Casuarina Cultivation: రైతులు పంట పొలాల్లో సంప్రదాయ పంటలతో పాటు కొంత భాగం పొలంలో వాణిజ్య పంటలు పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. సంప్రదాయ పంటలకి ధరలు లేని సమయంలో వాణిజ్య పంట ద్వారా రైతులు నష్టపోకుండా ఉన్నారు. ఇలాంటి వాణిజ్య పంటలో సవక లేదా సరుగుడు పంటని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. తిరుపతి జిల్లాలో, విందురు గ్రామంలో రత్న రెడ్డి ఈ సవక లేదా సరుగుడు చెట్లని సాగు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు ఈ పంటని సాగు చేస్తున్నారు.
సవక లేదా సరుగుడు రత్న రెడ్డి గారు గత 8 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఇప్పటికి ఈ పంటని రెండు సార్లు అమ్ముకున్నారు. ఈ సవక చెట్లు పూర్తిగా పెరగడానికి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ రైతు రెండు రకాలు సాగు చేస్తున్నారు.
ఒక రకం చెట్టు పూర్తిగా పెరగడానికి 4 సంవత్సరాల సమయం పడితే, ఇంకో రకం చెట్టు పూర్తిగా పెరగడానికి 3 సంవత్సరాల సమయం పడుతుంది. 4 సంవత్సరాలలో పెరిగే చెట్లు నిటారుగా ఉంటాయి. మూడు సంవత్సరాలలో పెరిగే చెట్లు కొంచెం నిటారుగా ఉండవు. దాని వల్ల వీటి ధర కొంచెం తక్కువగా ఉంటుంది.
Also Read: FSSAI Salary in India 2023: 2,25,000 రూపాయల జీతంతో ఎఫ్‌ఎస్‌సై ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఈ మొక్కలు పాండిచ్చేరి నుంచి తెచ్చుకున్నారు. ఒక మొక్కకి 2 నుంచి 4 రూపాయల వరకు ఉంటుంది. ఒక ఎకరం పొలంలో ఈ మొక్కలని నాటుకోవడానికి 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ చెట్లకి ఎలాంటి ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. నీళ్లు కూడా నెలకి ఒకసారి ఇస్తే సరిపోతుంది.
ఈ చెట్లు పూర్తిగా పెరిగాక వ్యాపారులే రైతుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. చెట్టు నాణ్యత బట్టి ఒక ఎకరానికి 3-5 లక్షల ధర వస్తుంది. ఎక్కువగా పెట్టుబడి, మైంటెనెన్స్ లేకపోవడం ద్వారా ఈ పంట నుంచి రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ఈ చెట్లని ఎక్కువగా కాగితం, ప్లై వుడ్ తయారు చేయడానికి వాడుతారు. దాని కారణంగా ఈ చెట్లకి మంచి డిమాండ్ ఉంది.
Also Read: Plant Growth Regulators: మొక్కల పెరుగుదల కోసం హార్మోన్ల ద్రావణం తయారీ ఎలా చేసుకోవాలి.?