CM KCR Protests: రైతులకు కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎరువుల ధరలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కెసిఆర్ లేఖ రాశారు.
గతంలో కేంద్రం చెప్పిన అంశాలను సీఎం కెసిఆర్ ప్రస్తావించారు. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికి తీరా రైతుల్ని వారి పొలాల్లోనే కూలీలుగా మార్చేస్తున్నారు అంటూ సీఎం కెసిఆర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయాన్ని ప్రయివేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం అనేక చర్యలకు పాల్పడుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాల్లో మునిగి ఉన్నారు. ఎరువుల ధరలను 50 శాతం నుంచి 100 శాతానికి పెంచడం దారుణమని తెలిపారు. అదీ కాకా రైతు వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుని అభాసుపాలయ్యారన్నారు ముఖ్యమంత్రి.
2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గం. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి నిర్ధారణ అయిందని కెసిఆర్ అన్నారు. దేశ రైతాంగాన్ని మన దేశంలో రైతుల్ని బతకనిచ్చే పరిస్థితి లేదు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం… ఎన్ఆర్జీఈ నీ వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం ఇవన్నీ రైతు వ్యతిరేక కార్యకలాపాల్లో భాగమేనంటూ సీఎం కెసిఆర్ మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం వెనక కుట్ర దాగి ఉందని తెలిపారు కెసిఆర్.
రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై యావత్ రైతాంగం తిరగబడాలని సూచించారు సీఎం. నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ మండి పడ్డారు కెసిఆర్. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే ఎరువుల ధరలను తగ్గించాలని.. లేని పక్షంలో దేశ వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాగా.. ఎరువుల ధరలు పెరగడంతో రైతులపై భారీగా భారం పడనుంది. ఎరువుల పెరుగుదలతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.