయం: ఖరీఫ్-జూన్ 15 నుండి జూలై వరకు, రబీలో-అక్టోబరు, వేసవి-ఫిబ్రవరి నెలలో విత్తనాలు విత్తుకోవాలి.
విత్తే దూరము: నల్ల రేగడి భూముల్లో 45 సెంటి మీటర్లు x 5 సెంటి మీటర్లు తేలిక నేలల్లో 30 సెంటి మీటర్లు x 7.5 సెంటి మీటర్ల దూరంలో విత్తనాలు విత్తుకోవాలి.
ఎరువులు: 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి.
కలుపు నిర్మూలన / అంతర కృషి: సోయా చిక్కుడులో కలుపు సరియైన సమయంలో నిర్మూలించక పోతే దాదాపు 6-27 శాతం దిగుబడి తగ్గిపోతుంది. అందుచేత ఈ పంటను విత్తిన రోజు నుండి 40 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. కలుపు తగ్గించడం కోసం అలాక్లోర్ లేదా పెండి మిథాలిన్ 1 లీటరు మందు ఎకరాకు విత్తిన 24-48 గంటలలోపు నేలలో సరియైన పడును ఉన్నపుడు పిచికారి చేసి కలుపును నివారించుకోవచ్చు.
నీటి యాజమాన్యము:
ఈ పంటను ఖరీఫ్ సీజన్లో సాగు చేసినప్పుడు నీటి తడులు అవసరం ఉండదు. కాని రబీలో వేసినప్పుడు నీటిని పంట ముఖ్యమైన దశలో ఇవ్వాలి. వేసవిలో కనీసం 5-6 నీటి తడులు ఇవ్వాలి. అధిక దిగుబడి కోసం ఈ పంటకు మొలకెత్తే దశ, కాయ అభివృద్ధి చెందే దశలో తప్పకుండా నీటి లేకుండా జాగ్రత్త పడాలి.
పంట కోత: సోయా చిక్కుడు పంటను కాయలు పరిపక్వత చెందగానే కోయాలి. ఆలస్యము చేసినప్పుడు రంగు మారి రాలిపోతాయి. కోసిన మొక్కలను కళ్ళము పై రెండు నుండి మూడు రోజులు ఎండనిచ్చి కర్రలతో లేదా ట్రాక్టరుతో గాని గింజలను వేరు చేయాలి.
గింజల నిల్వ: గింజలను 11 శాతం తేమ వచ్చేంత వరకు ఎండ బెట్టి, శుభ్రము చేసిన గోదాములలో నిల్వ చేసుకోవాలి. విత్తనము కొరకు నిల్వ చేసినప్పుడు మధ్య మధ్యలో ఎండలో ఆరబెట్టాలి. సోయా చిక్కుడు విత్తనాలకు ఒక సీజను వరకు మాత్రమే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విత్తనం కొరకు నిల్వ చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోనవలెను. ఈ పద్దతిలో సోయా చిక్కుడు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి.
Also Read: Pulses Cultivation: పప్పు ధాన్యాలు ఇలా సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది..