Patio Vegetable Garden: కూరగాయలు మరియు పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. పోషకాహార నిపుణుల సూచన ప్రకారం ఒక వ్యక్తి ప్రతీ రోజు 250 గ్రాముల పండ్లు మరియు కూరగాయలు తమ ఆహారంలో చేర్చాలి. కాని ఆ విధంగా తీసుకోవాలంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా అది అన్ని వర్గాల వారికి సాధ్యం కాదు. అంతేకాకుండా రైతులు కూరగాయలు పండించేటప్పుడు ఎన్నో క్రిమ సంహారక మందులు పిచికారీ చేయడం వలన మనం బజారులో కొంటున్న కూరగాయలు మరియు పండ్లపై ఎన్నో హానికరమైన రసాయన మందుల అవశేషాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
దీనికి సరైన పరిష్కార మార్గం ఇంటి ఆవరణలో కూరగాయలను పెంచుకోవడం. దీని వలన ఇంటిలో అందరూ సంవత్సరం పొడవునా కూరగాయలు పొందవచ్చు. కాని గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూసుకొంటే పట్టణ ప్రాంతాలలో ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవడానికి తగినంత స్థలం లభించదు. అందువలన ఈ మధ్య కాలంలో పట్టణ ప్రాంతాల వారు కూడా తమ ఇంటిలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పెంచుకొనే విధంగా టెర్రస్ గార్డెనింగ్ లేదా డాబాపై కూరగాయల సాగు ప్రాచుర్యంలోనికి వచ్చింది. అందువలన పెరటిలో స్థలం లేని వారు డాబా పై కూరగాయలను సాగు చేసుకోవచ్చు.
డాబాపై కూరగాయలు పెంచడానికి కావలసిన మౌళిక వసతులు:
* డాబా ఉపరితలం ధృడంగా ఉండాలి.
* కూరగాయలు మొక్కలను అన్నింటికీ తగినంత సూర్యరశ్మి అవసరం. అందువలన రోజులో ఎక్కువ కాలం సూర్యరశ్మి తగిలేలా స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి.
* మొక్కల నీటి యాజమాన్యం కొరకు డాబా పై వాటర్ ట్యాంక్ ఉండాలి. లేదంటే పైపు ద్వారా నీటిని మొక్కలకు అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
* మొక్కల నీటి యాజమాన్యం కొరకు డాబా పై వాటర్ ట్యాంక్ ఉండాలి. లేదంటే పైపు ద్వారా నీటిని మొక్కలకు అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
* వీటితో పాటు మనం మొక్కలను పెంచడానికి అవసరమయ్యే కుండీలు లేదా కంటైనర్లు, విత్తనాలు, సేంద్రీయ ఎరువు, మట్టి, ఇసుక, రోజ్ కాన్, హేండ్ హో, పార, హేండ్ స్ప్రేయర్లు, వంటి కనీస అవసరాలను సిద్ధం చేసుకోవాలి.
డాబాపై కూరగాయలు పెంచేటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు:
* కూరగాయలను మరియు పండ్ల, మొక్కలను డాబాపై పెంచదలచుకొంటే డాబా పై కప్పు ధృడంగా ఉందో లేదో ముందుగా పరిశీలించాలి.
* డాబాకు ఎటువంటి బీటలు, లీకేజ్ లేకుండా ఉండాలి. లేకుంటే మొక్కలకు మనం నీరు పోస్తున్నప్పుడు పైకప్పు నుండి ఇంటి లోపకు కారే అవకాశం ఉంది.
* డాబాపై మొక్కలు పెంచేటప్పుడు మొక్కలు అధిక ఉష్ణోగ్రతలకు గురిఅవుతాయి. అందుకోసం పెడ్ రెటీను ఏర్పాటు చేసుకోవచ్చు.
* డాబాపై మొక్కలను పెంచేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నేలపై కంటే డాబాపై గాలి ఎక్కువగా వీస్తుంది. అందువలన పొడుగుగా పెరిగే మొక్కలకు కర్ర ఊతం ఇవ్వాలి.
Also Read: తెలంగాణలో చామంతి సాగు విధానం..
విత్తనాల ఎంపిక: నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
నారు పెంపకం: వంగ, టమాటా, మిరప, ఉల్లి వంటి కూరగాయల విత్తనాలను ముందుగా ప్రోట్రేలలో లేదా నారుమడిలో నారును పెంచుకోవాలి. నారుమడిని పెంచుకోవడం కోసం ప్రోట్రేలను కడిగి మురుగు నీరు పోయే విధంగా రంధ్రాలు, చేసుకోవాలి. మట్టి, కంపోస్టు మరియు ఇసుక 1:1:1 నిష్పత్తిలో కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీనిని ప్రోట్రేలలో కడిగి మురుగు నీరు పోయే విధంగా రంధ్రాలు చేసుకోవాలి. మట్టి, కంపోస్టు మరియు ఇసుక 1:1:1 నిష్పత్తిలో కలిపి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. దీనిని ప్రోట్రేలలో వదులుగా, నింపి ఒక్కొక్క గుంతలో ఒక్కో విత్తనం నాటుకోవాలి. విత్తనాలు అన్నీ నాటడం పూర్తి అయ్యాక నీరు పెట్టుకోవాలి. 30-40 రోజుల తర్వాత కంటైనర్లు లేదా కుండీలలో బాగా పెరిగిన నారు మొక్కలను నాటుకోవచ్చు.
విత్తనాలు నాటుట:
బెండ, చిక్కుడు, గుమ్మడి వంటి పెద్దసైజు విత్తనాలను నేరుగా కంటైనర్లలో నాటుకోవచ్చు. విత్తనాలు మరియు నారును పెంచేటప్పుడు గ్రోబాగ్లను వాడినట్లయితే వాటిని ముందుగా గులక రాళ్ళతో నింపి తరువాత దానిపై మట్టి, కంపోస్టు మరియు ఇనుక కలిపిన మిశ్రమాన్ని నింపాలి. మిశ్రమాన్ని నింపిన తరువాత విత్తనాలను లేదా నారు మొక్కలను నాటుకోవచ్చును.
బీర, గుమ్మడి, ఆనప మరియు కాకర్ల వంటి తీగజాతి మొక్కలకు కర్ర ఊతనిచ్చి గాని, ట్రెల్లీస్ను ఉపయోగించి పెంచాలి.
కంపోస్టు లేదా సేంద్రీయ ఎరువు తయారీ:
డాబాపై కూరగాయలను పెంచేటప్పుడు మనం సేంద్రీయ ఎరువును కూడా కంపోస్టు డబ్బాను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. దీని కొరకు ఒక మూల కంపోస్టు డబ్బాను ఉంచి దానిలో వంటింటి వ్యర్థాలైనటువంటి కాఫీ, టీ పొడి, కోడి గ్రుడ్డు పెంకులు, కూరగాయలు మరియు పండ్ల తొక్కలు, తోటలో రాలిన ఆకులు, ఎండిన కొబ్బలు వంటివి వేయాలి. దానిపై పలుచగా మట్టిని కప్పాలి. ఇదంతా తడిసేలా నీరు పెట్టాలి. ఇలా వరుసలు, వరుసలుగా వంటింటి వ్యర్థాలు మరియు మట్టితో నింపి వారానికి ఒకసారి నీటితో తగిపితే ఆరు నెలల్లో మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. అలానే డాబాపై ఒక మూల వర్మీ కంపోస్టును కూడా తయారు చేయవచ్చు.
చీడ పీడల నివారణ:
చీడ పీడల నివారణకు సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు చేపట్టడం, మొక్కల చుట్టూ క్రమం తప్పకుండా మల్చింగ్ చేయడం, వేపపిండి వేయడం, వేప కషాయం పిచికారీ చేయడం, తెగులు సోకిన కొమ్మలు లేదా ఆకులను ఏరివేయడం, పురుగులను, తెగుళ్ళను చాలా వరకు అరికట్టవచ్చు.
చీడపీడల నివారణకు సహజ క్రిమి సంహారక వేప ద్రావణం తయారీ :
వేప ద్రావణం
వేప గింజలు : 5 కి.గ్రా.
సబ్బు పొడి : 100 గ్రా.
తయారీ విధానం:
నీడలో ఎండబెట్టిన వేపగింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక గుడ్డలో ఈ వేపపొడిని మూట కట్టి 10 లీ. నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఈ గుడ్డను గట్టిగా పిండి వేప గింజల సారం నీటిలో బాగా కలిసేటట్లు చూడాలి. పలుచని గుడ్డలో వడకట్టి 100 గ్రా. సబ్బుల పొడిని కలపాలి. ఈ ద్రావణాన్ని నీటిలో 1% వేసి సాయంత్రం సమయంలో మొక్కలపై పిచికారీ చేయాలి.
వివరములకు సంప్రదించండి
Also Read: టమాటాలో శనగ పచ్చ పురుగు – నివారణ
డా. కె. భాగ్యలక్ష్మి, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త
డా. డి. చిన్నం నాయుడు, ప్రోగ్రాంకో`ఆర్డినేటర్
ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస
ఫోన్: 08942-286210
ఫోన్ : 9989623822
టోల్ ఫ్రీ : 18004250051