Foxtail Millet Farming: తెలంగాణలో ప్రస్తుతం సాగుచేస్తున్న చిరుధాన్యాలలో ప్రధానమైన పంట కొర్ర. వరి బియ్యంతో పోల్చితో కొర్రలో తక్కువ మోతాదులో పిండి పదార్థాలు, ఇనుప ధాతువు, మరియు కాల్షియం ఉండటం వలన మధుమేహ మరియు హృద్రోగ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక బలవర్థకమైన ఆహారంగా ప్రఖ్యాతి చెందింది. ఈ పంటను తేలికపాటి ఎర్ర చల్కా నెలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కూడా సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. రైతు సోదరులు ఈక్రింద పేర్కొనబడిన మెళకువలు పాటించి కొర్ర సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చు.
నేలలు:
తేలిక పాట ఎర్రచెల్కా నేలలు, నల్ల రేగడి నేలలు మరియు మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి.
విత్తే సమయం:
ప్రస్తుతం ఈ రంట జనవరి రెండవ పక్షంలోపు విత్తుకోవాలి.
రకాలు:
సూర్యనంది, ఎస్-ఏ- 3085 రకాలు వేసనిలో సాగుకి అనుకూలమైనవి. ఈ రకాలు పంట కాలం 75-80 రోజులు ఎకరాకు 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తాయి.
Also Read:మొక్కజొన్న కత్తెరపురుగు – సమగ్ర సస్యరక్షణ
విత్తనం`మోతాదు:
ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తే పద్ధతి:
విత్తి నాన్ని 1:3 నిష్పత్తిలో ఇసుకలో కలుపుకొని వరుసల మధ్యదూరం 30 సెం.మీ. మొక్కకి, మొక్కకి మధ్యదూరం 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.
ఎరువులు:
ఎకరాకు 3`4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరిదుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని యిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. రెండవ దఫా 8 కిలోల నత్రజని ఎరువును విత్తిన 30`35 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. Foxtail Millet
అంతరపంటలు:
కొర్ర : కంది, వేరుశనగ సోయాక్కుడు – 5ః1 నిష్పత్తిలో,
కొర్ర : వేరు శనగ – 2ః1 నిష్పత్తిలో వేసుకోవాలి.
కలుపు నివారణ:
విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపులేకుండా చూడాలి.
సస్యరక్షణ:
సాధారణంగా కొర్రలో ఎలాంటి మందులు వాడవలసిన అవసరం ఉండదు.
గులాబి రంగు పురుగు:
లార్వాలు మొవ్వును తొలచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లయితే వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి 16 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
వెర్రికంకి తెగులు:
తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. ముక్కు నుండి బయటికి వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. దీని నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్. 35 డబ్ల్యు.ఎస్. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అగ్గి తెగులు:
మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 25 గ్రా. మాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వీటితోపాటు చెదలు, మిడలు, ఆశించే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు పొందవచ్చు. కావున పరిస్థితులను బట్టి రసాయనాలను తక్కువగా వాడి వీలైనంత వరకు నాణ్యతను పెంచుకోవచ్చు. ఈ విధంగా పండిన కొర్రలను తినడం ద్వారా రైతు సోదరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో కూడ మంచి ధర గిట్టుబాటు అవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించి, అధిక లంభాలు పొందవచ్చు.
Also Read:మిర్చి రైతుకు తీరని నష్టం
డి. స్రవంతి, పి. నీలిమ, కె. శిరీష, ఎం. కాడసిద్దప్ప,
పి శ్రీలత, కె.నాగాంజలి, కె. గోపాలకృష్ణ మూర్తి మరియు యం, మాధవి.
వ్యవసాయ కళాశాల, ఆశ్వారావుపేట.