Dairy Animals ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వర్తిస్తుంది. పాడిపరిశ్రమ విషయంలో వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే రైతులు చలి కాలంలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయక పాల దిగుబడి తగ్గుతుంది. ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎదకు వస్తుంటాయి. ఈ క్రమంలో శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దాణాల్లో తగు మార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పాడిపరిశ్రమ లాభసాటిగా ఉంటుంది.
రైతులు సాధారణంగా ప్రతిరోజు 12 గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగానూ, రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చలి కాలంలో పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల శరీరం వేడిగా ఉండేందుకు కావాల్సిన ఆహారాన్ని అందించాలి. లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది.
చలికాలంలో అనేక వైరస్ లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గొర్రెలు, మేకలు, గేదెలు రోగాల భారీన పడతాయి. జీవాలను ఆరుబయట ఉంచడం వల్ల కూడా అనారోగ్యం పాలవుతాయి. పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ గోనెసంచులు అమర్చాలి. ఇక వాటికి ఇచ్చే ఆహారంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహారంలో కనీసం 18 – 20 శాతం మాంసకృత్తులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక 70- 72 శాతం శక్తిని ఇచ్చే పదార్ధాలను ఉండేలా చూడాలి. న్యూట్రియన్స్, మినరల్స్ , విటమిన్స్ లోపం లేకుండా జాగ్రత్తపడాలి. అంతే కాకుండా చలి ఉన్న సమయాల్లో.. ఉదయం మరియు రాత్రి పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చి గడ్డిని ఉదయం సమయం అంటే 11 గంటల ప్రాంతంలో అందించినా పర్వాలేదు. పశువులకు నీరు అందించే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయంలో నీటి తొట్టిలో నీరు నిండా నింపకుండా రాత్రికి సరిపడా నీటిని మాత్రమే నింపాలి. ఇక గోరువెచ్చని నీటిని అందించడం, ఎప్పుడూ తొట్టిలో నీరు మారుస్తూ ఉండాలి.
చలికాలంలో పశువులకు ఎక్కువగా గాలి కుంటూ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. నవంబర్, డిసెంబర్ కాలంలో గాలి కుంటూ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది అని చెప్తున్నారు పాడిపరిశ్రమ నిపుణులు. ఈ క్రమంలో అశ్రద్ధ చేయకుండా గాలి కుంటూ వ్యాధికి సంబంధిన టీకాను వేయించాలి. అదేవిధంగా నట్టల నివారణ కోసం పేడ పరీక్ష చేయించాలి. ఎక్కువగా పాలు ఇచ్చే పశువులకు ప్రతిరోజు 50 గ్రాముల మినరల్ మిక్చర్ ని దాణాలో కలుపుకోవాలి.
MANAGEMENT OF DAIRY CATTLE DURING WINTER