Paddy Cultivation: సారవంతమైన, చదునైన, సులభంగా నీరు బయటకు పోవడానికి భూములలో తక్కువ నీటితో తక్కువ సస్యరక్షణ వ్యయంతో అధిక దిగుబడులను సాధించగల వరి సేద్య విధానమే ‘శ్రీ’ సేద్యం.శ్రీ వరిసాగు పద్ధతిలో తక్కువ ఖర్చు మరియు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు ఇది లాభసాటి పద్ధతి. శ్రీ వరిసాగు పద్ధతి 1980 దశకంలో మడగాస్కర్ దేశంలో మొదలైంది. 1997 వరకు ఇతర దేశాలకు ఈ పద్ధతి గురించి తెలియదు. ప్రస్తుతం శ్రీ వరిసాగు పద్ధతి చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాల్లో సుమారు 50,000 మంది రైతులు వారి పొలాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
గత సంవత్సరం శ్రీలంకలో 18 జిల్లాల్లోని రైతులు శ్రీ వరిసాగు పద్ధతి ద్వారా వరిలో రెట్టింపు దిగుబడులు సాధించగలిగారు.
ఏప్రిల్ 2002లో చైనాలో శ్రీ వరిసాగు పద్ధతి మీద అంతర్జాతీయ సదస్సు కూడా జరిగింది. శ్రీ వరిసాగు పద్ధతిలో పెట్టుబడి తక్కువ. ఎకరం వరి నాటటానికైన 2 కిలోల విత్తనం సరిపోతుంది. సాధారణ పద్ధతుల్లో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరం. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువ. శ్రీపద్ధతి వరి పైరు సహజంగా పెరగడానికి దోహదపడుతుంది కాబట్టి వరి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది, లోతుకు చొచ్చుకుపోయి, భూమి లోపలి పొరలనుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి.
Also Read: చెరువుల్లో ఉండే గుర్రపుడెక్క యాజమాన్యం.!
సాధారణ సాగు పద్ధతిలో మూడు దుబ్బులను కలిపి పీకడానికి 28 కిలోల శక్తి కావలసి వస్తే శ్రీ పద్ధతిలో సాగు చేసిన ఒక వరి దుబ్బును పీకడానికే 58 కిలోల శక్తి అవసరం అవుతుంది. పిలకలు 30 నుండి 100కి పైగా వచ్చి బలంగా ఉంటాయి. దుబ్బులోని పిలకలన్నీ ఒకేసారి ఈని, పెద్ద పెద్ద కంకులు వస్తాయి. కంకులలో 400 వరకు నిండైన గింజలు ఉంటాయి. పైరు పడిపోదు. చీడపీడలను కూడా తట్టుకోగలుగుతుంది. వరి బాగా పెరిగి ఎక్కువ దిగుబడి నివ్వాలంటే పొలంలో ఎప్పుడు నీరు నిలువ ఉండాలని రైతులు భావిస్తారు. కాని వరి నీటిలో బ్రతకగలదు కాని అది నీటి మొక్క కాదు. పొలంలో నీరు నిల్వ ఉన్నప్పుడు వరి వేళ్లలో గాలి సంచులు తయారు చేయటానికి చాలా శక్తిని వినియోగిస్తుంది. అంటే, ధాన్యం తయారుచేయటానికి ఉపయోగపడాల్సిన శక్తి గాలి సంచులు తయారు చేసి తద్వారా బ్రతకడానికి వాడుకుంటుంది. అంతేగాక వరిలో పూతదశకు వచ్చేటప్పటికి 70 శాతం వేర్ల కొసలు కృశించి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి. శ్రీ పద్ధతిలో చిరుపొట్ట దశ వరకు వరి పొలంలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. ఆ తరువాత ఒక అంగుళం లోతులో మాత్రమే నీరు అందిస్తారు. కాబట్టి ఈ పద్ధతిలో సాధారణంగా వరి పండించటానికి అవసరమయ్యే వీటిలో సగం నుండి మూడోవంతు నీటితోనే శ్రీ పద్దతి ద్వారా వరి సాగు చేయవచ్చు.
Also Read: నీటిని ఆదా చేసే మార్గాలు