జాతీయంవార్తలు

Primary Agricultural Cooperative Societies: సహకారం భారతీయ సంస్కృతిలో భాగమే- అమిత్ షా

1
Primary Agricultural Cooperative Societies

Primary Agricultural Cooperative Societies: కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త సహకార విధానాన్ని రూపొందిస్తుందని, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Sha) స్పష్టం చేశారు. దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని తేల్చిచెప్పారు. కేంద్ర హోం మంత్రిగా కూడా ఉన్న షా, రాబోయే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల Primary Agricultural Cooperative Societies (PAC) సంఖ్యను 3 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం, దాదాపు 65,000 పీఏసీలు క్రియాశీలంగా ఉన్నాయి.

Primary Agricultural Cooperative Societies

ప్రభుత్వం సహకార ఉమ్మడి సేవా కేంద్రాలు, జాతీయ సహకార విశ్వవిద్యాలయంతో పాటు జాతీయ డేటాబేస్‌ ఏర్పాటుకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన తొలి జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. వివిధ సహకార సంఘాల ప్రతినిధులు 2,100 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా, మరో 6 కోట్ల మంది ఆన్‌లైన్‌లో పాలుపంచుకున్న సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… సహకార సంఘాల అంశం రాష్ట్ర జాబితాలోని విషయం. అయినా కేంద్రప్రభుత్వం కొత్తగా ఈ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేసిందని ఆశ్చార్యపోతున్నారు. దీనిపై వాదనకు దిగడం నాకు ఇష్టం లేదు. దానికి చట్టపరమైన ప్రతిస్పందనే జవాబు. కేంద్రం, రాష్ట్రాలకు సహకరిస్తుంది. ‘ఎటువంటి ఘర్షణ ఉండదు. ‘సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తాం. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికీ, ఆధునీకరించడానికీ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. పోటీ వాతావరణంలో సహకార సంఘాలు మనుగడ సాగించాల్సిన అవసరం ఉంది. పురోగతి బాటలో ఉన్న ఇండియా 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకునేందుకు, త్యాగాలను స్మరించుకోవడానికి ప్రభుత్వం ‘‘జాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త సహకార విధానాన్ని తీసుకురాబోతున్నాం. 2002లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఒక విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బహుళ రాష్ట్ర సహకార చట్టాన్ని (మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ యాక్ట్‌) సవరించడంతోపాటు దేశంలోని పీఏసీలను ఆధునీకరణ, డిజిటలైజ్‌ చేయడం వంటివి చేయబోతోంది. ప్రతి గ్రామంలో ఒక పీఏసీ ఉండాలని మేం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వచ్చే ఐదేళ్లలో పీఏసీల సంఖ్యను 3 లక్షలకు పెంచుతాం.

Also Read: వ్యవసాయం ప్రమాదకరమైన భవిష్యత్లోకి వెళుతోంది: అమిత్ షా

ప్రతి పది గ్రామాలకు ఓ పీఏసీ…
ప్రస్తుతం దేశంలో ప్రతి 10 గ్రామాలకు ఒక పీఏసీ (ప్రైమరీ అగ్రికల్చర్‌ కో`ఆపరేటీవ్‌ సొసైటీ) మాత్రమే ఉంది. వాటిని కంప్యూటరీకరించడానికి ఒక పథకాన్ని రూపొందించేలా కార్యాచరణ ప్రకటించాం. జిల్లా సహకార బ్యాంకు, నాబార్డ్‌తో పీఏసీల అకౌంటింగ్‌ వ్యవస్థను అనుసంధానం చేయడానికి స్థానిక భాషల్లో సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తాం. పీఏసీలను రైతు ఉత్పత్తి సంస్థలుగా (ఎఫ్‌పీవోలు) రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పీఏసీలను ప్రొఫెషనల్‌గా మార్చాల్సిన అవసరం ఉంది. దీని కోసం సభ్యుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడతాం. సహకార పరపతి సంఘాలు కూడా బలోపేతం చేసేలా చర్యలు చేపడతాం. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. ప్రాధాన్యత రంగంగా గుర్తించి రుణాలలో పీఏసీల పాత్రను మెరుగుపరుస్తాం. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన ఇతర చర్యలలో, సహకార ఉమ్మడి సేవా కేంద్రాలు, జాతీయ డేటాబేస్‌, జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించి కృషి చేస్తుంది. సహకార సంఘాలు ఎదుర్కొంటున్న టాక్సేషన్‌ తదితర సమస్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంఘాలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

నేటి అవసరం సహకార ఉద్యమమే…
సహకార ఉద్యమం గతంలో కంటే ప్రస్తుతం చాలా అవసరం. సందర్భోచితం కూడా. సహకార సంఘాలకు తక్కువ ఆర్థిక బలం ఉండవచ్చు, కానీ మన సభ్యత్వ బలం చాలా ఎక్కువ. ఎవరూ మనల్ని ఓడిరచలేరు. కొత్తది ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. దేశాభివృద్ధిలో సహకార సంఘాలు ఎంతగానో దోహదపడ్డాయి. ఇంకా పడతాయి. భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అనేక దేశాలలో, సహకార సంఘాలు చట్టం ద్వారా ఉనికిలోకి వచ్చాయి, కానీ భారతదేశంలో ఇది సంస్కృతిలో భాగం. ఇది అరువు తెచ్చుకున్న భావన కాదు. ఈ రంగం ఎప్పటికీ అసంబద్ధం కాదు. ఇఫ్కో, అమూల్‌, లిజ్జత్‌ పాపడ్‌, క్రిబ్కో వంటి సహకార సంఘాలు పాలు, ఎరువుల వంటి రంగాలలో కీర్తిప్రతిష్టలు సంపాయించాయి. విజయపధంలో ఓ మైలురాయిని సాధించాయి. విత్తనాలు, ఆహార శుద్ధి వంటి రంగాలలో సహకార సంఘాలు సంభావ్యతను ఉపయోగించుకోగలవని గట్టిగా నమ్ముతున్నా. ఇక ఈ రంగాన్ని విస్మరించ వీలులేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడిక కలిసి పని చేద్దాం రండి. దేశంలో కోట్లాది మంది రైతులు, వెనుకబడిన ప్రజలు, దళితులు, మహిళలకు సాధికారత అందించేది ఈ సహకార రంగం తప్ప మరొకటి లేదు. సహకారం భారతదేశానికి కొత్త విషయం కాదు. 1904 నుంచి ఈ రంగం అనేక మైలురాళ్లను అధిగమించింది. అనేక ఎత్తుపల్లాలను చూసిందే గాని ఎప్పుడూ ఆగలేదు. ఈ ఉద్యమాన్ని ఆపొద్దు. సహకార సంఘాలను, ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. సహకార సంఘాలు దేశంలో 91 శాతం గ్రామాల్లో ఏదో ఒక రూపంలో పనిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 8.55 లక్షల నమోదిత సహకార సంఘాలు, 8.5 లక్షల రుణ సహకార సంఘాలు, 7 లక్షల రుణేతర సహకార సంఘాలు, 17 జాతీయ సహకార సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాల విజయం నాలుగు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం కరోనా వంటి కష్టకాలంలో చిక్కుకుని ఉంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలను ఆదుకునేవి ఒక్క సహకార సంఘాలేనని భావిస్తున్నా అని అమిత్‌ షా చెప్పారు.

ఆకుల అమరయ్య, సీనియర్‌ జర్నలిస్టు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్..

Leave Your Comments

Goat Farming: మేకలలో పోషక యజమాన్యం

Previous article

Green Gram Cultivation: పెసరలో వచ్చే తెగుళ్ళు మరియు వాటి యజమాన్యం

Next article

You may also like