Cotton Crop Nutrition: ప్రత్తి ని తెల్ల బంగారం అంటూ రైతులు మురిపెంగా పిలుచుకుంటారు. అందుకే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, మార్కెట్ అటుపొట్లు ఎదురైన మెట్ట రైతులకు ఖరీఫ్ సాగు అనగానే గుర్తొచ్చే పంట ప్రత్తి.తెలుగు రాష్ట్రాలలో సాగయ్యే ప్రధాన వాణిజ్య పంటల లో ప్రత్తి ఒకటి. తెల్ల బంగారంగా పిలువబడే ఈ పంటకు ప్రత్యామ్నాయ పంట లేదు అన్నది రైతుల నమ్మకం.
తెల్ల బంగారంగా పిలుచుకునే ఈ పంటను రైతులు అధిక భాగం వర్షా కాలంలో నే సాగు చేస్తారు. ప్రత్తి పంటను ఎక్కువగా నీరు నిలుపుకునే నల్ల రేగడి నేలల్లో సాగు చేస్తారు. ఎర్ర నేలలు, చల్కా నేలల్లో సాగు చేసినప్పుడు తప్పనిసరిగా నీటి వసతి వుండాలి అనే విషయాన్ని రైతులు గుర్తించాలి. ప్రత్తి లో ఎరువులను పైపాటుగా మరియు దుక్కిలో వేసుకోవాలి. కానీ అధిక శాతం రైతులు దుక్కిలో సేంద్రియ ఎరువులు వేయకుండా, కాంప్లెక్స్ ఎరువులను సిఫారసు చేసిన దాని కంటే ఎక్కువ మోతదులో వేస్తారు. ఎరువులను సిఫారసు చేసిన దాని కంటే ఎక్కువ మోతదులో వేయటం వలన సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం కలదు. అలా కాకుండా సమగ్ర పోషక యాజమాన్యం చేపడితే దిగుబడులు పెరుగుతాయి.
ప్రత్తి లో సేంద్రియ ఎరువులు ఏ సమయం లో, ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుందాం.
ప్రత్తి లో మొదటగా పశువుల ఎరువు గాని, కోళ్ళ పెంట గాని, గొర్రెల పెంట గాని వేయాలి. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు వేసుకున్నట్లైతే ఎకరాకు 4 టన్నులు వేసుకోవాలి ఒకవేళ వర్మి కంపోస్ట్ వెసుకున్నట్లైతే ఆఖరి దుక్కిలో ఎకరాకు 2 టన్నులు వేసుకోవాలి . ఏక పంటగా ప్రత్తి వేయటం వలన చీడపీడల ఉదృతి పెరుగుతుంది. పంట మార్పిడి చేయటం ద్వారా ఈ చీడపీడల ఉదృతి ని తగ్గించవచ్చు. ఒకవేళ పంట మార్పిడి చేయని పరిస్థితులు ఉన్నట్లైతే ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 4 కేజీల వేప పిండిని చల్లినట్లైతే కొంత వరకు ప్రత్తి ని చీడపీడల నుండి రక్షించవచ్చు.

Cotton Crop Nutrition
Bt ప్రత్తి లో రసాయన ఎరువులు ఏ సమయంలో, ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుందాం .
యూరియా, SSP, MOP:
ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వెసుకున్నట్లైతే ఒక ఎకరాకు 150 కేజీలు అనగా 3 బ్యాగుల ssp వేసుకోవాలి ఒకవేళ DAP వెసుకున్నట్లైతే 50 కేజీలు అనగా 1 బ్యాగు DAP వేసుకోవాలి. విత్తిన 20,40,60,80 రోజులప్పుడు యూరియా ఒక ఎకరాకు 25 కేజీల చొప్పున వేసుకోవాలి. విత్తిన 20,40,60,80 రోజులప్పుడు మ్యూరెట్ ఆఫ్ పొటాష్(MOP) ఒక ఎకరాకు 10 కేజీల చొప్పున వేసుకోవాలి. బెట్ట పరిస్థితులు కనిపిస్తే అలాంటి పరిస్థతుల్లో మొక్క భూమి ద్వారా పోషకాలను తీసుకోలేదు కాబట్టి పైపాటిగా యూరియా 10 -20 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మెగ్నీషియం:
ప్రత్తి పంటలో సాధారణం గా కనిపించే పోషక లోపం మెగ్నీషియం. ప్రత్తి లో మెగ్నీషియం లోపం విత్తిన 2 నెలల తరవాత కనిపించటం జరుగుతుంది. ముదురు ఆకులలో మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగు గా మారతాయి. ఆకుల ఈనెలు మాత్రమే ఆకుపచ్చగా ఉంటాయి. లోప తీవ్రత పెరిగినప్పుడు ఆకులు ఎర్రబారి, ఎండి రాలిపోతాయి. సాధారణం గా ఈ లోపం పొటాషియం ఎక్కువగా ఉన్న నెలలలో వస్తుంది.
మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ 7-10 రోజుల వ్యవధిలో పైరు వేసిన 45 మరియు 75 రోజుల తర్వాత 2 సార్లు పిచికారి చేయాలి.
బోరాన్ :
బోరాన్ లోపం ఉన్నప్పుడు పూల స్వరూపం మారి, ఆకర్షక పత్రాలు చిన్నవై లోపలకు ముడుచుకుపోతాయి. ఈ లోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశ లో ఎండిపోతుంది. ఆలాగే చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్క గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. అలాగే కాయ సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోతాయి, కాయ పెరిగే దశలో ఒక్కోసారి కాయపై నిలువుగా పగుళ్ళు ఏర్పడతాయి. సున్నం ఎక్కువగా ఉన్న నేలలలో , వర్షాభావ పరిస్థితుల్లో మరియు అధిక వర్షాలు ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. బోరాన్ లోప నివారణకు బోరాక్స్ 1-1.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Environmental Impacts of Rice Cultivation: వరి పంట వల్ల కాలుష్యం ఎలా పెరుగుతుంది.?