Chamomile Flower Cultivation: చామంతిని మన రాష్ట్రంలోని మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో సాగుచేస్తున్నారు.
నేలలు:
నీరు ఇంకే సారవంతమైన తేలిక నేలలు, గరప నేలలు అనుకూలం. ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉండాలి. మురుగునీటి పారుదల సరిగా లేని ఎడల మొక్కలు చనిపోతాయి.
వాతావరణం : చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది.
రకాలు:
వివిధ రకాల చామంతి, వివిధ రంగుల్లో సాగు చేయబడుతున్నది.
పసుపు రంగు రకాలు : భసంత్, పూనమ్, రామచూర్, ఎల్లోగోల్డ్, పేపర్‌ఎల్లో
తెలుపు రంగు రకాలు : పూర్ణిమ, స్నోబాల్, పేపర్ వైట్, రాజావైట్
ఎరుపు రంగు రకాలు : రెడ్ లేడీ, రెడ్ వైన్
గులాబీ రంగు రకాలు : రోజ్ డే, ప్రిన్స్, ఫెయిర్, వైలెట్
ప్రవర్ధనం : పిలకలు కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు
పిలకలు:
పూల కోతలు పూర్తయిన తర్వాత మొక్కలను మొదలు వరకు కత్తిరించి ఎరువులు వేసి వారానికో తడుస్తూ ఉంటే రెండు నెలల్లో వేరుతో కూడిన అనేక పిలకలు ఏర్పడతాయి. వాటిని జూన్లో వేరు చేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి.
కొమ్మ కత్తిరింపులు:
ఈ పద్ధతి ద్వారా వచ్చే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. తల్లి మొక్క నుండి లేత కొమ్మలు చివరి భాగాన్ని 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవులో కత్తిరించుకొని, దాని మీద పూర్తిగా మూడు ఆకులను మాత్రమే ఉంచి మిగతా ఆకులను తీసివేసి ఈ కత్తిరింపులను నారుమడి లో నాటుకోవాలి. వేర్లు ఏర్పడిన కత్తిరింపులను జూన్, జూలై ప్రధాన పొలంలో నాటుకోవాలి. కత్తిరింపులకు వేర్లు బాగా రావాలంటే ఐ బి ఏ 2500 పిపియం ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
నాటడం:
జూన్, జూలైల్లో నాటు కున్నట్లయితే నవంబర్`డిసెంబర్‌లో పూస్తాయి. చిన్న పూల రకాలను 30I30 సెంటీ మీటర్ల ఎడంగా నాటాలి. పెద్దపూల రకాలను 90 I 75 సెంటీ మీటర్ల దూరంలో నాటుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.
ఎరువులు:
ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల యూరియా, 200 కిలోల సూపర్, 50 కిలోల పొటాష్ ఎరువు వేసుకొని కలియదున్నాలి. 25, 45, 60 రోజులకు 19:19:19 ఎరువు 50 కిలోలను పైపాటుగా వేసుకోవాలి. బోదెలను ఎగదోసుకోవాలి. 60 రోజుల తర్వాత నుండి నీటిలో కరిగే 19:19:19, 14:35:14 ఎరువులను ఎకరాకు మూడు కిలోల చొప్పున రోజు మార్చి రోజు, మార్చి మార్చి డ్రిప్ ద్వారా సర్టిఫికేషన్ పద్ధతిలో ఎరువులను అందించాలి. మొగ్గ దశ నుండి మాత్రం కాలుష్యం నైట్రేట్ మూడు కిలోలను రోజు మార్చి రోజు ద్వారా అందించాలి. తలలు తుంచే సమయంలో పై పాటుగా 50 కిలోల యూరియాను చామంతిని అందించాలి.
Also Read:సాగుబడిలో సోషల్ మీడియా ఒరవడి.. టెక్నాలజీతో దూసుకెళ్తున్న రైతులు.!
నీటి యాజమాన్యం:
వాతావరణాన్ని బట్టి, నేల తీరునుబట్టి నీరు ఇవ్వాలి. నాటిన మొదటి నెలలో వారానికి రెండు మూడుసార్లు అటు పిమ్మట వారానికి ఒక తడి ఇవ్వాలి. అయితే ప్రతి రోజూ పది నిమిషాలు నీరు అందించాలి.
పించింగ్:
నారు నాటి నాలుగు వారాల తరువాత చామంతి మొక్కల కొనలు అంటే రెండు నుండి మూడు ఆకులతో కూడిన మొగ్గతో సహా తుంచి వేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. పంట కొంత ఆలస్యం చేయవచ్చు దిగుబడి కూడా పెరుగుతుంది.
ఊతం ఇవ్వడం:
చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోకుండా వెదురు కర్రలతో లేదా నెట్టింగ్ వైర్‌లతో ఊతమివ్వడం మంచిది.
హార్మోన్ల వాడకం : 100 పిపియం నాప్తలీన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. 100 నుండి 150 పిపిఎం జిబ్బరిల్లిక్ 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది.
పూల కోత:
జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబరు నుండి జనవరి వరకు పూతపూసి కోతకు వస్తాయి. ఈ సమయంలో అధిక దిగుబడులను ఇస్తాయి. ఎకరాకు ఆధునిక హైబ్రీడ్లు 8 నుండి 10 టన్నుల దిగుబడినిస్తాయి.
సస్యరక్షణ
తామరపురుగులు:
ఇవి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి ఎండిపోతాయి. పూలు కూడా వాడి పోయి రాలిపోతాయి. నివారణకు రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేక 2 మి.లీ పిఫ్రోనిల్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
పచ్చ పురుగు:
పురుగు యొక్క లార్వా మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినివేస్తుంది, నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
తెల్ల దోమ:
తెల్లదోమ అధికంగా రసంపీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకొని రాలిపోతాయి. నివారణకు 0.5 గ్రా. ధయోమిధాక్సామ్ లేదా 1 గ్రా. ఎసిటామిప్రిడ్‌లను లీటరు నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
తెగుళ్ళు
ఆకుమచ్చ:
నల్లని లోతైన గుండ్రని మచ్చలు ఆకులపై ఏర్పడడం వల్ల ఆకులు ఎండి రాలిపోతాయి. నివారణకు 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
వేరు కుళ్లు తెగులు:
మొక్కలు అకస్మాత్తుగా వడలి, ఆకులు ఎండి రాలిపోతాయి. నివారణకు బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి మందుతో నేలను బాగా తడిపి తెగులును అరికట్టవచ్చు. రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడిను పశువుల ఎరువుతో కలిపి ఆఖరి దుక్కిలో వేయాలి.
డా. ఎ. నిర్మల, డా. ఎమ్. వెంకటేశ్వరరెడ్డి, డా. ఎమ్. విజయలక్ష్మి, కె. చైతన్య, డా. ఎ. మనోహర్ రావు (రిటైర్డ్), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ : 8247417586
Also Read: పశు గ్రాస పంచాంగము