Bamboo Cultivation – వెదురు : రైతులకు ఒక వరప్రసాదం – ఆధునిక వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు నాణ్యమైన వెదురు ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. కావున మేము పర్యావరణ అనుకూలమైన వివిధ విలువ ఆధారిత వెదురు రకాలను ఉపయోగించడం ప్రారంభించాము. పురాతన కాలం నుండి మానవ దైనందిన జీవితంలో వివిధ ఉపయోగాలు ఉండి సంస్కృతితో ముడిపడి ఉన్న వెదురు, వేగంగా పెరుగుతున్న గడ్డిజాతికి చెందిన వృక్షాకార మొక్కలు. ప్రపంచవ్యాప్తంగా 90 ప్రజాతులు, 1,200 జాతులు, భారతదేశంలో 148 జాతులు, 6 ఉపజాతులు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టం నుండి 3,600 మీటర్ల ఎత్తులో గల వివిధ అటవీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు మరియు నదుల ఒడ్డున ఈ వెదురు విస్తారంగా పెరుగుతుంది.
ఆధునిక వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలకు నాణ్యమైన వెదురుకు గిరాకీ పెరగడంతో పాటు పర్యావరణ అనుకూలమైన విలువ ఆధారిత వెదురు రకాల వినియోగం వైపు ఆధునిక మానవ ప్రయత్నంతో వెదురు ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. అలాగే దిగుబడి కూడా గ్యారెంటీ కావడంతో, ప్రతి సంవత్సరం చాలా మంది వెదురు మొక్కల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కేరళతో పోలిస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో చాలా మంది వివిధ రకాల వెదురును సాగు చేస్తున్నారు. దీనితో వెదురు సాగు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
భారతదేశంలో వార్షిక వెదురు ఉత్పత్తి 14.6 మిలియన్ టన్నులు, అయితే వీటిలో ఎక్కువభాగం కాగితం గుజ్జు పరిశ్రమ ప్రయోజనాలకోసం వినియోగిస్తున్నారు. అంతేకాకుండా వెదురును వివిధ అవసరాలకు ప్రత్యేకించి కలపకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వెదురు మొక్కల సాగుకి ఇప్పటికీ గిరాకీ తగ్గలేదని చెప్పవచ్చు. అలాగే వెదురును ఇంకా, ప్యానెల్లు, ఫ్లోరింగ్, వెదురును ఫర్నిచర్, అగర్బత్తీల తయారీ, కర్టెన్లు, ఆహార పదార్థాలు, గృహనిర్మాణం, వస్త్ర పరిశ్రమ, చార్కోల్ (బొగ్గు) ఉత్పత్తి, కాగితం గుజ్జుపరిశ్రమ, హస్తకళలు, సౌందర్య సాధనాలు, సాంప్రదాయ ఆభరణాలు మరియు సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇలా వివిధ అవసరాలకోసం 26.69 మిలియన్ టన్నుల వెదురు అవసరం కాగా, 13.47 మిలియన్ టన్నులు మాత్రమే లభ్యమవుతుంది. దీన్ని బట్టి పారిశ్రామిక ప్రాతిపాదికన వెదురు పెంపకానికి గల ప్రాధాన్యత మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
భారతదేశంలో, గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద మరియు చిన్న 25,000 వెదురు ఆధారిత పరిశ్రమల ద్వారా 20 మిలియన్ల మంది జీవనోపాధిని పొందుతున్నారు. సగటు అంచనాల ప్రకారం, 1 టన్ను వెదురు ఉత్పత్తికి 350 పనిదినాలు పడుతుంది మరియు దీనివల్ల ఏటా హెక్టారుకు 1`3 టన్నుల వెదురు సహజ అడవుల నుండి మాత్రమే లభిస్తుంది. అయితే నిర్వహించబడే వెదురు తోటల నుండి రకాన్ని బట్టి 5-10 టన్నుల వరకు మరియు చైనా వంటి దేశాలలో అధునాతన వ్యవసాయ పద్దతుల ద్వారా 50 టన్నుల వరకు వెదురును సేకరించడం సాధ్యమైనది.
Also Read: శనగ పంట సాగులో మెళకువలు.. అధిక దిగుబడులు.!
వాణిజ్యపరమైన వెదురు సాగు :
వెదురు జాతులను వ్యాపార పంటగా పండిరచేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి లభ్యతను బట్టి ఒక ఎకరా నుంచి 100 హెక్టార్ల వరకు వెదురు తోటలను ఏర్పాటు చేసుకోవచ్చు. కొంచెం వాలుతో చదునుగానూ, తేమగానూ ఉండి, నీరు నిలబడని మరియు బలమైన గాలులు లేని ప్రాంతాల్లో ఉన్న నేలలు వెదురు సాగుకు ఉత్తమం అని చెప్పవచ్చు. వెదురు మొక్కల వేర్లు లేదా రైజోమ్లు, పోషకాలు మరియు నీటి కోసం ఇతర పంటలతో పాటు పోటీ పడగలవు కాబట్టి వెదురు తోటలు మరియు ఇతర పంట పొలాల మధ్య 4 అడుగుల లోతు మరియు 3 అడుగుల వెడల్పుగల సాళ్లను సిఫార్సు చేస్తారు. సంవత్సరంలో వర్షాలు కురిసే 2-3 నెలల ముందు, స్థలాన్ని ఎన్నుకొని వెదురు పంటను నాటుకోవడం శ్రేయస్కరం.
సాగుకు అనువైన రకాలు :
ఇక్కడ సాధారణ వినియోగం మరియు అధిక మార్కెట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న వెదురు రకాలుగా….. బాంబుసా బాంబోస్, బాంబుసా న్యూటన్స్, బాంబుసా పల్లెడ, బాంబుసా బాల్కోవా, బాంబుసా పాలిమార్పా, బాంబుసా తుల్దా, డెండ్రోకలామస్ స్ట్రిక్టస్, డెండ్రోకలామస్ లాంగిస్పెథస్, డెండ్రోకలామస్ ఆస్పర్, డెండ్రోకలామస్ జైగంటియస్, డెండ్రోకలామస్ స్టోక్సీ, డెండ్రోకలామస్ బ్రాందీసీ, థైరోస్టాకిన్ ఒలివేరి, గొదువ అంగుస్టిఫోలియా మొదలైన వాటిని వాణిజ్యపరమైన వెదురు సాగుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
అయితే నేలస్వభావం, వెదురు పెరుగుదల పద్ధతి మరియు వాటి తృణకాండాల ఏర్పాటు మధ్య గల కారణాలను దృష్టిలో ఉంచుకొని వెదురు నాటేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి. కొన్ని రకాల వెదురు మొక్కలు పుష్పాలు ఏర్పడిన తరువాత గుంపులు గుంపులుగా చనిపోతాయి. కాబట్టి వెదురు నాటడానికి ఉపయోగించే విత్తనాలు మరియు మొలకలు మంచి నాణ్యతను కలిగి ఉండాలి మరియు వాటి నిజ జనన సంబంధిత ప్రాంతాల నుండి సేకరించాలి. అలాగే తోటలో రెండు లేదా మూడు రకాలను ప్రత్యామ్నాయంగా నాటుకోవచ్చు. వెదురు మొక్కల ఉత్పత్తి ప్రధానంగా, విత్తనాల అంకురోత్పత్తి ద్వారా జరుగుతుంది. అయితే కొన్ని వెదురు జాతి మొక్కలకు విత్తనాలు అందుబాటులో లేనందున హార్మోన్ ఆధారిత శాఖీయ వర్ధనం లేదా కణజాలవర్ధనం ద్వారా ఉత్పత్తి చేయబడిన మొలకలని విత్తు నాటడానికి ఉపయోగించవచ్చు.
ఇతర వ్యవసాయ పంటల వలే, వెదురు సాగుకి తెగుళ్ల నియంత్రణ, నీటిపారుదల, ఎరువులు మరియు నర్సరీ పడకల నుండి మొలకలను సకాలంలో మార్పిడి చేయడం వంటి నిర్వహణ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
సాధారణంగా వెదురును 5I5 మీటర్ల దూరంలో నాటవచ్చు. కానీ ఆనములా (డెండ్రోకలామస్ జైగంటియస్), బిలాతి (డెండ్రోకలామస్ బ్రాందీసీ), వంటి పెద్ద వెదురు జాతులకు 10I10 మీటర్ల దూరం సరిపోతుంది. ఈ జాతులను సాగు చేస్తున్నప్పుడు ఇతర జాతులతో పోలిస్తే హెక్టారుకు నాటిన వెదురు మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ దూరంలో నాటిన వెదురు సమూహాలు గరిష్ఠ పెరుగుదల మరియు మంచి దిగుబడిని సాధించగలవు. రైజోమ్లను నాటేటప్పుడు గుంతల పరిమాణం రకాన్ని బట్టి 60I60I60 సెం. మీ. నుండి 100 I100 I 100 సెం. మీ. వరకూ, అలాగే మొలకలను నాటేటప్పుడు 30I30I30 సెం. మీ. లేదా 45I45I45 సెం. మీ. ఉండేలా చూసుకోవాలి.
అంతర పంటలు :
వెదురు మొలకలు పెరిగి మరియు పందిరి (నీడ) ఏర్పరచడానికి ముందే అంతర పంటలు వేసుకోవచ్చు. అయితే ఈ అంతర పంటలు వెదురును అధిగమించకూడదు లేదా వెదురు కంటే ఎక్కువ పోషకాలను గ్రహించకూడదు. మొదటి రెండు సంవత్సరాలలో, సులభంగా దిగుబడినిచ్చే మరియు నీడలో పెరిగే మూలికలు అనగా అల్లం, పసుపు, మరియు వర్షకాలం చివరిలో టమోటాలు, మొక్కజొన్నలను సాగు చేయవచ్చు. తరువాత సంవత్సరాలలో వెదురు మొక్కల వేగవంతమైన పెరుగుదల కారణంగా, అంతర పంటలు వేయడం సరికాదు. కొన్ని రకాల వెదురుసాగులో సోయాబీన్, ఆవాలు, రాగులు, చిక్ పియా మరియు గోధుమలు కూడా పండిస్తారు.
డెండ్రోకలామస్ స్టోక్సీ (ఉయిములా) అనేది అత్యంత వాణిజ్య ప్రాముఖ్యత కలిగివున్న వెదురుజాతి. ఈ మొక్కలను మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా సాగు చేస్తున్నారు. దీనికి ఫర్నిచర్ పరిశ్రమలో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. కనుక ఈరకమైన వెదురు సాగుకు ఒక హెక్టారు భూవిస్తీర్ణంలో దాదాపు 625 మొలకలను 4I4 మీటర్ల దూరంలో నాటుకోవచ్చు. ఒక హెక్టారు సాగు భూమి తయారీ, మొక్కల పెంపకానికి అయ్యే ఖర్చులు, ఎరువుల వాడకం మరియు నీటిపారుదల వంటి అన్ని ప్రారంభ ఖర్చులతో కలిపి 1.5 లక్షల రూపాయల వరకూ మనం పెట్టుబడిగా భావించితే, వచ్చే నాల్గవ సంవత్సరం నుండి 2.2 లక్షల రూపాయలను ఆదాయంగా పొందవచ్చు.
Also Read: రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్, పగటిపూట మాత్రమే.!