Chilli Production: మన రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి నారుమడులలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మిరపలో ఉత్పత్తి తగ్గుతుంది. చిన్న విత్తనాలు గల మిరప పంటను ముందుగా చిన్న చిన్న నారుమడిలో విత్తనాలను పెంచి ప్రధాన పొలంలో మొక్కలను నాటుకోవడం ప్రస్తుతకాలంలో ఆచరిస్తున్న పద్ధతి. మిరప విషయానికొస్తే విస్తీర్ణం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మిరప పంటను వర్షాధారంగా నీటి పారుదల క్రింద దాదాపు అన్ని జిల్లాలలో సాగుచేస్తున్నారు. కానీ మిరప పంటలో ఆశించిన దిగుబడులు రావడం లేదు మిరపలో అధిక దిగుబడులు సాధించాలి అంటే మంచి దృఢమైన ఆరోగ్యవంతమైన నారు ఆవశ్యకత ఎంతో ఉంది.
సాధారణ నారుమడి యాజమాన్యం :
మిరపలో నారుమడులు నీటి ఆధారానికి దగ్గరగా ఉండేలా ఎంపికచేసుకోవాలి. ఎంపిక చేసుకున్న నేలను 4 నుండి 5 సార్లు ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నారుమడి ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తుతోపాటు చుట్టూ 30 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువ ఉండేలా చూసుకోవాలి. ఒక సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనాన్ని చల్లితే ఒక ఎకరాకు సరిపడా నారు లభిస్తుంది . నారుమడిలో కాలువలు అవసరాన్ని బట్టి నీరు అందించుటకు బాటలుగాను, కలుపు తీసి వేయుటకు సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు వినియోగ పడతాయి.
. సాధారణ పద్ధతిలో నారుమడిలో నారు పెంచడం వలన కొన్ని నష్టాలు కలవని చెప్పవచ్చు.
. మొక్కకు తగినంత నీరు అందక పెరుగుదలలో అసమానతలు ఉంటాయి.
. అధిక మోతాదులో విత్తనం నారుగా పోయాల్సి ఉంటుంది. దీని వల్ల ఖర్చు అధికమవుతుంది.
. అధిక సాంద్రతలో మొక్కలు ఉండటం వల్ల నారు దశలో ఆశించే నారు కుళ్లు తెగులు సోకి నారు పాడైపోతుంది.
నారు పీకేటప్పుడు వేళ్లు తెగిపోవడం గాని తునిగి పోవడం గాని జరుగుతుంది.
కాబట్టి మిరప సాగులో దీన్ని అధిగమించి అధిక ఉత్పాదకతను, దిగుబడిని సాధించాలంటే నారుమడి పెంపకంలో అధునాతన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఆధునిక పద్ధతిలో పెంచినన నాణ్యమైన నారు నాటితే మొక్క త్వరగా ప్రధాన పొలంలో నిలదొక్కుకొని శాఖీయంగా బాగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అందుకొరకు నారును ప్లాస్టిక్ ట్రేలలో షేడ్ నెట్ కింద పెంచడం చేయాలి. అలా పెంచినట్లయితే మొక్కలకు కావలసినంత నీరు, పోషకాలను ఉపయోగించుకొనే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం పెరుగుతుంది.
ప్రోట్రేలలో నారు పెంచుట:
నారు పెంచడం ఉపయోగించే ట్రేలను ప్రోట్రేలు అని పిలుస్తారు. ఇవి పాలీప్రొపైలీన్‌తో తయారు చేయబడతాయి. వీటి వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏడు నుండి ఎనిమిది సార్లు మరలా నారు పెంచుటకు ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా 96 నుండి 98 గుంతలు ఉన్న ట్రేలను మిరప నారు పెంచుటకు ఉపయోగిస్తారు. ట్రే పరిమాణం సుమారుగా 54 సెంటీమీటర్లు ఉంటుంది. ట్రే వాడిన ప్రతిసారి శుభ్రమైన నీటితో కడిగి శిలీంద్రనాశినుల రసాయనంతో క్రిమి రాహిత్యం చేయాలి.
ప్రోట్రేలలో ఉపయోగించే మాధ్యమం:
పశువుల ఎరువు లేదా సేంద్రియ పదార్థాల కన్నా పూర్తిగా కుళ్ళిన నీటి ఆవిరిలో నిర్జలీకరణం చేసిన వాణిజ్య పరమైన మాధ్యమం ఉపయోగించడం ద్వారా తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టవచ్చును. దీని కొరకు ముఖ్యంగా కొబ్బరిపీచుతో తయారుచేసిన కోకోపీట్ చాలా శ్రేష్టమైనది. ఇది అధిక సామర్ధ్యం కలిగి ఉంటుంది. కాబట్టి విత్తనం బాగా మొలకెత్తుతుంది. కోకోపీట్ అనేది కొబ్బరి సారి పరిశ్రమలో వెలువడే వ్యర్థ పదార్థం ఇది బాగా కాలిన తరువాత నిర్జలీకరణం చేసి ఇతర పోషక పదార్థాలను జతపరచి ఆ తరువాత మాధ్యమంగా ఉపయోగిస్తారు
Also Read: మల్బరీ సాగులో మెలకువలు
ప్రోట్రేలో నారు పెంచడం వలన కలిగే లాభాలు:
. నాటిన ప్రతి విత్తనం మొలకెత్తి నారు చనిపోదు.
. ఖరీదైన విత్తనం వృధా అవదు.
. నారుమడిలో మొక్కల మధ్య దూరం సమానంగా ఉండి పెరుగుదలలో సమతుల్యత కనిపిస్తుంది.
. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది ప్రధాన పొలంలో నాటినప్పుడు సమర్థవంతంగా పెరుగుతుంది.
. ఇది చాలా సులువైన పద్ధతి, దీనిలో రవాణా కూడా సులభం అంతేగాక రవాణాలో వాడిపోవడం జరుగదు.
. పెరుగుదలలో సమతుల్యత వల్ల నారు పొలంలో నాటిన తరువాత కూడా మొక్కల మరణ శాతం తగ్గుతుంది.
. చీడపీడల వలన కలిగే నష్టం తగ్గుతుంది.
. ఈ విధమైన నారు నాటడం వలన ఏకకాలంలో పంట పక్వతకు వచ్చి ఖర్చు తగ్గుతుంది.
ప్రోట్రేలలో నారు నాటు విధానం :
. ట్రేలను మొదట కోకోపీట్‌తో నింపాలి.
. ఒకవేళ వర్మి కంపోస్టు వాడితే దానికి సమపాళ్లలో ఇసుకను కలిపి ట్రేలు నింపుకోవాలి.
. ట్రే నింపేటప్పుడు కోకోపీట్‌లో తగినంత తేమ శాతం ఉండాలి.
. ఒక ట్రై నింపుటకు సుమారుగా 1. 25 కిలోల కోకోపీట్ అవసరమవుతుంది.
. నింపిన తరువాత ఒక్కొక్క విత్తనం ప్రతి గుంతలో అర సెంటీ మీటరు లోతులో వేసి కోకోపీట్‌తో కప్పాలి.
. ఈ విధంగా విత్తిన ట్రేలను ఒకదాని పై ఒకటి అమర్చి పాలిధీ¸న్ కవర్‌తో కప్పాలి.
. ఇలా కప్పడం వల్ల తేమ శాతం సమృద్ధిగా ఉండి వేసిన విత్తనం పంటను బట్టి 5 నుంచి 6 రోజుల్లో మొలకెత్తడం ప్రారంభమవుతుంది.
. మొలకలు మొదలైన వెంటనే ట్రేలను వేరుచేసి పాలిథీóన్ కవర్ కప్పి బెడ్ పై జతలుగా అమర్చాలి.
. క్రమం తప్పకుండా రోజ్‌క్యాన్‌తో లేదా పైపుతో ట్రేలను తడుపుతూ ఉండాలి.
. నారు పోషణకు 19 శాతం నత్రజని, 19 శాతం భాస్వరం, 19 శాతం పొటాషియం మిశ్రమాన్ని 3 గ్రాములు ఒక లీటరు నీటికి 12 రోజులకు మరియు 20 రోజులకు పిచికారీ చేయాలి.
. నారును వర్షం భారి నుండి కాపాడుటకు అర్ధచంద్రాకారంలో అమర్చిన పైపుల పైనున్న పాలిథీన్ కవర్‌ను వాడుకోవాలి.
షేడ్ నెట్ కింద నారు పెంచుట:
సాధారణంగా నాలుగు దశల్లో మొక్కలకు సరిపడే కాంతి, నీరు, తేమ శాతం బయటి వాతావరణంలో లభించవు కావున ఇది మాత్రమే సాధ్యపడుతుంది. షేడ్ నెట్‌లో నారు పెంచదలచిన వారు మొదట 7 నుండి 9 మీటర్ల పొడవైన సిమెంట్ లేదా రాతి స్తంభాలను 5 నుండి 8 మీటర్ల దూరంలో మూడు అడుగుల లోతులో పాతుకోవాలి. దీని పై భాగాన షేడ్ నెట్ సహాయంతో కప్పాలి. ఇరుప్రక్కల పురుగులు కీటకాలు రాకుండా ఉండేందుకు తెరలు దించాలి. దీని వల్ల తెల్ల దోమ, పేనుబంక, పచ్చ దోమ, వంటి రసం పీల్చు పురుగుల వంటి వాటిని నియంత్రించి తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. నేలను బాగా చదువు చేసుకుని ఒక మీటరు వెడల్పు తగినంత పొడవుతో బెడ్‌లను తయారు చేసుకోవాలి. తర్వాత సుమారు 0.75 అంగుళాల వ్యాసం గల ప్లాస్టిక్ పైపులను అర్ధచంద్రాకారంగా వంచి బెడ్ పైన అమర్చాలి. వర్షాకాలంలో దీనిపై ప్లాస్టిక్ షీట్ కప్పినట్లయితే నారు దెబ్బతినకుండా ఉంటుంది.
సస్యరక్షణ:
నారు మొలకెత్తిన తరువాత నారు కుళ్ళు నివారణకు మెటలాక్సిల్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి నారు ఉన్నటువంటి ట్రేలను తడపాలి . పొలంలో నాటుటకు 7 నుండి 10 రోజుల ముందు 0.3 శాతం ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి కలిపి నారు పై పిచికారీ చేయడం వలన రసం పీల్చు పురుగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. మిరప నారు నాటిన 35 నుండి 40 రోజులలో ప్రధాన పొలంలో నాటుటకు సిద్ధమవుతోంది.
ఈ విధంగా ఆధునిక పద్ధతులలో మిరపనారును పెంచుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన నారును, అధిక ఉత్పాదకతను, దిగుబడిని రైతు సోదరులు పొందవచ్చు…
Also Read: వేపనూనెతో మొక్కలకు ఎంతో మేలు..
డా.విరమణ, ప్రిన్సిపాల్
డా.జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఎస్.ఎస్.ఎ.జి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల,మడకశిర
డా.వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫోన్ : 7382633687