Unseasonal Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. దీనికారణంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి.
అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన మిరప, ధాన్యం దిగుబడులను కాపాడుకోవడానికి పొలాల వైపు రైతులు పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అష్టకష్టాలు పడి పట్టలు కప్పినా దిగుబడులు వర్షార్పణమయ్యాయి. ఒక వైపు ధర పతనం.. మరో వైపు కరోనా వైరస్.. ప్రస్తుతం అకాల వర్షాలు.. మిర్చి రైతును పూర్తిగా కుంగదీశాయి. వర్షాలు ఇంకా కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటిస్తుండటం రైతులు అందోళనకు గురౌతున్నారు.
Also Read: రైతును చెప్పుతో కొట్టబోయిన వైసీపీ ఎమ్మెల్యే
విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పొదిలిలో మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలోని వేమ మాచర్ల నియోజకవర్గంలో వర్షం పడింది .అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కళ్లాల్లో ఉన్న మిరప పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. మరికొన్న చోట్ల తీతలకు సిద్ధంగా ఉండడంతో వర్షాలతో నష్టం జరిగే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో మిర్చి రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మిర్చితో పాటు మొక్కజొన్న, సెనగ, కంది, పొగాకు, వరి పంటలు నష్టపోయినట్లు సమాచారం. అయితే ఆంధ్రాతో పాటు తెలంగాణాలో ఖమ్మం మిర్చి రైతులు కొంతమేర నష్టపోయినట్లు అధికారుల సమాచారం.
Also Read: వ్యవసాయం లో ఏ.పి. టాప్- కన్నబాబు