Terrace Gardening Tips: మిద్దెతోటలో టమాటా మొక్కలు ఎలా పెంచుకోవాలి అంటే వాటికి కావలసిన కంటైనర్ సైజు, మట్టి మిశ్రమం, విత్తనాలు ఎలా విత్తుకోవాలి, నీటి యాజమాన్యం, ఎరువులు, చీడపీడలు గురించి తెలుసుకుందాం, టమాటా మొక్కలు పెంచుకోవడానికి విత్తనాలు కొనవలసిన అవసరం లేదు, విత్తనాలు కొనకుండా టమాటా మొక్కలు ఎలా పెంచుకోవాలి అంటే ఇంటి అవసరాలకు టమాటాలు కొంటాం కదా. వాటిలో మనకు నచ్చిన రకం ఎంచుకుని నారు పోసుకోవచ్చు. ఈవిధంగా కాకుండా ఇంకా సులభంగా పెంచుకోవాలి అంటే కంటైనర్లలో మట్టి మిశ్రమం నింపడానికి ఎర్ర మట్టితో పాటుగా పశువుల ఎరువు కలుపుతారు కదా. ఆ పశువుల ఎరువులో నుంచి టమాటా మొక్కలు వస్తాయి. వచ్చిన వాటిని అలాగే ఉంచి పెంచుకోవచ్చు లేదా తీసి కావలసిన చోట నాటుకోవచ్చు. టమాటాలలో రెండు రకాలు ఉంటాయి. పొద రకం, తీగె రకం. అపార్ట్ మెంట్‌లో స్థలం లేనివాళ్ళు పొద రకం పెంచుకోవాలి. పొద రకం పెంచుకోవడానికి చిన్న కంటైనర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. స్థలం బాగా ఉంటే తీగె రకం వేసుకోవచ్చు. పొద రకం కంటే తీగె రకం ఎక్కువ రోజులు పెరుగుతూ, ఎక్కువ రోజులు దిగుబడిని ఇస్తుంది.
టమాటాలు చాలా రకాలు ఉన్నాయి. టమాటాలను చలికాలంలో బాగా పండిరచవచ్చు. ఎండాకాలంలో టమాటాలను పండిరచలేము. వర్షాకాలంలో టమాటా మొక్కలు బాగా పెరుగుతాయి. టమాటాలు కూడా బాగానే కాస్తాయి.కానీ వర్షాలకు టమాటా మొక్కలకు ఫంగల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి చలికాలం మొక్కలు పెరగడానికి అనుకూలమైన కాలం. టమాటా మొక్కలను పెంచడానికి పెద్ద కుండీలను ఉపయోగించాలి. మొక్కలకు ఎర్రమట్టి, బాగా మాగిన పశువుల ఎరువు, ఇసుక సమానంగా తీసుకుని వేప పిండి కొంచెం కలుపుకోవాలి. మట్టి పోషకాలతో నాణ్యత కలిగి ఉండాలి. మొక్కలు పెంచే కుండీలలో నీరు లేదా పోషకాల కోసం పోటీ పడే ఏ ఇతర మొక్కలను పెంచకపోవడం మంచిది.
. టమాటా మొక్కలకు ముందు నారు పోసుకోవాలి. నారు ఐదారు ఆకులు వచ్చిన తర్వాత తయారుగా ఉంచుకున్న మడులలో లేదా కుండీలలో నాటుకోవాలి.
. టమాటా మొక్కలను లోతుగా నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు కింద ఉన్న ఆకులను కొన్ని తీసి లోతుగా నాటుకోవాలి. టమాటా మొక్క దాని కాండ భాగానికి కూడా వేర్లను ఉత్పత్తి చేస్తుంది. కంటైనర్లలో నీరు త్వరగా ఎండిపోతుంది కాబట్టి ఒకేరకమైన తేమ ఉండేలా చూసుకోవాలి. తేమ తక్కువ అయితే మొక్క బలహీనపడి లేట్ బ్లైట్ వ్యాధి వస్తుంది.
. టమాటా మొక్కలకు ఒకే విధంగా నీరు ఇవ్వకపోతే అంటే నీరు ఎక్కువ తక్కువ అయితే టమాటా పండ్లు పగలవచ్చు. అందుకని వేసవిలో రెండు సార్లు నీరు ఇవ్వవలసి ఉంటుంది.
Also Read: ఇలా కూడా మిద్దె తోట ప్రారంభించొచ్చు !
. టమాటా మొక్కలకు ఆకుల మీద తేమ లేకుండా ఉండడం కోసం, మట్టి తేమగా ఉండడం కోసం నీరు ఉదయమే ఇవ్వాలి. నీరు ఇచ్చేటప్పుడు ఆకులను తడపకూడదు.
. ఇది ముడత మరియు ఫంగస్‌ను ప్రోత్సహిస్తుంది. నేల తేమగా ఉండాలి కాని తడిగా ఉండకూడదు. అలా ఉంటే మొక్క వేర్లు కుళ్ళిపోతాయి.
. వర్షాకాలంలో ఎక్కువ నీరు కుండీలలో పడకుండా జాగ్రత్త వహించాలి. మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరమవుతాయి.
. పదిహేను రోజులకు ఒకసారి ప్రధాన పోషకాలు అందేలా చూసుకోవాలి. టమాటా మొక్కలకు ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ అవసరం. కానీ వెచ్చని ఎండను ఇష్టపడతాయి.
. ఎక్కువ చలిని, ఎక్కువ ఎండను తట్టుకోలేవు.
. టమాటా మొక్కలకు ప్రూనింగ్‌కు పైన టిప్స్ తుంచకూడదు.
. కింద నుంచి ఆకులను తీసేస్తూ మొక్కను పైకి పెరగనివ్వాలి.
. టమాటా మొక్కలలో ఆకుల మొదలులో సక్కర్స్ అని చిన్న పక్క కొమ్మలు లాగా వస్తాయి. వాటిని కూడా తీసివేస్తే మంచిది.
. టమాటా మొక్కలకు చీడపీడలు ఎక్కువగా రాకుండా మల్చింగ్ చేయాలి.
టమాటా మొక్కలకు వచ్చే చీడపీడలు :
డాంపింగ్ ఆఫ్ :
ఇది మొలకలు కుళ్ళి పోవడానికి కారణమయ్యే శిలీంధ్ర (ఫంగల్) వ్యాధి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. డాంపింగ్ ఆఫ్ రాకుండా మట్టి మిశ్రమంలో ఇసుక, వేప పిండి కలుపుకోవాలి. మొలకలకు పుల్ల మజ్జిగ ద్రావణం చల్లాలి.
ప్రారంభ ముడత :
ఇది కింది ఆకులకు అంటే పాత ఆకులకు వస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. కింద ఆకులు పండినట్లు, మచ్చలు వలయాలుగా ఏర్పడి ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆకులన్నీ వెంటనే తీసేయాలి.
నివారణ :
బేకింగ్ సోడా 2 గ్రా., వెనిగర్ 2 మి.లీ., వేపనూనె 5 మి.లీ., 2 మి.లీ. కుంకుడు కాయ రసం నీటికి బాగా కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి. లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటరు నీటికి 3 గ్రా. కలిపి మొక్కలకు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేయాలి.
టమాటా లేట్ బ్లైట్ (లేట్ ముడత) :
ఇది ఆలస్యంగా వచ్చే ముడత. ఇది ఫంగస్ వలన వస్తుంది. ఇది మొక్కలకు రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత ఈ వ్యాధిని మొదటనే గుర్తించలేకపోతే మొక్కలు అన్నీ చనిపోయే పరిస్థితి వస్తుంది. పూత దశ నుంచి ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి మొక్కలోని అన్ని భాగాలను ఆశిస్తుంది. ఈవ్యాధి టమాటాలను ఆశించినప్పుడు కాయ పైభాగంలో మొదట కుళ్ళిపోతుంది. ఈ వ్యాధి రాకుండా ముందునుంచే పిచికారీలు చేస్తూ ఉండాలి. ఒక లీటరు నీటిలో 30 మి.లీ. పుల్ల మజ్జిగ, 1.25 ఇంగువ కలిపి ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. బేకింగ్ సోడా ద్రావణం కూడా స్ప్రే చేయవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటరు నీటికి 3 గ్రా. కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ :
ఇది కూడా ఫంగస్ వలన వస్తుంది. ఆకుల మీద చిన్న, గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన ఆకులను తీసివేసి పుల్లమజ్జిగ ద్రావణం కానీ, బేకింగ్ సోడా ద్రావణం కానీ స్ప్రే చేయాలి. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను స్ప్రే చేయాలి.
బాక్టీరియల్ స్పాట్ :
ఈ వ్యాధి బాక్టీరియా యొక్క అనేక జాతుల వలన కలుగుతుంది. తడి సీజన్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకులు మరియు పండ్లకు సోకుతుంది. దానివలన ఆకులు, పండ్ల మీద మచ్చలు ఉంటాయి. ఈ వ్యాధి వచ్చిన తర్వాత నియంత్రించడం కష్టం. పుల్ల మజ్జిగ, ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను పిచికారీ చేయడం వలన ఈ వ్యాధికి మంచి నియంత్రణ లభిస్తుంది.
వెర్టిసీలియం విల్ట్ :
ఈ శిలీంధ్రవ్యాధి మట్టి ద్వారా వ్యాపించే వ్యాధికారకాల వలన వస్తుంది. ఈ ఫంగస్ మొక్కలకు వ్యాపించినప్పుడు ఆకులు మరియు కాండం వాడిపోతాయి. ఇది ఎక్కువగా వేసవి చివరలో వస్తుంది.ఈవ్యాధి సోకిన మొక్కలను పీకేసి దూరంగా పడేయాలి. మట్టిని సోలరైజ్ చేయాలి. కనీసం మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆ మట్టిలో టమాటా మొక్కలు వేయకుండా పంట మార్పిడి చేయాలి.
లీఫ్ మైనర్ :
టమాటా మొక్కల ఆకులకు లీఫ్ మైనర్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన ఆకులను తీసివేసి వేపనూనె 5 ఎంఎల్, 2 ఎంఎల్ కుంకుడు కాయ రసం లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఫ్యుసేరియం విల్ట్ :
ఇది ఫంగస్ వలన వస్తుంది. ఇది మొక్కలకు సోకినప్పుడు మొక్క అకస్మాత్తుగా వాడి పోతుంది. ఈ ఫంగస్ అభివృద్ధి చెందుతున్నప్పుడు నీరు మరియు పోషకాలను వేర్ల ద్వారా మొక్కకు అందకుండా చేస్తుంది. మొక్క చనిపోతుంది. దీనికి పంట మార్పిడి చేయాలి. నేల సోలరైజ్ చేయాలి. ట్రైకోడెర్మా విరిడిని మట్టిలో కలుపుకోవాలి.
Also Read: టెర్రస్ గార్డెన్ పై 28న శిక్షణ తరగతుల.
మొజాయిక్ వైరస్ :
ఇది ఎక్కువగా రసం పీల్చు పురుగుల వలన ఆశిస్తుంది. మొక్కలకు ఆశించినప్పుడు మొక్క చనిపోదు కానీ దిగుబడి బాగా తగ్గుతుంది. ఆకులపై లేత ఆకుపచ్చ మరియు పసుపు రంగుతో గుర్తులు మొసాయిక్‌ను పోలి ఉంటాయి. దానికి వేపనూనె కానీ, పుల్ల మజ్జిగలో వెల్లుల్లి, ఇంగువ, పసుపు కలిపి కానీ, ఒక లీటరు నీళ్ళు మరిగించి దానిలో మూడు టేబుల్ స్పూన్లు పసుపు వేసి మరిగించి చల్లారిన తర్వాత ఐదారు రేకలు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రాత్రి ఉంచి ఆ నీటికి సమానమైన నీటిని కలిపి కానీ స్ప్రే చేయవచ్చు.
మిల్లీబగ్స్ :
ఇవి ఎండాకాలంలో ఎక్కువగా వస్తాయి. వాటిని చూడగానే చేతితో తీసి వేయాలి. లేదంటే ఒక పాత బ్రష్ తీసుకుని వాటన్నింటినీ జాగ్రత్తగా మట్టిలో పడకుండా ఒక పేపర్ మీద పడేలా తీసేయాలి. తర్వాత నీళ్ళతో ఫోర్స్ గా కడిగేయాలి. ఇంకా ఎక్కువ ఉంటే వేపనూనె కానీ, మిగిలిన అన్నం రెండు మూడు రోజులు నీళ్ళలో నానబెట్టి వడకట్టి ఆ ద్రావణానికి నీటిని కలిపి కానీ, బియ్యం పిండి గంజిలాగా కాచి నీళ్ళలో కలిపి దానిలో షాంపూ కానీ కుంకుడు కాయ రసం కానీ కలిపి, కొంచెం ఇంగువ కలిపి స్ప్రే చేయాలి.
బ్లాసమ్ అండ్ రాట్ :
ఇది ముఖ్యంగా కాల్షియం లోపం వలన వస్తుంది. కాల్షియం మొక్కలోని అన్ని భాగాలకు సరిగా అందాలంటే నీళ్ళు సరైన సమయంలో ఒకే మోతాదులో ఇవ్వాలి. కాల్షియం లోపం పోవడానికి సున్నం కానీ, బోన్ మీల్ కానీ, గుడ్డు పెంకుల పొడి కానీ, చాక్ పొడి కానీ ఇవ్వాలి. టమాటా మొక్కలకు ఎప్సం సాల్ట్ అప్పుడప్పుడు ఇవ్వాలి. అది ఇవ్వడం వలన మొక్కల వేళ్ళు బాగా లోతుగా పెరుగుతాయి. మొక్కలు బాగా గుబురుగా పెరిగి ఆకులు ఆకుపచ్చ రంగులో ఆరోగ్యంగా ఉంటాయి. టమాటాలకు మంచి రుచి, రంగు కూడా వస్తుంది.
అందరూ పెంచుకోగలిగిన మొక్క టమాటా మొక్క. దీనికి విత్తనాలు కొనవలసిన అవసరం లేదు. మనకు నచ్చిన టమాటా తీసుకుని మట్టిలో దానిని నలిపి వేసి పైన మట్టి చల్లితే మొక్కలు వస్తాయి.