Jasmine Farming: మల్లె భారతదేశంలో బహిరంగ క్షేత్ర పరిస్థితులలో వాణిజ్యపరంగా పండిస్తారు. మల్లెల విజయవంతమైన సాగుకు సరైన అవసరాలు తేలికపాటి శీతాకాలం, వెచ్చని వేసవి, మితమైన వర్షపాతం మరియు ఎండ రోజులు. మల్లెలు 1200 మీటర్ల వరకు బాగా పెరుగుతాయి. 800 నుండి 1000 మిమీ వరకు బాగా పంపిణీ చేయబడిన వార్షిక వర్షపాతం పెరుగుదల మరియు అభివృద్ధికి అనుకూలమైనది.
రకాలు: మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతరమల్లె, గుండుమల్లె మరియు బొడ్డుమల్లె పూల రకాలు కలవు.
నాటటం: మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్ డిసెంబరు వరకు ఎప్పుడైనా నాటవచ్చు. సాయంత్ర సమయాన నాటడం వలన మొక్క బాగా అతుకుతుంది.
అంటు మొక్కలను వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 1.25-2.00 మీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి. కొమ్మ కత్తిరింపుల ద్వారా గాని, అంటు మొక్కలు తొక్కడం (లేయరింగ్) ద్వారా గాని ప్రవర్ధనం చేస్తారు.
కత్తిరింపులు: మల్లె తోటలో లేత చిగుర్ల నుంచే పూలు వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఆకును రాల్చడం మరియు కొమ్మ కత్తిరింపులు తప్పని సరిగా చేపట్టాలి. కొమ్మలు కత్తిరించడానికి 10-15 రోజుల ముందు నీరు కట్టడం ఆపేయాలి.
ఎరువులు:
ప్రతి మొక్కకు 8-10 కిలోల పశువుల ఎరువుతోబాటు 60-120 గ్రా. నత్రజని, 120 గ్రా. భాస్వరం మరియు 120 గ్రా.పొటాష్ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. తదుపరి సూచించిన మోతాదును దఫాలుగా వేయటం మంచిది.
నీటి యాజమాన్యం: కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టటం వలన మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8-10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ ద్వారా కూడ నీటి సదుపాయం కల్పించవచ్చు.
సస్యరక్షణ – పురుగులు :
మొగ్గతొలుచు పురుగు : పురుగు యొక్క లార్వా, పువ్వు మొగ్గల్లోనికి చొచ్చుకొని పొయి పూల భాగాలను తినివేస్తూ తీవ్ర దశలో మొగ్గలన్నిటిని ఒక దగ్గరికి చేర్చి ముడుచుకు పోయేటట్లు చేస్తుంది. నివారణకుగాను మలాధియాన్ లెక ఎండోసల్ఫాన్ లీటరు నీటికి 2 మి.లీ మందును కలిపి చెట్లపై పిచికారి చేయాలి.
నల్లి: ఈ పురుగు ఉధృతి పొడివాతావరణంలో ఎక్కువగా వుంటుంది. పురుగులు ఆకు అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడంవల్ల ఆకులు పసుపురంగుకు మారి రాలిపోతాయి. నివారణకుగాను గంధకపు పొడిని ఎకరాకు 8 10 కిలోల చొప్పున చల్లుకోవాలి.
Also Read: మల్లె సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు..
ఆకు ఎండు :ఈ తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారుతాయి, ఆకుపై భాగంలో ఎరుపురంగు మచ్చలు ఏర్పడతాయి. తీవ్రదశలో 50 శాతం వరకు దిగుబడి తగ్గుతుంది. నివారణకు మాంకొజెబ్ 3 గ్రా. లేక కార్బండైజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎండుతెగులు : తెగులు తొలిదశలో మొక్కక్రింది భాగం ఆకులు ఎండిపోతాయి. అటుపిమ్మట పైభాగాన వున్న ఆకులు కూడా ఎండి రాలిపోతాయి. తీవ్రదశలో మొక్కంతా ఎండి చనిపోతుంది. నివారణకు మొక్కల చుట్టూ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి చొప్పన కలిపి భూమిని తడపాలి
కోత మరియు దిగుబడి:
పూల దిగుబడి పెంచుటకు లీటరు నీటికి 2.5 గ్రా.ల జింక్ సల్ఫేట్, 5 గ్రా.ల మెగ్నీషియం సల్ఫేట్ సూక్ష్మధాతువులను కలిపి రెండు, మూడు ధఫాలుగా పిచికారి చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి షుమారు 3-4 టన్నుల దిగుబడి పొందవచ్చు.
Also Read: మల్లె సాగులో మెళుకువలు..