Maize Cultivation: మొక్క జొన్న పంటను మొట్ట మొదటి సారిగా పెరూ, బొలీవియా, ఈక్వెడార్లోని ఎత్తైన ప్రదేశాలలో ఆవిర్భవించినట్లు గుర్తించారు. దక్షిణ మెక్సికో, అమెరికాలో ఆవిర్భవించినట్లు కొంత మంది చెపుతున్నారు. ప్రపంచ దేశాలలో అమెరికాలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో 57% అమెరికాలో జరుగుతుంది. ఇతర దేశాలలో చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియా ఎక్కువ సాగు చేస్తున్నారు.
భారతదేశంలో మొక్క జొన్నను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 758 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 38. 87 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తున్నారు . ఖరీఫ్ సీజన్లో 35.38 కిలోలు ఒక హెక్టారుకు, రబీలో 59.98 కిలోలు ఒక హెక్టారుకు పండిస్తున్నారు.
ఉప ఉత్పత్తులు:
1. మొక్క జొన్న ఆకులు, కాండం, సైలేజ్ గానూ, పేపర్ తయారీలోనూ, రాపింగ్ పేపర్ తయారీలోనూ, ఎండిన తర్వాత మొత్తం మొక్క వంట చెరకు గానూ లేక మట్టి కండీషనర్ గానూ ఉపయోగపడుతుంది.
2. మొక్కజొన్న ఏ దశలోనైనా పశువుల మేతగానూ, పూత దశలో కాయ గూరలగానూ, అనేక రకాల పరిశ్రమల్లో ముడి సరుకుగా
వాడుతున్నారు.
3. విత్తనం పశువులు , కోళ్ళ దాణాగా, బిస్కట్లు , బేకరీలలో కూడా వాడుతున్నారు.
4. గింజ నుండి స్టార్చి గ్లూకోజ్, రసాయన పదార్థాలు తయారు చేయవచ్చు.
5. మొక్క జొన్న నుండి ఆల్కహాల్, ఇథనాల్ వంటి రసాయన పదార్ధాలు తయారు చేయవచ్చు.
6. మొక్క జొన్న నూనెను అనేక దేశాల్లో వంట నూనెగా వాడుచున్నారు. ఇది హృదయ సంబంధిత రోగాలకు మంచిది. ఈ నూనెలో లినోలిక్, ఓలియిక్ ఆమ్లాలు ఎక్కువ గా ఉంటాయి. కొలెస్ట్రాల్ తక్కువ గా ఉంటుంది..
7. కార్న్ ఫ్లేక్స్, సూప్ మిక్స్, ఇన్‌స్టంట్ కార్న్స్, పఫ్స్, ఉప్మా మిక్స్, కేసరి బాత్ మొదలైన అనేక పిండి పదార్ధాలు తయారు చేయవచ్చును.
మొక్క జొన్న వర్గీకరణ:
మొక్క గింజలోని ఎండోస్పెర్మ్ స్వభావాన్ని బట్టి ఏడు గ్రూపులు గా విభజించారు అవి.
1. డెంట్ మొక్కజొన్న: ఈ రకం గింజలలో శిఖరాగ్ర భాగం లో పసుపు లేదా, తెలుపు రంగులో డెంట్ ఉంటుంది. ఈ డెంట్ పిండి పదార్ధం తొందరగా ఎండి కుంచించుకు పోవడం వలన ఏర్పడింది. ఈ రకం ఎక్కువగా అమెరికాలో సాగులో ఉంది.
2. చెకుముకి మొక్కజొన్న: ఈ రకం గింజలలో శిఖరాగ్ర భాగం కుంచించుకు ఉంటుంది. వీటిలో కార్బో హైడ్రేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన అంతర పంటగా ఎక్కువగా సాగు చేస్తున్నారు.
3. పాప్ కార్న్: పేలాలు చేయడానికి అనుకూలమైనది. గింజ చిన్నదిగా ఉండి ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ కలిగి ఉంటుంది.
4. అల్లు కార్నియా మేస్ అమైలేసియా: వీటిలో గింజలు ఎక్కువగా ఉండే ఉప్పు, కార్బోహైడ్రేట్ ఉంటాయి.
5. స్వీట్ కార్న్ : గింజలు ఎండిన తర్వాత ఎక్కువగా వంకరలు తిరిగి ఉంటాయి.
6. పాడ్ కార్న్: ఇవి మేతకు అనుకూలమైనది. ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు.
7. ఆక్సి మొక్కజొన్న: దీని గింజలు పగిలిన తర్వాత బూడిద వర్ణం గల పదార్ధం కనిపిస్తుంది. వీటిని గమ్ తయారీలో వస్త్రాలు, పేపర్ పరిశోధనలో వాడుతారు.
Also Read: Maize Cultivation: మొక్కజొన్న సాగులో మెళుకువలు.!
వాతావరణం:
మొక్కజొన్న పంటని వెచ్చని వాతావరణంలో సాగు చేయాలి. 85 % వరకు మొక్కజొన్నను ఖరీఫ్ పంట కాలంలో సాగు చేస్తారు. ఈ పంట రాత్రి ఉష్ణోగ్రత 15.60C కన్నా తక్కువ ఉన్నట్లయితే పెరుగుదల ఆగిపోతుంది. ఈ పంటను సంవత్సరం వర్ష పాతం 600 ఎం. ఎం ఉన్న అన్ని ప్రాంతాల్లో మంచిగా సాగు చేయవచ్చు. నీటి నిల్వను ఉన్న ప్రదేశాలలో పెరగదు.
నేలలు:
1. ఇసుక, రేగడి, గరుప లోతైన మధ్య రకం నేలలు అనుకూలం.
2. ఆమ్ల, క్షార, చౌడు నీరు నిల్వ ఉండే భూములు పనికి రావు.
విత్తే సమయం:
మొక్కజొన్నను ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో తెలంగాణా, రాయల సీమ ప్రాంతాల్లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తు కోవచ్చు . కోస్తా ప్రాంతాల్లో అక్టోబర్ 15 నుంచి జనవరి 15 వరకు సాగు చేసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో ఆగస్టులోపు విత్తుకోవాలి.
విత్తే పద్ధతి:
1. బోదె నాగలితో వరుసల మధ్య 60-75 సెంటి మీటర్ దూరం, మొక్కల మధ్య 20-25 సెంటి మీటర్ దూరం సాగు చేసుకోవాలి.
2. ఈ రకంగా ఎకరాకు 25-30 వేల మొక్కలు వచ్చేలా విత్తు కోవాలి.
3. ప్రత్యేక రకాలకు వరుస వరుసకు మధ్య 60 సెంటీమీటర్, వరుసలో అయితే 20 సెంటీమీటర్ సరిపోతుంది.
4. ఎకరానికి సాధారణ రకాలకు 7 కిలోలు విత్తనం అవసరం.
ఎరువుల యాజమాన్యం:
1. నీటి పారుదల క్రింద నత్రజనిని విత్తేటప్పుడు 4 వంతు విత్తిన నేల రోజులకు, 50-55 రోజులకు తర్వాత 4 వంతులు వేయాలి.
2. వర్షాధార పంటకు 2/3 వంతు నత్రజనిని విత్తే సమయంలో మిగిలిన నత్రజనిని విత్తిన 30-40 రోజులకు వేయాలి.
3. భాస్వరంను, పొటాష్ను ఎరువులు విత్తే సమయంలో వేయాలి.
4. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి.
5. మొక్కలలో జింకు లోపం ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారడం లేదా లేత, పైరు తెల్ల మొగ్గగా కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి పైరు పై పిచికారి చేయాలి.
6. పంట పై భాగంఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి.
కలుపు నివారణ:
1. ఎకరానికి 1-1/2 కిలోల అట్రజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2,3 రోజుల్లో భూమి పై పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం:
1. మొక్క జొన్న పూటకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం.
2. 30-40 రోజులలోపు లేత పైరుకు అధిక నీరు హానికరం.
3. విత్తిన తర్వాత పొలంలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు.
అంతర పంటలు:
1. మొక్క జొన్నను కంది పంటతో గాని ఇతర పంటలతో గాని అంతర పంటగా 2:1 సళ్ళలో విత్తుకోవాలి.
2. కూరగాయలలో కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
3. మొక్కజొన్న పెసర 1:2, మొక్కజొన్న మినుము 1:2, మొక్కజొన్న సోయాచిక్కుడు 1:2, మొక్క జొన్న ముల్లంగి 1:1 ఇలా పంటలు అంతర పంటగా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.
4. పండ్ల తోటల్లో మొదటి 3-5 సంవత్సరాల వరకు అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు.
5. మొక్క జొన్న తరువాత వేరుశనగలో పొద్దు తిరుగుడు లేదా కందిని సాగు చేసుకోవచ్చు.
పంట కోత:
కండి పై గల పొరలు ఎండి, గింజ మొదట్లో నల్లటి చారలు ఏర్పడి పంట పరిపక్వతను సూచిస్తాయి. ఆ దశలో సుమారుగా 25-30% తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరు చేసి 3-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. కండెల నుంచి గింజలను వేరు చేయడానికి షెల్లర్ అనే గింజల నూర్పిడి యంత్రాన్ని వాడాలి. పేలాల రకం వేసినపుడు గింజల్లో 30-35% తేమ ఉన్నపుడు కండెలు కోసి నీటిలో ఆర బెట్టాలి. ఎండలో ఆర బెడితే సరియైన పేలాలుగా మారక గింజ పగిలి, నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు పాలు పోసుకొనే దశలో కండెలు తీసుకోవాలి. అంబర్ పాప్ కార్న్, మాధురి రకాలను కండె పూత దశలోనే కోసి బేబీ కార్న్ గా ఉన్నపుడు రైతులు అమ్ముకోవచ్చు. మొక్క జొన్నను పశువుల మేత కొరకు వేసినపుడు 50% పూత దశలో పైరును కోయాలి.
Also Read: Maize Threshing Machine: మొక్కజొన్న గింజలు వొలుచు యంత్రం గురించి తెలుసుకోండి.!