Soya Bean Cultivation: ఈ పంటకు కావలసిన విత్తనాన్ని ఎక్కువగా మధ్యప్రదేశ్ నుండి మరియు కొంత మన రాష్ట్రంలోను పండించటం జరుగుతుంది.సోయాచిక్కుడులో ప్రధానంగా విత్తనం మొలక శాతాన్ని త్వరగా కోల్పోతుంది. సంవత్సరం పైబడిన విత్తనం మొలకశాతాన్ని ఎక్కువగా కోల్పోతుంది.
విత్తనోత్పత్తి:
- ఈ పంటలో ఖరీఫ్‌లో పండిన విత్తనాన్ని మరల ఖరీఫ్ వరకు నిల్వ చేసి విత్తనానికి వాడటం వలన కూడా మొలక శాతం కొంత తగ్గుతుంది.
- కావున ఈ పంటలో విత్తనోత్పత్తిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలి. మరీ ముఖ్యంగా విత్తనాన్ని తేమ 7 శాతం వచ్చే వరకు ఆరబెట్టి పాలిథీన్ బ్యాగులలో నిల్వ చేయాలి. గోనె సంచి / బట్ట సంచులు వాడినప్పుడు తేమ శాతం 10 – 12 మధ్య వుండాలి.
- ఇది స్వల్పకాలిక (4 నెలలు) పంట మరియు ఖరీఫ్‌లో సాగు చేసే పంట.
- ఈ పంట పూర్తిగా స్వపరాగ సంపర్కానికి చెందినది. కాబట్టి దీనిలో విత్తనోత్పత్తి చాలా తేలిక.
- ఈ పంట విత్తనోత్పత్తికి వేరే సోయా రకాల నుండి మరియు ఇతర పంటల నుండి 3 మీ. ఎడబాటు /ఐసోలేషన్ పాటించాలి.
- విత్తనోత్పత్తికి నాణ్యమైన బ్రీడర్ / మూల విత్తనాన్ని వాడాలి. ఎకరానికి 30 కిలోల విత్తనాన్ని విత్తనశుద్ధి (తెగుళ్ళు, పురుగుల మందులతో) చేసి, వరుసల మధ్య దూరం 30-45 సెం.మీ. ఉండేలా మరియు మొక్కల మధ్య దూరం 10 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి.
- విత్తనోత్పత్తి క్షేత్రానికి సిఫారసు చేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరకువులను అందించాలి.
- విత్తనోత్పత్తిని నీటి వసతి వున్నచోట మాత్రమే చేపట్టి అవసరం వున్న దశలో నీటిని ఇవ్వాలి. అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి.
- విత్తన పంటలో కలుపు నివారణ, అంతర కృషి, ఎరువులు, సస్యరక్షణ మొదలగు అన్ని పనులను సకాలంలో చేపట్టి నాణ్యమైన అధిక దిగుబడులను పొందాలి.
- విత్తనోత్పత్తిలో ప్రధాన ప్రక్రియ-పంటలో ఎప్పటికప్పుడు వివిధ దశలలో కేళీలను / బెరుకులను (ఆ రకానికి చెందని ఇతర మొక్కలు) గుర్తించి, ఏరివేయుట / నిర్మూలించుట చేయాలి.
Also Read: వర్షధార వ్యవసాయంలో నూనె గింజల సాగు – ప్రాముఖ్యత
- పంట పెరిగే దశ (శాఖీయదశ), పూత సమయం, కాయ తయారవుతున్నప్పుడు మరియు కాయ బాగా అయిన తర్వాత దశలలో ఈ బెరుకులను తీసే పనిని చేపట్టాలి.
- బెరుకులు/కేళీలు (ఆఫ్ టైప్స్) ప్రధాన పంట/రకంతో పోల్చినప్పుడు మొక్కల ఎత్తులో తేడా వుండటం, పూల రంగు (తెలుపు/ఊదా/ఇతరములు) వేరుగా వుండటం, కాయ సైజు, కాయపై నూగు, కాయలలో గింజల సంఖ్య, గింజ రంగులో తేడా వుండటం గమనించవచ్చును. ఇలా తేడా వున్న మొక్కలను గుర్తించి, విత్తన క్షేత్రం నుండి వేరు చేసి పూర్తిగా నిర్మూలించాలి.
- చివరగా పంటకోత, సరిగా ఎండబెట్టుట, శుభ్రమైన విత్తనాన్ని తయారు చేయుట మరియు శుభ్రమైన/కొత్త సంచులలో విత్తనాన్ని నిల్వ చేయుట మొదలగునవన్నీ ఆచరించి విత్తనం ఎక్కడ కల్తీ కాకుండా చూసుకోవాలి.
- అన్ని ప్రమాణాలు పాటించి తయారు చేసిన విత్తనం 98% స్వచ్ఛతను (వేరే విత్తనం లేకుండ వుండుట), కనీసం 70% పైగా మొలకశాతాన్ని, అతి తక్కువ కలుపు మొక్కల విత్తనాన్ని (5/ఇంకా తక్కువ కిలో విత్తనానికి), 10-12 శాతం తేమ (బట్ట / గోనె సంచిలో నిల్వకు) లేదా 7శాతం తేమ (గాలి సోకని పాలిథీన్ / ప్లాస్టిక్ బ్యాగులలో నిల్వ చేయుటకు) కలిగి వుండాలి. అప్పుడే మంచి విత్తనాన్ని వచ్చే పంటకు అందించగలం
Also Read: సోయాచిక్కుడు లో ఎరువుల యాజమాన్యం
Leave Your Comments