Crops Under Rainy Conditions: తెలంగాణలో ఆగస్టులో దాదాపుగా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతంలో 50 శాతం పైగా లోటు వర్షపాతం నమోదయ్యింది. కావున ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బెట్ట, పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడడం వల్ల వివిధ పంటల్లో చీడ పీడలు మరియు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది అదే విధంగా పూత, కాత దశలో ఉన్న పత్తి, మొక్కజొన్న మరియు శాఖీయ పెరుగుదశలో ఉన్న ఇతర వ్యవసాయ పంటల దిగుబడులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు కొన్ని మెళకువలు పాటించాలి.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. మంచి దిగుబడులు రావడానికి పూత మరియు కాత దశలు కీలకం కావున పూత దశలో ఉన్న ప్రత్తి మరియు మొక్కజొన్నపంటలకి నీటి వసతి ఉన్న రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటూ బిందు సేద్య పద్దతిలోగాని, తుంపర సేద్య పద్దతిలోగాని నీటి తడులు ఇవ్వాలి.
. సాధారణ పద్దతిలో కాలువల ద్వారా నీటి తడులు ఇచ్చే రైతులు చాలు విడిచి చాళ్ళలో నీటి తడులు ఇచ్చినట్లయితే కొంతవరకు నీటిని పొదుపు చేయడంతో పాటు అధిక విస్తీర్ణంలో పంటకి నీటి తడులు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది.
. మొక్కజొన్న పంట నీటి ఎద్దడిని తట్టుకోదు కావున నీటి వసతి లేని రైతులు పంట దెబ్బతినకుండా పంటపై పైపాటుగా లీటరు నీటికి 10.0 శాతం డైఅమ్మోనియం ఫాస్పేట్‌ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
Also Read: మిరపను ఆశించే కొత్త రకం తామర పురుగులు – యాజమాన్యం
. బెట్ట పరిస్థితుల్లో ముఖ్యంగా పత్తి పంటలో రసంపీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక ఉధృతి అధికమయ్యే అవకాశం ఉంటుంది. కావున రైతులు ఉధృతిని బట్టి లీటరు నీటికి 0.2 శాతం ఎసిటామిప్రిడ్ లేదా 2.0 శాతం పిప్రోనిల్ లేదా 0.3 శాతం ప్లోనికామైడ్ వంటి మందులని మార్చి, మార్చి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
. బెట్ట పరిస్థితుల్లో కాత దశలో ఉన్న పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల గుడ్డి పూలు ఏర్పడడం, కాయను ఆశిస్తే పత్తి నాణ్యత తగ్గే అవకాశం ఉంది కావున రైతులు పురుగు నష్ట పరిమితి దాటిన వెంటనే 5% వేప గింజల కాషాయం లేదా లీటరు నీటికి 5.0 శాతం వేపనూనెను (1500 పిపియం) పిచికారి చేయాలి. తరువాత పైపాటుగా లీటరు నీటికి 2.0 శాతం క్వినాల్ ఫాస్ లేదా 2.0 శాతం ప్రొఫెనోపాస్ లేదా 1.5 శాతం థయోడికార్బ్ లేదా 0.4 శాతం ఇమామెక్టిన్ బెంజోయెట్ మందుని పిచికారి చేయాలి.
. బెట్ట వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో పచ్చదోమ మరియు ఆకుముడుత ఆశించే అవకాశం ఉంది కావున పచ్చదోమ నివారణకి లీటరు నీటికి 0.4 శాతం డైఫ్యూరాన్ లేదా 1.6 శాతం బ్యూప్రోజిన్ మందును మరియు ఆకుముడుత నివారణకి లీటరు నీటికి 2.0 శాతం కార్టాప్ హైడ్రాక్లోరైడ్ మందుని పిచికారి చేయాలి.
. పెసర పంటలో బెట్ట పరిస్థితులు ఎక్కువకాలం ఉన్నప్పుడు తెల్లదోమ ఉదృతి అధికమై తద్వారా పల్లాకు తెగులు వ్యాప్తిస్తుంది. కావున తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 0.2 శాతం ఎసిటామిప్రిడ్ మందుని పిచికారి చేయాలి.
. వేరుశనగ పంటలో బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఆకుముడుత ఆశించే అవకాశం ఉంది కావున ఆకుముడుత నివారణకి లీటరు నీటికి 2.5 శాతం క్లోరోపైరిఫాస్ లేదా 1.5 శాతం ఎసిఫేట్ మందుని పిచికారి చేయాలి.
. బెట్ట పరిస్థితుల్లో పంటలు కొంత వరకు దెబ్బతినకుండా పైపాటుగా అన్ని వ్యవసాయ, ఉద్యాన మరియు కూరగాయల పంటలపై లీటరు నీటికి 10.0 శాతం డై అమ్మోనియం ఫాస్పేట్ లేదా 2 % యూరియా అంటే లీటరు నీటికి 20.0 శాతం కలిపి పిచికారి చేయాలి. వీలుని బట్టి లీటరు నీటికి 5.0 శాతం నుండి 10.0 శాతం 19-19-19 లేదా 28-28-0 లేదా 13-0-45 లేదా సూక్ష్మ పోషకాలు పిచికారి చేసుకోవాలి.
Also Read: సాగు చేయబడని ఆకు కూరలతో ఎన్నో ప్రయోజనాలు.!