Chilli Nursery Management: ఇరు తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే వివిధ రకమైన వాణిజ్య పంటల్లో మిరప పంట ముఖ్యమైనది. ప్రస్తుతం రైతులు మిరప పోసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ తరుణంలో నారుమళ్లు పోసే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.
మిరప నారుమళ్లలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
. మిరప పంట సాగుకు మంచిగా మురుగు నీరు పోయే వసతి గల నేలలు మరియు మంచి గాలి, వెలుతురు తగిలే నేలలు అనుకూలంగా ఉంటాయి.
. నీరు పోయే వసతి లేని నేలలు మంచివి కావు. దీనివలన ఆకులు రాలిపోవడం కాయలు రాలిపోవడం మరియు మొక్క వడలిపోయినట్లు ఉండే అవకాశాలు ఉంటాయి.
. వర్షాధార పంటకు బరువైన నేలలు మరియు నీటి ఆధారపు పంటకు చెల్క నేలలు, లంక భూములు ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం.
. ఎకరానికి 10 టన్నుల చివికిన పశువుల ఎరువును వేసి మెత్తగా కలియదున్నాలి.
. సెంటు నారుమడికి సూటి రకాల విత్తనం 650 గ్రాములు లేదా హైబ్రిడ్ రకాలు అయితే 100 గ్రాముల విత్తనం వాడినట్లయితే ఎకరాకు సరిపడే నారు వస్తుంది.
. ఎత్తైన నారుమళ్ళలో నారును పెంచుకోవాలి. ఒక ఎకరాకు సరిపడే నారు కోసం ఒక మీటరు వెడల్పు, 40 మీ.లు పొడవు, 15 సెం.మీ. ఎత్తుతో, చుట్టూ 30 సెం.మీ.ల వెడల్పు గల కాలువలు ఏర్పాటు చేసుకొని నారుమళ్లను తయారు చేసుకోవాలి.
Also Read: చేప పిల్లల పెంపకంలో పాటించవలసిన మెళకువలు.!
. మిరపలో విత్తన శుద్ధి చాలా కీలకం. మిరపలో వైరస్ తెగులు నివారణకు 150 గ్రా. ట్రై సోడియం ఆర్థోఫాస్పేట్ ను ఒక లీటరు మంచి నీటిలో కరిగించి దీనిలో విత్తనాన్ని 20 నిమిషాలు నానబెట్టి, నీరు తీసి, కడిగి విత్తనాన్ని నీటిలో ఆరనివ్వాలి.
. ఆ తరువాత ఇదే విత్తనానికి రసం పేలిచే పురుగుల నివారణకు (నల్లి తప్ప) ఇమిడాక్లోప్రిడ్ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించాలి.
. తెగుళ్ల నివారణకు, ఇదే విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్, చివరగా ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రం పొడిని 5-10 గ్రా. కిలో విత్తనానికి పట్టించి నారుమడిని విత్తుకోవాలి.
. సెంటు నారుమడికి విత్తే ముందు 1.5 కిలోల భాస్వరం, ఒక కిలో వేప పిండి వేసుకోవాలి.
. విత్తనాన్ని నారుమడి మీద పలుచగా విత్తుకోవాలి. విత్తనాలు చల్లిన తరువాత మట్టిని తిరగగొట్టి 1 లేదా 1.5 సెం.మీ. లోతుకు విత్తనం పోవునట్లుగా చేసి మెత్తని పశువుల ఎరువుల పొడిని పైకప్పుగా వేస్తే మొలకశాతం పెరుగుతుంది.
. మొలక వచ్చిన వారం తరువాత నారుకుళ్ళు రాకుండా మెటలాక్సిల్ 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 3 సార్లు నారుమడిపై పిచికారి చేయాలి.
. ప్రోట్రేలలో మిరప నారు పెంచుకున్నట్లయితే నారు దృఢంగా పెరగడంతో పాటు నారుకుళ్లు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
. నారు మడిలో పై ముడత ఆశించకుండా 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు సెంటు నారుమడికి వేసుకోవాలి.
. సాధారణ రకాలకు 40 – 45 రోజుల వయస్సు గల నారు, హైబ్రిడ్ రకాలకు ఇప్పటి నుంచి 30-35 రోజుల వయస్సు గల నారు నాటడానికి అనువుగా ఉంటుంది.
ఈ విధంగా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి నారుమడిని పెంచుకొని, దృఢమైన మేలైన నారు రావడానికి అవకాశం ఉంటుంది.
Also Read: కొబ్బరి పంటను ఆశించే రుగోస్ తెల్లదోమ నష్టాలు – యాజమాన్య పద్ధతులు