Thamara Purugu Effect: మిరప రైతుల్ని నిండా ముంచేసిన తామర పురుగు.. క్రమంగా కూరగాయ పంటలు, పండ్లతోటలకూ విస్తరిస్తోంది. ఇప్పుడు మామిడి పూతలోనూ కనిపిస్తోంది. తొలుత తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని తోటల్లో దీని ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా కృష్ణా జిల్లాలోని మామిడికీ ఈ మహమ్మారి ఆశించిందని ఉద్యానశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ప్రభావం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పురుగు తాకిడి మొదలైతే.. నోరూరించే తియ్యటి మామిడి ఈ ఏడాది లభించడం కష్టమే అవుతుంది. మిరప తరహాలోనే.. మామిడి రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని నష్టపోయే అవకాశాలున్నాయి.
అధిక విస్తీర్ణంలో సాగయ్యే జిల్లాలు..
చిత్తూరు జిల్లాలో 2.81లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1.72 లక్షలు, అనంతపురంలో 1.35 లక్షలు, విజయనగరంలో 92 వేలు, కడపలో 68 వేల ఎకరాలు
పురుగుతో నష్టం: పూత నిలవదు, పిందెలు కావు.. మొత్తంగా దిగుబడి భారీగా తగ్గుతుంది. ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడులను కోల్పోవాల్సి వస్తుంది.
Also Read: మొక్కజొన్న కత్తెరపురుగు – సమగ్ర సస్యరక్షణ
సాధారణంగా మామిడికి డిసెంబరు నెలలో పూత మొదలవుతుంది. అయితే ఈ ఏడాది నవంబరులో భారీ వర్షాలు కురవడంతో డిసెంబరులో పూత రాలేదు. కాస్త ఆలస్యంగా జనవరిలో మొదలైంది. మరికొన్ని తోటల్లో ఈ నెల మధ్య నుంచి మొదలు కానుంది. జనవరి నెలాఖరుకు చెట్లు పూతలతో కళకళలాడుతుంటాయి. ఈ దశలో తామర పురుగు ఆశిస్తే.. చెట్టుకు రెండు, మూడు కాయలు నిలవడమూ కష్టమే అని రైతులు పేర్కొంటున్నారు.
మామిడికి ఇప్పటికే పలు చోట్ల తేనె మంచు పురుగు ఆశించింది. దీని ప్రభావంతో నల్ల మచ్చలు ఏర్పడతాయి. కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు మందులు చల్లుతున్నారు.
మిరప నుంచి మొదలై.. మామిడి వరకు నల్ల తామర నవంబరు చివరిలో మిరప నుంచి మొదలైంది. దాదాపు 90% పంటను నష్టపరచింది. అక్కడ నుంచి క్రమంగా కూరగాయ పంటలు, పండ్లతోటలకు వ్యాపించింది. వంగ, సొర, మునగ మొక్కల పూతల్లో నల్ల తామర ప్రభావం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు మామిడిలో మొదలైంది.
అధిక పిచికారితో మరింత తీవ్రం..
మిరప, ఇతర పంటల్లో తామర పురుగు నివారణకు రైతులు పెద్ద ఎత్తున పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో నియంత్రణ కావడం లేదు సరికదా.. పురుగు తీవ్రత మరింత పెరుగుతోంది.దీని నివారణకు పసుపు రంగుతో కూడిన జిగురు అట్టలను పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు మిరప, కూరగాయ తోటల్లో వివిధ రంగుల జిగురు అట్టలను ఉంచుతున్నారు. మామిడిలోనూ ఇది మరింత తీవ్రం కాకముందే.. ఉద్యానశాఖ అధికారులు మామిడి తోటలు పరిశీలించి తగిన సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు.
Also Read: మల్బరీ సాగులో మెలకువలు